అఫ్ఘనిస్థాన్ లో ఇటీవలి కాలంలో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే..! అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండడంతో తాలిబన్లు పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఓ వైపు ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా భూభాగాన్ని సొంతం చేసుకున్న తాలిబన్లకు పాకిస్థాన్ నుండి మద్దతు ఉందన్న విషయం తెలిసిందే..! ఇక ఇదే అదనుగా భావించిన పాకిస్థాన్ తనదైన శైలిలో కుట్రలు పన్నుతోంది. భారత్ ను ఎలాగైనా నష్టపోయేలా చేయాలని పాక్ తన నీచ బుద్ధిని మరోసారి ప్రదర్శిస్తోంది.
అఫ్ఘనిస్థాన్ అభివృద్ధి, శాంతి స్థాపన కోసం గత కొన్నేళ్లుగా భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందుకు చిహ్నంగా నిలిచిన ప్రాజెక్టులపై, అక్కడి భారత ఆస్తులపై దాడులే లక్ష్యం పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ 10,000 మంది సాయుధులను అఫ్ఘనిస్థాన్‌కు పంపింది. తాలిబన్లకు అండగా నిలుస్తూ అక్కడి భారత ఆస్తులు, భవనాలపై దాడులు జరుపడమే వీరి ప్లానింగ్ అని తెలుస్తోంది. భారత్ అక్కడి నుంచి రాయబారులను ఇప్పటికే వెనక్కి రప్పించింది. అయినప్పటికీ అఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది.
పాకిస్తాన్ ఐఎస్ఐ తాలిబన్లను చేరిన పాకిస్తాన్ దళాలను ఆఫ్ఘనిస్తాన్‌లో భారత సద్భావన చిహ్నాలను నాశనం చేయాలని ఆదేశించినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. తీవ్రవాద గ్రూపులకు సహాయం చేయడానికి 10,000 మంది పాకిస్థానీలు ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్ లోకి ప్రవేశించారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని, భారత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఇప్పటికే ఆర్డర్స్ వెళ్లాయని తెలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో పునర్నిర్మాణ ప్రయత్నాలలో భారత్ 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. వీటిలో ఆఫ్ఘన్ పార్లమెంట్, డెలారామ్ మరియు జరంజ్ సల్మా ఆనకట్ట మధ్య 218 కిలోమీటర్ల రహదారి ఉన్నాయి.
రాయిటర్స్ లో పని చేస్తున్న ఒక భారతీయ ఫోటో జర్నలిస్ట్ ఆఫ్ఘన్ దళాలతో ఘర్షణల సమయంలో తాలిబన్ల చేత చంపబడ్డాడు. భారత్‌కు చెందిన సీనియర్ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న పోరును చిత్రీకరిస్తుండగా మరణించినట్లు భారత్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ తెలిపారు. ‘కాందహార్‌లో గురువారం రాత్రి నా స్నేహితుడు డానిష్ సిద్దిఖీ చనిపోయాడనే విషాద వార్తతో నేను షాక్ అయ్యాను. పులిట్జర్ అవార్డ్ గ్రహీత, భారత జర్నలిస్ట్ ఆఫ్ఘన్ భద్రతా దళాలతోపాటూ ఉన్నారు. నేను ఆయన్ను రెండు వారాల క్రితం కలిశాను. ఆయనప్పుడు కాబూల్ వెళ్తున్నారు. ఆయన కుటుంబం, రాయిటర్స్‌కు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను” అని ఫరీద్ ట్వీట్ చేశారు.
సమీప భవిష్యత్తులో ఆఫ్ఘనిస్థాన్ భారతదేశం నుండి సైనిక సహాయం కోరాలని భావిస్తోంది. తాలిబాన్లతో చర్చలు విఫలమైతే భారత్ నుంచి సైనిక సాయం కోరాలని భావిస్తున్నట్టు భారత్ లో ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ ముముంద్జాయ్ వెల్లడించారు. ఆఫ్ఘన్ కు సైనిక దళాలను పంపాలని తాము కోరడం లేదని, తమ సైనిక దళాలకు శిక్షణ, సాంకేతిక మద్దతు ఇవ్వాలని కోరతామని ఆయన తెలిపారు. ఆగస్టు చివరి నాటికి ఆఫ్ఘన్ నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించేందుకు అమెరికా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా.. తాలిబాన్ ప్రతినిధులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దోహాలో జరుగుతున్న ఈ చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. తాలిబాన్లు పరిపూర్ణ సైనిక విజయంగా ప్రకటించుకోబోతున్నారని తెలుస్తోంది.