More

  ఇస్లామిక్ దేశాలను హడలెత్తిస్తున్న ఇజ్రాయిల్ సివిల్ డిఫెన్స్ స్ట్రాటజీ..!

  నమస్తే.. అస్తిత్వ పోరాటంలో అనేక సవాళ్ళను అధిగమిస్తూ.. ఎప్పటికప్పుడు తన బలాన్ని నిరూపించుకుంటూ.. అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణలతో.. నిరంతరం తనను తాను మెరుగుపరచుకుంటూ.. కాలచక్రంలో పరిభ్రమిస్తున్నాడు మనిషి. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం.. మెరుగైన జీవన ప్రమాణాలు.. విలువలతో కూడిన సమాజాన్నినిర్మించుకున్నా.. ఎక్కడో ఒకచోట.. ఎదో ఒక రకంగా హింస చెలరేగుతూనే ఉంది. ఆధిపత్య భావజాలపు ప్రభావమో.. నిరంకుశ పాలన పట్ల ప్రతీకారమో.. విస్తరణవాదపు ఫలితమో.. విప్లవాల చారిత్రక అవసరమో.. ఏదైతే ఏంటి.. చరిత్ర పొడవునా నెత్తుటి చారలే నిండి ఉన్నాయి. ప్రపంచ దేశాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే.. బ్రిటన్ సామ్రాజ్యవాదం.. ముస్లిం దండయాత్రలు.. హిట్లర్ నిరంకుశత్వం.. రష్యా రక్తదాహం.. నల్ల జాతీయుల అమ్మకాలు.. వ్యాపారం ముసుగులో ఆక్రమణలు.. నాగరికత నెపంతో మతాంతీకరణలు వెరసి స్వాతంత్ర్య ఉద్యమాలు.. సాయుధ పోరాటాలు.. ప్రచ్ఛన్న యుద్ధాలు.. ఇలా చెప్పుకుంటూ పొతే అనేక ఉదాహరణలు. మానవుడి మనుగడని ఒక్క వాక్యంలో నిర్వచించాలి అంటే.. Struggle For Existence – Survival Of the Fittest అస్థిత్వం కోసం పోరాటం.. సామర్థ్యమే మనుగడకు ప్రమాణం. ఈ వాక్యానికి చక్కని ఉదాహరణ ఇజ్రాయిల్.

  శతాబ్దాల పాటు అనేక యుద్ధాలను ఎదుర్కొని.. బలమైన శక్తుల ముందు నిలబడలేక సొంత దేశాన్ని వదులుకుని.. సుదూర ప్రాంతాలకు వలసవెళ్లి.. ఆయా దేశాల్లోనూ ఎన్నో అవమానాలను భరించి.. ఎంతో మందిని కోల్పోయి.. తరువాతి తరాలకు తమ లక్ష్యాలను అందిస్తూ.. వందల సంవత్సరాల అనంతరం యూదులు తిరిగి ఇజ్రాయిల్ దేశంలో 1948లో అధికారికంగా అడుగుపెట్టారు. అలా లక్షలాది యూదుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఇజ్రాయిల్ నేడు బలమైన సైనికశక్తిగా.. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన దేశంగా నిలిచింది. ఇజ్రాయిల్ సాధించినఅపూర్వ విజయాలను.. ఆ దేశ ఇంటలిజెన్స్ ఏజెన్సీ MOSSAD నిర్వహించిన అత్యద్భుతమైన సీక్రెట్ ఆపరేషన్స్ అనురించిన ఆసక్తికరమైన విశేషాలను నేను మీకు సిరీస్ ఆఫ్ డియోస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

