ఎంతో మంది పిల్లలకు కూడా కరోనా మహమ్మారి సోకుతూ ఉంది. అయితే మహారాష్ట్రలోని అధికారులు మాత్రం 8 ఏళ్ల బాలుడితో ఐసోలేషన్ సెంటర్ మరుగుదొడ్లను శుభ్రం చేయించడం వివాదాస్పదమవుతోంది. మహారాష్ట్ర లోని బుల్దనా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలుడికి ఓ వ్యక్తి అలా శుభ్రం చేయాలి.. ఇలా శుభ్రం చేయాలి అంటూ సూచనలను ఇస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన మారోద్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువవడంతో జిల్లా పరిషత్ పాఠశాలను ఐసోలేషన్ కేంద్రంగా మార్చారు. మే 29న జిల్లా ఉన్నతాధికారులు పరీశీలన కోసం వస్తున్నారని ఆ గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే గ్రామ పంచాయతీ సమితి సభ్యులు ఐసోలేషన్ సెంటర్ ను శుభ్రంగా ఉంచాలని భావించారు. అయితే ఇక్కడ వీరు తీసుకున్న నిర్ణయమే తీవ్ర విమర్శల పాలు చేసింది. ఎనిమిదేళ్ల బాలుడితో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పిలిపించారు. ఓ వ్యక్తి అతడిని బెదిరిస్తూ శుభ్రం చేస్తూ ఉండడం వీడియోలో చూడొచ్చు. ఆ బాలుడు శుభ్రం చేయనని చెబుతున్నా కూడా అక్కడ ఉన్న ఓ వ్యక్తి అసలు పట్టించుకోలేదు. ఆ బాలుడిని బెదిరిస్తూ మరుగుదొడ్లను శుభ్రం చేయించాడు. ఆ తర్వాత బాలుడికి 50 రూపాయలు మరుగుదొడ్లు శుభ్రం చేసినందుకు గానూ చేతిలో పెట్టారు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు పంచాయతీ సమితి ఉద్యోగిని విధుల నుండి తొలగించారు. జిల్లా అధికారి రామమూర్తి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వైరల్ అవుతున్న వీడియో లో కనిపిస్తున్న ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు రామమూర్తి మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని రామమూర్తి స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టకూడదని ఆమె డిమాండ్ చేశారు. చిన్న పిల్లాడితో ఇలా మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలని ఆమె కోరారు.
మహారాష్ట్రలోని ఒక్క జిల్లాలో ఒక్క జిల్లాలోనే ఎనిమిది వేల మందికి పైగా చిన్న పిల్లలకు కరోనా సోకింది. ఇలా ఓ వైపు కరోనా మహమ్మారి తో మహారాష్ట్రలోని ప్రజలు పోరాడుతూ ఉంటే.. అధికారులు చిన్న పిల్లాడితో ఐసోలేషన్ సెంటర్ మరుగుదొడ్లు శుభ్రం చేయించడం తీవ్ర వివాదాస్పదమైంది.