రష్యా నుండి భారత్ లోకి ఉగ్రవాదిని పంపాలనుకున్న ఐసిస్.. ఎలా పట్టుకున్నారంటే..!

0
785

భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ పన్నుతున్న కుట్రలు అన్నీ.. ఇన్నీ కావు. ఎన్నో ఏళ్లుగా భారత్ ను కదిలించాలని.. ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నుతూనే ఉంది. ఎప్పటికప్పుడు భద్రతా దళాలు, నిఘా వర్గాలు వీటిని తిప్పి కొడుతూ ఉన్నాయి. భారత్ లోని ముఖ్య నగరాలనే కాకుండా.. కీలక నేతలను కూడా తుదముట్టించాలనే ప్రణాళికలు వేసింది ఐసిస్. తాజాగా అలాంటి ఓ ఆపరేషన్ బట్టబయలు అయింది. అది కూడా రష్యాలో..!

భారతీయ జనతా పార్టీలో కీలక నేత లక్ష్యంగా ఐసిస్ ఆత్మాహుతి దాడి చేసేందుకు సిద్ధమవ్వగా.. ఈ ప్లాన్ ను భగ్నం చేసింది రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ). భారత్ లో ఆత్మాహుతి ఉగ్రదాడి చేసేందుకు ఐసిస్ కుట్రను పసిగట్టిన రష్యా.. ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రష్యా భద్రతా ఏజెన్సీ ఎఫ్ఎస్బీ నిషేధిత ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించిందని.. అతడిని అరెస్ట్ చేసిందని రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఇందుకోసం రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సూసైడ్ బాంబర్ ను టర్కీ ఇస్తాంబుల్ వేదికగా ఐసిస్ రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలిసింది. రష్యా మీదుగా భారత్ కు వెళ్తే అనుమానం రాదనే ఉద్దేశంతో డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్న తరుణంలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు ఈ కుట్రను భగ్నం చేశారు.