More

    కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు బహిరంగంగా బెదిరింపులు

    కర్నాటక హైకోర్టు ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి ఆచారం కాదని ధృవీకరిస్తూ సూచనలు చేసిన రెండు రోజుల తర్వాత, తమిళనాడు తౌహీద్ జమాత్ (TMTJ) అనే ఇస్లామిస్ట్ సంస్థ గురువారం (మార్చి 17) మధురైలో నిర్వహించిన కార్యక్రమంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై బెదిరింపులకు దిగింది.

    ఇందు మక్కల్ కట్చి షేర్ చేసిన వీడియోలో, హిజాబ్ కేసు తీర్పుపై న్యాయమూర్తులు హత్యకు గురైతే, వారి మరణానికి వారే బాధ్యత వహిస్తారని TMTJ నాయకుడు కోవై R. రహమతుల్లా తెలిపారు. న్యాయవ్యవస్థ తనను తాను బీజేపీకి అమ్ముకుందని, కోర్టు నిర్ణయం చెల్లదని అన్నారు. అంతేకాకుండా ఈ తీర్పు చట్టవిరుద్ధమని రహమతుల్లా వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా సూచన మేరకే కర్ణాటక హైకోర్టు ఈ తరహా తీర్పు వెలువరించిందని రహమతుల్లా ఆరోపించారు.

    తమిళనాడు తౌహీద్ జమాత్ నాయకుడు హైకోర్టు నిర్ణయంపై దుష్ప్రచారం చేయడమే కాకుండా, న్యాయమూర్తులు తమ ‘పక్షపాత’ తీర్పుకు సిగ్గుపడాలని అన్నారు. న్యాయమూర్తుల వ్యక్తిగత విశ్వాసాలపై కాకుండా రాజ్యాంగం ఆధారంగా కోర్టు తీర్పులు రావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న పిల్లల చేత కూడా హింసను ప్రేరేపించే నినాదాలు చేయించారు.

    వివాదాస్పద వీడియోకు సంబంధించిన సుదీర్ఘ వీడియోను ‘Online Dhava 24X7’ అనే ఛానెల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. దాదాపు 17 నిమిషాల 40 సెకన్ల వీడియోలో, కోవై ఆర్. రహ్మతుల్లా మాట్లాడుతూ భారతదేశంలో సాధువులు నగ్నంగా తిరుగుతుంటే, ముస్లిం బాలికలు హిజాబ్ వంటి నిరాడంబరమైన దుస్తులు ధరించకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. “మేము మోదీ, యోగి, అమిత్ షాలకు భయపడము. మేము అల్లాకు మాత్రమే భయపడతాము. మేము సహనం కోల్పోయేలా చేయకండి. మేము సహనం కోల్పోతే, మీరు ఉనికిలో ఉండరు.” అంటూ హెచ్చరించారు కూడా..!

    హిజాబ్ వివాదం.. కర్ణాటక హైకోర్టు తీర్పు:

    గత నెలలో ఉడిపిలోని పీయూ కాలేజీకి చెందిన కొందరు ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి తరగతులకు వెళ్లేందుకు అనుమతించాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనిఫాంలో హిజాబ్ భాగం కాదని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేయడంతో వారికి తరగతుల్లో ప్రవేశం నిరాకరించబడింది. అప్పటి నుంచి ‘విద్యార్థులు’ బురఖాలు ధరించి నిరసనలు చేపట్టారు.

    హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు వేసిన పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సరైనదని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు.. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదని అన్నారు. విద్యాసంస్థలు చెప్పిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుందని అన్నారు. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని పేర్కొంటూ, విద్యార్థులు ప్రొటోకాల్‌ పాటించాల్సిందేనని తెలిపింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నీ కొట్టేసింది ధర్మాసనం.

    Trending Stories

    Related Stories