  ఇప్పుడు ముందుగా ఇజ్రాయిల్ తమ దేశ పౌరులను కాపాడుకోవడానికి Civil Defence System ఎలా అభివృద్ధి చేసుకుందో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ అన్నమాటకి అర్థం దేవుడిపై కూడా పోరాటం చేయగల సమర్థుడు అని. యూదు మతానికి ఆద్యుడైన అబ్రహం మనవడు జాకోబ్ కి దేవదూతలు ఇజ్రాయిల్ అని బిరుదునిచ్చారట. అతను నిర్మించింది కాబట్టి ఆ దేశానికి ఇజ్రాయిల్ అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఆ దేశం అత్యంత బలమైనశక్తిగా అవతరించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఇజ్రాయిల్ ని 1948కి ముందు.. ఆ తర్వాత అని విభజించి చూడాలి. వందల సంవత్సరాల పాటు ఇతర దేశాల్లో తలదాచుకున్న యూదులు.. అనేక ఉద్యమాల ఫలితంగా 1948లో స్వదేశాన్ని తిరిగి సాధించుకున్నారు. పశ్చిమాసియాలోని అరబ్బు దేశాల నడుమ సుమారు 22 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉన్న ఇజ్రాయిల్ అనతి కాలంలోనే శక్తివంతమైన దేశంగా అవతరించింది. మధ్యదరా సముద్రానికి ఆనుకుని ఉన్న ఇజ్రాయిల్ చుట్టూ అరబ్బు దేశాలున్నాయి.. ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైరుతిలో ఈజిప్టు, పశ్చిమాన మధ్యదరాస ముద్రాలు ఉన్నాయి. 1947లో భారతదేశాన్ని విభజించిన బ్రిటిషర్లు.. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్లను ఒకదేశంగా ఏర్పరచినట్లు.. ఇజ్రాయిల్ కు రెండు పక్కల ఉన్న గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకులతో పాలస్తీనాను ఏర్పాటు చేశారు.

  మతాల ఘర్షణ నేపథ్యంలో.. మధ్యన ఉన్న జెరూసలేం 1967 వరకు ఐక్యరాజ్యసమితి పరిధిలో ఉండేది. 1967లో జరిగిన యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ తిరిగి జెరూసలేంను స్వాధీనం చేసుకుంది. చుట్టూ ఉన్న శత్రు దేశాల మధ్య శతాబ్దాల రక్తచరిత్ర కలిగిన ఇజ్రాయిల్ మనుగడే కత్తిమీద సాములాంటిది. ఏ క్షణాన ఎటువంటి ముప్పు ముంచుకొస్తుందో తెలియని అయోమయస్థితిలోనే ఆ దేశం అప్రతిహత విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన సుమారు 28 దేశాలు ఇజ్రాయిల్ ను ఒక స్వతంత్ర దేశంగా నేటికీ గుర్తించట్లేదు. అరబ్ లీగ్ లోని 15 దేశాలు.. Organisation of Islamic Cooperation (OIC) లో భాగస్వామ్యమైన 10 దేశాలు సహా.. వెనిజులా, క్యూబా, ఉత్తర కొరియాలు కలిపి మొత్తం 28 దేశాలు ఇజ్రాయిల్ ను బద్ద శత్రువులా చూస్తాయి. ఇజ్రాయిల్ పాస్ పోర్టుతో కొన్ని దేశాల్లోకి అనుమతి కూడా లభించదు. ఇతర దేశ పౌరుల పాస్ పోర్టుల్లో ఇజ్రాయిల్ స్టాంపు ఉన్నట్టయితే కొన్ని దేశాలు వీసా నిరాకరిస్తాయి. ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నిషేధాజ్ఞల మధ్య ఇజ్రాయిల్.. అసలెలా మనుగడ సాగిస్తోంది అంటే.. 3 కారణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

  1. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రక్షణ వ్యవస్థ, అంతకుమించి అంకితభావంతో పనిచేసే సైన్యం..
  2. మెరుగైన నిఘావ్యవస్థ – ప్రపంచ దేశాల గుట్టుని పుక్కిటపట్టే గూఢచారుల సామర్థ్యం..
  3. బాధ్యతాయుతమైన రాజకీయవ్యవస్థ, ఆ దేశ పౌరుల అచంచలమైన దేశభక్తి.

  ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా ఇజ్రాయిల్ విజయవంతంగా నిలబడడానికి ఈ మూడు అంశాలే కారణం. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే నిరంతర ప్రమాదాల మధ్య ఇజ్రాయిల్.. ఆ దేశ ప్రజలను అసలెలా కాపాడుకుంటుంది.. ఇప్పుడు చూద్దాం. సుమారు 93 లక్షల 46 వేల జనాభా కలిగిన ఇజ్రాయిల్ లో అరబ్బులు, సంప్రదాయ యూదులు మినహా 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సైనిక శిక్షణ తీసుకోవాల్సిందే. మత ప్రాతిపదికన దాడులను ఎదుర్కొన్న ఇజ్రాయిల్ ఆ దేశంలోని సైనిక శిక్షణలో అరబ్బులను మినహాయించింది. ఇక ప్రపంచ దేశాలతో పోల్చితే కంబాట్ పొజిషన్లలో పనిచేసే మహిళలు అధికంగా ఉన్నది ఇజ్రాయిల్లోనే. తప్పనిసరిగా తీసుకోవలసిన సైనిక శిక్షణ అనంతరం వేరే ఆసక్తి కలిగిన రంగాల్లో పనిచేయడానికి పౌరులకు అనుమతి ఉంటుంది.

  ఇక సామాన్య ప్రజలను కాపాడేందుకు ఇజ్రాయిల్ 1951లో ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. అందులో ఇజ్రాయిల్ ఎదుర్కునే ప్రమాదాలను అధ్యయనం చేసిన ప్రభుత్వం.. వాటికి అనుగుణంగా రక్షణాత్మక చర్యలను కూడా తీసుకుంది. అందులో అతి ముఖ్యమైనవి.. బాంబ్ షెల్టర్స్. శత్రు దేశాలు మిస్సైల్స్ తో, రాకెట్స్ తో దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 50 వ శకంలోనే దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్లేసుల్లో బాంబు షెల్టర్లు నిర్మించింది. అంతేకాదు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటప్పుడు కచ్చితంగా బాంబు షెల్టర్ ను కూడా నిర్మించుకోవడం తప్పనిసరి చేస్తూ చట్టాన్నిరూపొందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అనేక కూడళ్లలో ప్రత్యేక సైరెన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. శత్రు దేశాల కదలికలను రాడార్ల నుంచి గుర్తించి సైరన్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సైరెన్ మోగిన వెంటనే ప్రజలంతా సమీపంలోని బాంబు షెల్టర్లలోకి వెళ్లేలా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించింది. ఈ బాంబు షెల్టర్లు వివిధ ఆకృతుల్లో.. దేశ వ్యాప్తంగా కనిపిస్తాయి. ఒక చోటు నుంచి వేరొక చోటుకి తరలించే వీలుండేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాంబు షెల్టర్లను అక్కడక్కడా ఏర్పాటు చేసింది. గాజా స్ట్రిప్ సమీపంలో.. సరిహద్దుకు దగ్గర్లోని గ్రామాల్లో వందలాది బాంబు షెల్టర్లు కనిపిస్తాయి.

  అంతేకాదు 90 వ దశకంలో ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం మిస్సైల్స్ ద్వారా ప్రమాదకర రసాయనాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేసిన ఇజ్రాయిల్ అందుకనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రసాయన యుద్దాన్ని కూడా తట్టుకునే విధంగా యుద్ధప్రాతిపదికన సరిహద్దు గ్రామాల్లోని ప్రతి ఇంటికి అనుసంధానంగా కెమికల్ ప్రూఫ్ సీల్డ్ రూమ్స్ నిర్మించింది. అంతేకాదు.. ప్రమాదకర రసాయనాలను నిరోధించే గ్యాస్ మాస్కులను లక్షలాదిగా ప్రజలకు పంచి పెట్టింది. అయితే ఇరాక్ అటువంటి రసాయన యుద్ధం ఏమి చేయలేదు. కాని ఇజ్రాయిల్ యుద్ధ సన్నద్ధతకు నిదర్శనమిది. 1992 లో సివిల్ డిఫెన్స్ ను మరింత మెరుగుపరుస్తూ హోం ఫ్రంట్ కమాండ్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఇజ్రాయిల్ ప్రభుత్వం. యుద్ధం సంభవించినపుడు.. లేదా ఏదైనా విపత్కర పరిస్థితిలో సాధారణ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్త.. వారి రక్షణ బాధ్యతలను చూసుకునే విధంగా ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మరో వైపు టెర్రరిస్టుల మానవ బాంబు దాడుల్లో, బాంబు పేలుళ్లలో మరణించిన వారి శవాలను గుర్తించి.. విడివడిన శరీర భాగాలను ఒకచోటుకి చేర్చి వారి కుటుంబానికి అందించేందుకు ZAKA అనే ఒక ప్రత్యేక దళం ఇజ్రాయిల్లో పని చేస్తుంది అంటే అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న ప్రమాద స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

