More

    యుద్ధ సమయంలోనూ ఉక్రెయిన్ లో అన్నం పెడుతున్న ఇస్కాన్

    రష్యా-ఉక్రెయిన్ రాజకీయ సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య.. ఉక్రెయిన్‌లోని ప్రజలు ఆహారం, ఆశ్రయం లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. భారత అధికారులు అక్కడ ఉన్న విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. అక్కడ చిక్కుకుపోయిన ప్రజలకు సహాయం చేయడానికి ఇస్కాన్ ముందుకు వచ్చింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ఉక్రెయిన్ దేశంలోని ప్రజలకు తన సహాయాన్ని అందించింది. ఈ విషయాన్ని ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ ట్విట్టర్‌ ద్వారా ధృవీకరించారు. “ఉక్రెయిన్‌లోని మా ఇస్కాన్ దేవాలయాలు అవసరమైన వారికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మా దేవాలయాల వద్ద మీకు స్వాగతం” అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ దేశంలోని పరిస్థితిని వివరిస్తూ.. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్ కు వచ్చిన ప్రజలకు సంబంధించిన వీడియోలను పంచుకున్నారు.

    రాధారామన్ దాస్ ట్విట్టర్ పోస్ట్ లలో ఉక్రెయిన్ అంతటా 54 ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయని, తాజా ఆహారం, మంచి నీటి కోసం వారి సమీపంలోని ఆలయాలకు వెళ్లాలని చెబుతూ లొకేషన్ ను షేర్ చేశారు.ఉక్రెయిన్ నుండి వచ్చే భారతీయ విద్యార్థులు మరియు శరణార్థులకు ‘ఇస్కాన్ హంగేరీ’ ఆహారాన్ని అందించడం ప్రారంభించిందని తెలిపారు. హంగేరిలోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులకు ఆహారం, నీటిని ఏర్పాటు చేయడంలో ఇస్కాన్ సహాయాన్ని కోరింది.

    ఉక్రెయిన్ లోని పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైనికులపైనే కాకుండా, పౌరులపై కూడా రష్యన్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న మన వాళ్లను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రానున్న మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయగా.. ఆ దేశంలో చిక్కుకున్న వారిని సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లొవాక్ రిపబ్లిక్ దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి తీసుకొస్తున్నారు. ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ లో భారతీయులెవరూ లేరని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ తెలిపారు. కీవ్ లో ఉన్న భారతీయులు అందరూ సురక్షితంగా నగరాన్ని వీడారని చెప్పారు.

    Trending Stories

    Related Stories