గిరిజనులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు..! జోడిస్తున్నావా..? విడదీస్తున్నావా..? ఇంకా 90ల నాటి స్ట్రాటజీయేనా రాహులా..?

0
851

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆయన అడుగుపెట్టిన ప్రతీచోటా ఏదో ఒక వివాదం రగులుతోంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గుజరాత్‎లో కొనసాగుతోంది. గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న మహువా పట్టణంలో ఆయన ప్రసంగించాడు. అయితే, గిరిజనులకు రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యానించడంతో రాహుల్ ప్రసంగం కాస్తా వివాదాస్పదమైంది. తమ కుంటుంబానికి గిరిజనులతో సత్సంబంధాలున్నాయనీ అందుకే గిరిజనుల కోసం పాటుపడిందనీ,.. కానీ, బీజేపీ గిరిజనుల కోసం అస్సలు ఆలోచించదనీ,.. గిరిజనుల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావడం బీజేపీకి ఇష్టం లేదన్నాడు రాహుల్. దీంతో పాటు గిరిజనుల భూములను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందనీ వ్యాఖ్యానించాడు. ఇదిలాగే కొనసాగితే మరో పదేళ్ళలో గిరిజనుల భూములన్నీ ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లకు చేతిలోకి వెళ్ళిపోయి నిర్వాసితులవుతారనీ రెచ్చగొట్టాడు. బీజేపీ ప్రభుత్వం గిరిజనులను వనవాసీలుగా పిలుస్తుందనీ,.. అంటే గిరిజనులు కేవలం అడవులకు మాత్రమే పరిమితమవ్వాలని భావిస్తోందనీ.. కానీ కాంగ్రెస్ మాత్రం గిరిజనులకు ఆదివాసీలుగా పిలుస్తామనీ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, భారత్ పై తొలి హక్కు గిరిజనులకే ఉంటుందనీ అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాహుల్ గాంధీ గిరిజనులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారనీ దుయ్యబడుతున్నారు.

