భారత్ లో భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఐఈడీని టిఫిన్ బాక్స్‌లో పెట్టి ఈ పేలుడు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. భారతదేశంలో పండుగల సీజన్ లో రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు జరపడానికి ఐఎస్ఐ ప్రణాళిక రచించిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులు కూడా దేశంలోకి చొరబడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించాయి. ఈ ప్లాన్ అమలు చేయడానికి ఇప్పటికే మనుషులు, అవసరమైన ఆర్థిక వనరులు, వస్తువులను సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్ వెల్లడించింది. పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ నవరాత్రి, రామ్‌లీలా సందర్భంగా పేలుడు కోసం రచించిన ప్రణాళికను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇప్పటికే భగ్నం చేసింది. దీనికి సంబంధించి ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఈ ఆపరేషన్ నుంచి ఆడీఎక్స్ ఉన్న ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సెప్టెంబర్ 14 న వివిధ రాష్ట్రాల్లో పలు దాడులు చేయడం ద్వారా ఇద్దరు పాకిస్తాన్-ఐఎస్ఐ శిక్షణ పొందిన ఉగ్రవాదులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను జాన్ మహ్మద్ షేక్ అలియాస్ ‘సమీర్’, ఒసామా, మూల్‌చంద్, జీషన్ ఖమర్, మొహమ్మద్ అబూ బకర్ మరియు మొహమ్మద్ అమీర్ జావేద్‌గా గుర్తించారు. ఒసామా, ఖమర్ లు పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. AK-47 తో సహా పేలుడు పదార్థాలు, తుపాకీలను ఉపయోగించడానికి వారికి శిక్షణ ఇవ్వబడింది. “పలు రాష్ట్రాలలో నిర్వహించిన ఆపరేషన్‌లో, మేము పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఆరుగురిని అరెస్టు చేసాము. వారిలో ఒసామా మరియు ఖమర్ ఈ సంవత్సరం శిక్షణ కోసం పాకిస్తాన్‌కు వెళ్లారు, ఆ తర్వాత వారు భారతదేశానికి తిరిగి వచ్చారు” అని ప్రత్యేక పోలీసు కమిషనర్ ( స్పెషల్ సెల్) నీరజ్ కుమార్ ఠాకూర్ ఇంతకు ముందే చెప్పారు.
భారత్ ను దెబ్బతీయాలని ఐఎస్ఐ ఎప్పటి నుండో ప్రయత్నాలను చేస్తూ ఉంది. పండుగ సీజన్‌లో భారతదేశంలో పెద్ద టెర్రర్ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు అందరినీ అలర్ట్ చేశాయి. పండుగ సమయంలో రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ టిఫిన్ బాంబులను ఉంచాలని ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. ఎప్పటికప్పుడు భారత ఇంటెలిజెన్స్ విభాగాలు పోలీసులను అలర్ట్ చేస్తూ వస్తున్నాయి.