  అంతేకాదు.. విపత్కర పరిస్థితులను అంచనా వేస్తూ.. దానికనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా.. నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ, యుద్ధ సమయంలో అవసరానికి సరిపడా మందులు, ఆహరం అందించే విధంగా ఎమర్జెన్సీ ఎకానమీ వంటి ప్రత్యేక విభాగాలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు.. శత్రుదేశపు మిస్సైల్స్ ను.. రాకెట్లను క్షణాల్లో నిర్వీర్యం చేసే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రకాల యాంటీ బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని ఇజ్రాయిల్ కలిగిఉంది. అందులో ఒకటి arrow missile.. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఈ arrow missile ని 1986 నుంచి దశలవారీగా అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి. మొత్తం రెండు దశలను దాటుకుని ఇప్పుడు arrow 3 గా ఇజ్రాయిల్ అమ్ములపొదిలో చేరిన ఈ మిస్సైల్ తో శత్రు దేశపు శాటిలైట్స్ ను కూడా కూల్చే సామర్థ్యం ఉంది.. దీన్ని మరింత అభివృద్ధి పరుస్తున్నట్టు ఇజ్రాయిల్ డిఫెన్స్ వర్గాలు ఈ మధ్యనే ప్రకటించాయి. ఇక రెండో యాంటీ మిస్సైల్ david sling.

  ఇజ్రాయిల్ డిఫెన్స్ కాంట్రాక్టర్ రఫేల్ అడ్వాన్సుడ్ ఫ్రెంచ్ సిస్టమ్స్ – అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్ రేతియిన్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. 40 నుంచి 300 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఈ david sling ఇజ్రాయిల్ అమ్ములపొదిలోని అత్యుత్తమ anti missile system. 2017 నుంచి ఇజ్రాయిల్ దీన్ని వినియోగిస్తోంది. ఇక ఇజ్రాయిల్ అభివృద్ధి చేసిన మరో యాంటీ మిస్సైల్ సిస్టం ఐరన్ డోమ్. తాజాగా హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన మిస్సైల్స్ ను నిర్వీర్యం చేసింది ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీతోనే. సుమారు 4 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ లోని లక్ష్యాలను చేధించగలిగే ఈ ఐరన్ డోమ్ సిస్టమ్ ను 2011 నుంచి ఇజ్రాయిల్ వినియోగిస్తోంది. ఇవీ ఇజ్రాయిల్ డిఫెన్స్ సిస్టమ్ గురించిన వివరాలు.

  విస్తీర్ణం ప్రకారం.. ఇజ్రాయిల్ తెలంగాణాలో సగం కూడా ఉండదు. జనాభా ప్రకారం.. హైదరాబాద్ కంటే తక్కువ.
  కానీ మనదేశంలో లాగా అధికారం కోసం దేశ ప్రయోజనాలను ఫణంగా పెట్టె నాయకులు అక్కడుండరు.. అధికార పార్టీని ఇరుకునపెట్టడం కోసం శత్రుదేశాలను కీర్తించే ప్రతిపక్ష నాయకులూ ఉండరు. ఎంత విపత్కర పరిస్థితి ఎదురైనా దేశం కోసం నిలబడే బాధ్యతాయుతమైన ప్రజాభాగస్వామ్యం వల్లనే ఇజ్రాయిల్ మనుగడ సాధ్యమవుతోంది. ప్రపంచ దేశాలను తమ అనూహ్య చర్యలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ నిర్వహించిన స్పెషల్ సీక్రెట్ ఆపరేషన్స్ గురించి నెక్ట్స్ వీడియోలో ఎక్స్ ప్లెయిన్ చేస్తాను.

  Trending Stories

  Related Stories