అయితే ఈ వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ 90లలో ఉపయోగించిన వ్యూహాలనే కాంగ్రెస్ మళ్ళీ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్ అనే స్ట్రాటజీని అత్యంత ఖచ్చితత్వంతో ప్రయోగిస్తుంది. ఎక్కడికక్కడ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు రేపడం, మతాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావడం వంటి స్ట్రాటజీని గతంలో ఎన్నోసార్లు ఉపయోగించింది. ఇందిరాగాంధీ కాలంలో నుంచి ఇది మరింత పెరిగింది. తమ పార్టీ ఓట్ల కోసం రెండు కులాలను విడదీసి ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి అందులో ఓ కులాన్ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం గతంలో ఎన్నో సార్లు కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. ఏ ఎరియాకు వెళ్తే.. అక్కడ మెజార్టీ ప్రజలే టార్గెట్ గా ఓట్ల రాజకీయం చేస్తుంది. స్థానిక ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా గంపగుత్తగా తన పార్టీకి ఓట్లను సంపాదించేది. ఇప్పటికీ ఆ స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ తు. చ. తప్పకుండా అనుసరిస్తున్నట్టే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అకోలా జిల్లాలో జోడోయాత్ర చేపట్టి రాహుల్ గాంధీ.. సందర్భం కాకున్నా.. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తద్వారా ఆ జిల్లాలో ఎక్కువగా ఉండే మైనార్టీలను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించాడు. ఇప్పుడు గుజరాత్ లో ఆదివాసీల ఓట్ల కోసం ఇలా బరితెగించాడు రాహుల్ గాంధీ. 90లనాటి పాత చింతకాయ స్ట్రాటజీనే ఉపయోగించాడు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా జీవన్మరణ సమస్యతో పోరాడుతోంది. దీంతో హస్తం పార్టీకి పునరుజ్జీవం తీసుకువస్తాని కంకణం కట్టుకున్న రాహుల్.. భారత్ జోడో యాత్ర చేపట్టాడు. ఈ యాత్రలో ప్రతీచోటా డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీని పాటిస్తున్నాడు. తాజాగా గుజరాతీ గిరిజనుల్లో భయభ్రాంతులకు గురిచేసే ప్రసంగం కూడా ఈ స్ట్రాటజీలో భాగంగానే కనిపిస్తోంది. సాధారణంగా, గిరిజనుల భూములను ఏ ప్రభుత్వమూ లాక్కోలేదు. ఎప్పుడైనా పరిశ్రమలకు ప్రభుత్వాలు భూములను కేటాయించాలంటే దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనులు నివసించే ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం అంత సులభంగా ఏమీ జరగదు. అంతే కాదు, గిరిజనుల భూములన్నిటినీ బీజేపీ ప్రభుత్వం ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ల చేతికి అందజేస్తుందనే వాదన కూడా పూర్తిగా అసంబద్దం. ఏ ప్రభుత్వమైనా సంస్థలకు అవసరమైనంత మేరకే భూములను కేటాయిస్తుందే తప్ప దేశంలోని అన్ని భూములనూ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయలేదు. అయితే అమాయక గిరిజనులను రెచ్చగొట్టే క్రమంలో అది కూడా గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా వారిని ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నంలో భాగమేననే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇక కేవలం గిరిజనులనే కాదు. మైనార్టీ సంతుష్టీకరణలో భాగంగా హిందువులను రెచ్చగొట్టే చర్యలు కూడా భారత్ జోడో యాత్రలో చోటుచేసుకున్నాయి. కేరళ నుంచి ప్రస్తుతం గుజరాత్ చేరుకున్న జోడోయాత్రలో.. సమాజాన్ని విభజించే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. వీటిలో ఏకంగా ఇతర మతాల వారి నుంచి హిందువులను తిట్టించడం కూడా జరిగింది. తమిళనాడులో పాస్టర్ జార్జ్ పొన్నయ హిందూ దేవీ దేవతల కంటే ఏసు ప్రభువే గొప్పవాడనీ వ్యాఖ్యానించినా,.. రాహుల్ గాంధీ మాత్రం ఆ వ్యాఖ్యలను ఏ మాత్రం వ్యతిరేకించలేదు. ఇక తన యాత్రలో గతంలో నడిరోడ్డుపై ఆవును చంపి తిన్న వ్యక్తిని కూడా కలిశాడు. అయితే ఇదంతా మైనార్టీ సంతుష్టీకరణ వ్యూహంలో భాగంగానే జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి 90ల నాటి విభజించు పాలించు అనే స్ట్రాటజీలు ఇప్పటి కాలంలో అమలు చేయవచ్చునా అన్నది ఇప్పుడు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నెహ్రూ, ఇందిర, మన్మోహన్ వెనకుండి నడిపించిన సోనియా గాంధీల కాలంలో ఇటువంటి స్ట్రాటజీ పాచికలు బాగానే పారాయి. అప్పట్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ లాంటివి విస్త్రుతంగా అందుబాటులోకి లేకపోవడంతో రాజకీయ పార్టీల కుయుక్తులు అంతగా సాగకపోయేవి. అందుకే నాడు ఈ వర్గపోరులో ప్రాణాలు కోల్పోయినా కూడా అంతగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇది సోషల్ మీడియా యుగం. ప్రతిఒక్కరికీ నిజాలు ఇట్టే తెలిసిపోతాయి. రాజకీయ పార్టీలు చేసే ప్రతి ఒక్క కదలికనూ క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉండే కుట్రను కూడా ఇట్టే పసిగడతారు. దీంతో పాటు అప్పటిలాగా ప్రజలను రెచ్చగొట్టినా అంతగా రెచ్చిపోయే కాలం కాదిది. అందులోనూ అటువంటి రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని చిత్తు చిత్తుగా ఓడిస్తారు. అందుకేనేమో ఒకప్పుడు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ కు ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారింది. కాబట్టి రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఈ విషయం గురించి తెలుసుకుని రాజకీయాన్ని మార్చుకుంటారో లేక తాను పట్టిందే కుందేలు అనే భ్రమలో పడి కాంగ్రెస్ పుట్టి ముంచుకుంటారో వేచి చూడాల్సిందే.

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే.. లైక్ చేయండి.. పదిమందికీ షేర్ చేయండి.. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × 5 =