More

    పాకిస్తాన్ షియా మసీదులో మరణ మృదంగం.. తామే కారణమని చెప్పిన ఐసిస్

    పాకిస్తాన్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో రద్దీగా ఉండే షియా మసీదులో జరిగిన బాంబు పేలుడులో 57 మంది మరణించారు 200 మందికి పైగా గాయపడ్డారని వార్తా సంస్థ PTI నివేదించింది. పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలోని జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఇద్దరు దుండగులు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.. కాపలాగా నిలబడిన పోలీసులపై కాల్పులు జరిపారని రాజధాని నగర పోలీసు అధికారి పెషావర్ ఇజాజ్ అహ్సన్ తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటన తర్వాత పేలుడు సంభవించింది. ఆత్మాహుతి చేసుకున్నట్లు తెలుస్తోంది.

    పెషావర్‌లోని షియా మసీదులో జరిగిన ఘోర బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. పాకిస్తాన్‌లో జరిగిన అత్యంత రక్తపాత దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. ISIS ప్రకటన ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ విభాగం, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్(ISIS-K), ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ పేలుడు ఆఫ్ఘన్ ఆత్మాహుతి బాంబర్ ద్వారా జరిగింది. మోటర్‌బైక్‌పై వచ్చిన ఒక దుండగుడు మసీదులోకి ప్రవేశించే ముందు అక్కడి పోలీసు అధికారులను కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆత్మాహుతి బాంబులను పేల్చుకున్నాడు. పెషావర్‌లోని కిసా ఖ్వానీ ప్రాంతంలోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థన సమయంలో పేలుడు సంభవించింది. దాడికి సంబంధించి పాకిస్తాన్ నిఘా ఏజెన్సీ ఎటువంటి హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేయలేదని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ తెలిపారు. పాకిస్తాన్‌ను అస్థిరపరిచేందుకు ఇదో పెద్ద కుట్ర అని ఆయన అన్నారు.

    పెషావర్ కు 190 కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం రోజున ఈ విధ్వంసకర దాడి జరిగింది. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియన్ జట్టు ద్వైపాక్షిక సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి సంకోచించింది. ఆస్ట్రేలియన్ జట్టు ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖతో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం జరుగుతున్న రావల్పిండి టెస్ట్ మ్యాచ్ కోసం ఇస్లామాబాద్‌లో ఉంది. ఈ పర్యటన కోసం వారికి ప్రెసిడెంట్ లెవెల్ సెక్యూరిటీ ని అందించారు. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లు లాహోర్, కరాచీలో జరుగుతాయి. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై దాడి జరిగిన తర్వాత, పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ దశాబ్దకాలం పాటు నిలిచిపోయింది.

    Trending Stories

    Related Stories