హాజీ షఫివుల్లా ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ పై దాడి..

0
864

గురువారం రాత్రి, బంగ్లాదేశ్‌లోని ఢాకా డివిజన్‌, లాల్మోహన్ సాహా స్ట్రీట్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయంపై ఓ గుంపు దాడి చేసింది. ఈ ఘటనను శ్రీ శ్రీ రాధాకాంత జియు మందిర్ నిర్వాహకులు ధృవీకరించారు. 62 ఏళ్ల హాజీ షఫివుల్లా ఆధ్వర్యంలో 150-200 మందితో కూడిన మూక ఇస్కాన్ దేవాలయాన్ని ముట్టడించింది. వారు విగ్రహాలను అపవిత్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడమే కాకుండా డబ్బు, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నారు.

ఇండియా టుడే ప్రచురించిన నివేదిక ప్రకారం, దాడిలో ముగ్గురు భక్తులు సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహార్ హల్దార్, రాజీవ్ భద్ర గాయపడ్డారు. ప్రముఖ ట్విటర్ హ్యాండిల్ Voice of Bangladeshi Hindus శ్రీ శ్రీ రాధాకాంత జియు మందిర్‌ పై జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలను పంచుకున్నారు.

“ఢాకాలోని రాధాకాంత ఇస్కాన్ ఆలయంపై దాడి కొనసాగుతోంది. భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. హిందూ కార్యకర్త పండిట్ ప్రదీప్ చంద్ర ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో గాయపడిన ఇస్కాన్ భక్తులు తమపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

దాడి జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు చెప్పుకొచ్చారు. కాపాడండని చాలాసార్లు పోలీసులను వేడుకున్న తర్వాత స్పందించారని వివరించారు. తమ ఫోన్ లను లాక్కున్నారని, దాడి కూడా చేశారని.. అందుకు సాక్ష్యాలుగా అయ్యిన గాయాలను చూపించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు మహ్మద్‌ ఇస్రాఫ్‌ సూఫీ (31), హాజీ షఫివుల్లా (62)లు దాడికి పాల్పడ్డారు. గురువారం (మార్చి 17) సాయంత్రం ఈ దాడి జరిగింది. కర్రలు, రాడ్లు, కొడవళ్లు, సుత్తి వంటి ఆయుధాలతో, ఉన్మాద గుంపు ఆలయం దక్షిణ గోడతో పాటు పాత నిర్మాణాలను ధ్వంసం చేసింది. వారు అల్లర్లు చేయాలనే ఉద్దేశ్యంతో రెచ్చగొట్టే విధంగా నినాదాలు కూడా చేశారు.

ఇస్కాన్ భక్తులు తొలుత ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేసి పోలీసులను పిలిపించి దాడిని అడ్డుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, బాధితుడు నిహార్ హల్దార్ గుంపును ఎదుర్కొనేందుకు వెళ్లాడు. అతడిని హత్య చేయాలనే ఉద్దేశంతో అతని ఫోన్ లాక్కొని, ఆ గుంపు దారుణంగా దాడి చేసింది. ఐదు లక్షల విలువైన వస్తువులను దొంగిలించారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్కాన్ ఆలయంపై కూడా దుండగులు రాళ్లు రువ్వారని, భక్తులను సజీవ దహనం చేస్తామని బెదిరించారని ఫిర్యాదుదారు సుమంత్ర చంద్ర తెలిపారు.

2021 దుర్గాపూజ సందర్భంగా ఇస్కాన్ ఆలయంపై దాడి:

గత ఏడాది అక్టోబర్ 15న, బంగ్లాదేశ్‌లోని నోఖాలీ జిల్లాలో ఉన్న ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ఆలయంపై ఉన్మాద మూక దాడి చేసింది. ఇస్కాన్ ఆలయం, భక్తులపై ఒక గుంపు హింసాత్మకంగా దాడి చేసింది. ఆలయం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఒక భక్తుడి పరిస్థితి విషమంగా మారింది. హిందువులందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఇస్కాన్ ట్వీట్ కూడా చేసింది.