ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తన దేశం వదిలి పారిపోయారని రష్యా మీడియా తెలిపింది. రష్యా వొలొదిమిర్ జెలెన్‌స్కీని హత్య చేసేందుకు కూడా తీవ్రంగానే ప్రయత్నించిందని కూడా చెబుతున్నారు. జెలెన్‌స్కీకి ఉన్న భద్రత కారణంగా రష్యా అతడిని చంపలేకపోయింది. జెలెన్ స్కీని హత్య చేసేందుకు చెచెన్ స్పెషల్ ఫోర్స్‌తో పాటు పలు దేశాల నిషేధిత సంస్థల జాబితాలో ఉన్న రష్యా ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ రంగంలోకి దిగిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు రంగంలోకి దిగిన చెచెన్ స్పెషల్ ఫోర్స్ జెలెన్‌స్కీని హత్య చేసేందుకు యత్నించగా..ఉక్రెయిన్ భద్రతా దళాలు తిప్పికొట్టాయని చెప్పుకొచ్చారు. ఇంకొన్ని గ్రూప్ లు రెండు సార్లు జెలెన్ స్కీని హత్య చేసేందుకు యత్నించగా వాటిని కూడా ఉక్రెయిన్ దళాలు అడ్డుకున్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకించే రష్యాలోని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ కూడా జెలెన్ స్కీపై జరుగుతున్న హత్యా యత్నాలకు సంబంధించి ఉక్రెయిన్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
యుద్ధ సమయంలో ఉక్రెయిన్ సైన్యం వెంటనే ఉన్న జెలెన్ స్కీ మొదట్లో విదేశాలకు పారిపోయారని రష్యా ప్రచారం చేసింది. అయితే రష్యా చెప్పేదంతా అబద్ధమేనని ప్రకటించిన జెలెన్ స్కీ తాను ఉక్రెయిన్‌లోనే ఉన్నట్లుగా వీడియో విడుదల చేశారు. తాజాగా జెలెన్ స్కీ దేశం వదిలి పరారయ్యారంటూ రష్యాకు చెందిన మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ను వీడిన జెలెన్ స్కీ ప్రస్తుతం పోలండ్‌లో ఉన్నారని కూడా రష్యా మీడియా చెబుతోంది.
ఉక్రెయిన్ నగరాల్లో రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. రష్యన్లు ఆక్రమించుకున్న నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. చాథమ్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.