యోగా అంటే కేవలం ఆసనాలేనా..?

యోగా అనగానే.. ఆసనాలు వేయటం, రోగాలు తగ్గించే థెరపీ అనే భావన చాలా మందిలో ఉంది. ఆసనాలు వేయటమే మాత్రమే యోగా కాదు.. అదో జీవన విధానం. జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మ యోగ, పతంజలి యోగ, హఠ యోగ, కుండలినీ యోగ, ధ్యాన యోగ, మంత్ర యోగ, లయ యోగ, జైన యోగ, బౌద్ధ యోగ.. ఇలా చాలా రకాలుగా విస్తరించింది యోగా. ఆత్మ, పరమాత్మల కలయికే యోగం. ఇంద్రియాల్ని వశపరచుకుని, చిత్తాన్ని ఈశ్వరుడిలో లయం చేయడమే యోగం..! తనను.. ఎదుటివారిలో చూడటం, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడం, జీవకోటిలో ఇమిడి ఉన్న అనంతశక్తిని అవగతం చేసుకోవడం, సర్వభూతదయ కలిగి ఉండటమే జీవనయోగం. మనిషిలోని గుణాల్ని యోగ సాధన వికసింపజేస్తుంది.
నిరంతర సాధన ద్వారా మానసిక శక్తుల్ని.. ఏకీకృతం చేసి భగవంతుడిపై దృష్టి కేంద్రీకరించడమే యోగమని నిర్వచనం. భగవద్గీత, ఉపనిషత్తుల్లో యోగ ప్రస్తావన ఉంది. భారతీయ యోగశాస్త్రాన్ని పతంజలి మహర్షి యోగ సూత్రాలుగా క్రోడీకరించారు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ఈ సూత్రాల ప్రధాన భాగాలు. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు వీటిలో ముఖ్యాంశాలు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనమూ ఉంది. దీనికి పతంజలి యోగసూత్రాలే ప్రాతిపదిక. అభ్యాస, వైరాగ్యాలతో శారీరక, చిత్తవృత్తుల్ని అదుపులో ఉంచడంయోగసాధనలో ప్రధాన భూమిక.
పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సమాహారం. సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం..! ఏకాగ్రతతో చిత్త వ్యవహారాల్ని నిరోధించడమే సమాధి పాదంగాను, కర్మ, రాజయోగ సాధనే…సాధన పాదంగాను, యోగసాధనలో నైపుణ్యం సాధించడాన్ని విభూతి పాదంగాను, మోక్షసాధన ధ్యేయంగా సాధన చేయడాన్ని కైవల్య పాదంగా వర్ణించారు.
చిత్తవృత్తులను నిగ్రహించటమే యోగం..! ఇంద్రియం, మనస్సు, బుద్ధి వీటినే అంతఃకరణ చతుష్టయం అంటారు. ఏకాగ్రతతో ఈ చిత్త వ్యవహారాలను నిరోధించేందుకు.. నిరంతరం యోగ సాధన చేయడమే మార్గం. ఈ సాధనలో మానవుడు భూత.. భవిష్యత్ లను దర్శించే సిద్ధులను సైతం సొంతం చేసుకుంటాడని పతంజలి మహర్షి తెలిపారు. మానసిక శుద్ధికి, శారీరక దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగనిరోధానికి సహాయపడే అభ్యాస, సాధన, వ్యాయామ విన్యాస ప్రక్రియల్ని పతంజలి మహర్షి అష్టాంగయోగం ద్వారా వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి- అనేవే అష్టాంగ యోగ అంశాలు.
యోగం అంటే సులభమైంది కాదు. దాన్ని సాధించాలంటే శ్రమపడాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. కోరికలు లేకుండా నిరంతరం సాధన చేయాలి. మిత్రులను, శత్రువులను సమానంగా చూడాలి. పవిత్రమైన ఏకాంత ప్రదేశంలో కూర్చొని మనసును ఏకాగ్రం చేసుకోవాలి.
ఇవాళ మానవుడి జీవితం.. ఉరుకులు, పరుగుల మయం..! పని ఒత్తిడితో.. దిగులు.. వీటికి తోడు కుటుంబ సమస్యలతో కృంగిపోతూ.. తనను తాను నియంత్రించుకోలేక.. అనేక దురాలవాట్లకు బానిస అవుతున్నాడు. అనేక ఆధునిక మందులను.. మత్తు పదార్థాలను ఆశ్రయిస్తున్నాడు. చివరకు ఈ సమస్యల వలయం నుంచి బయటపడేందుకు యోగఃశరణం గచ్చామి అంటున్నాడు. పాశ్చాత్య దేశాలతోపాటు.. మన దేశంలోని ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, యోగ ద్వారా ఉపశమనం పొందుతున్నారు.
కేవలం ఆసనాలు వేయడం ఒక్కటే.. యోగా కాదు. అదో జీవన విధానం. శరీరాన్ని, మనస్సును సరైన స్థితిలో ఉంచి జీవన కాలాన్ని పెంపొందించటమే యోగం. దీనిని హఠయోగం అని అంటారు. ఇందులో ఆసనాలు, ప్రాణాయామము ముఖ్యం. అలాగే మంత్ర, యంత్రాలతో శక్తి ఉపాసన, మొదలైన యోగ ప్రక్రియలు ఆచరించి మహిమలు, పొందగలగటమే తంత్రయోగం. బౌద్ధ, జైన సంప్రదాయాల్లో యోగవిద్యకు ప్రముఖ పాత్ర ఉంది. సింధు నాగరికత నాటి కుడ్య చిత్రాల్లో యోగ విన్యాసాల్ని చరిత్రకారులు గుర్తించారు. భారతీయ యోగ ఔన్నత్యానికి ఎందరో మహనీయులు దేశ, విదేశాల్లో విస్తృత ప్రాచుర్యం కల్పించారు.
మహర్షులు.. అమూల్యమైన కానుకగా, అపురూప వారసత్వ సంపదగా యోగశాస్త్రాన్ని మనకు అందించారు. సనాతన సంప్రదాయ యోగశాస్త్రాన్ని పాశ్చాత్యులు సైతం అనుసరిస్తున్నారు. యోగసూత్రాల్ని అవలంబిస్తున్నారు. అలౌకికమైన యోగానందాన్ని ఆస్వాదిస్తున్నారు. యోగ అంటే కేవలం దైహిక, మానసిక శక్తుల్ని ప్రచోదనం చేసే ప్రక్రియ కాదు. సకల మానవాళి పరస్పర స్నేహ, సౌభ్రాతృత్వాలతో, శాంతి సౌమనస్యాలతో జీవించడానికి ఉపకరించే మార్గదర్శిని. నిఖిల జగతిని సమున్నత విలువల వైపు నడిపించే నవ్య జీవన వని.., దివ్య సంజీవని..!
భారతీయ జీవన విధానమే ఒక యోగమయం.. అయితే పాశ్చత్య అనుకరణలో మనం ఈ విద్యకు దూరం అవుతున్నాం. పాశ్చాత్యులేమో.. యోగను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. అంతేకాదు యోగాను తమదైన స్టయిల్ లో మార్కెటింగ్ చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైన మించిపోయిందేమి లేదు.. యోగ కోసం ప్రతి రోజు అరగంట సమయం కేటాయిస్తే చాలు..!