More

    ఖలిస్తానీ ఉద్యమం మళ్లీ జడలు విప్పుతోందా..?

    అది భగత్ సింగ్, రాజ్‎గురు, సుఖ్‎దేవ్ వంటి స్వాతంత్ర్య సమరయోధులకు జన్మనిచ్చిన నేల. గురుగోవింద్ సింగ్, దేజ్ బహదూర్ వంటి యోధులు పుట్టిన భూమి. అలాంటి పవిత్ర భూమిలో జాతి వ్యతిరేక శక్తులు బుసలు కొడుతున్నాయి. వేర్పాటవాద మూకలు దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఖలిస్తాన్ పేరిట పురుడుపోసుకున్న వేర్పాటువాదం మళ్లీ సెగలు కక్కుతోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస సంఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.

    తాజాగా అమృత్‎సర్‎లోని గోల్డెన్ టెంపుల్‎లో మరోసారి ఖలిస్తానీ జెండాలు ఎగిరాయి. ఖలిస్తానీ నినాదాలు వినిపించాయి. ఉగ్రవాది జర్నైల్ భింద్రేన్‎వాలే పోస్టర్లు కనిపించాయి. 1984 జూన్ 1 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‎లో భాగంగా.. గోల్డెన్ టెంపులో నక్కిన ఖలిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఇందులో భాగంగా జూన్ 6న జవాన్ల ఎదురుకాల్పుల్లో ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు భింద్రేన్‎వాలే హతమయ్యాడు. ఈ ఘటను 37 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రమూకలు.. నిరసనకార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. గోల్డెన్ టెంపుల్‎లో జరిగిన ఈ కార్యక్రమంలో ఖలిస్తానీ జెండాలు, భింద్రేన్‎వాలే చిత్రపటాలను ప్రదర్శించారు. ఖలిస్తానీ అనుకూల నినాదాల చేశారు.

    ఈ కార్యక్రమంలో శిరోమణి అకాలీదళ్ నాయకులతో పాటు.. రిపబ్లిక్ డే ఎర్రకోట విధ్వసంలో పాలుపంచుకున్న దీప్ సిద్ధూ, మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మన్‌ కూడా ఈ ఆందోళనల్లో కనిపించారు. ప్రస్తుతం సిమ్రాన్ జిత్ సింగ్ బెయిల్‌పై బయట ఉన్నారు.

    ఇదే సమయంలో లండన్‎లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ట్రఫాల్గర్ స్క్వేర్‎లో ఖలిస్తానీ వేర్పాటువాద ఉన్మాదులు రెచ్చిపోయారు. దేశ సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి త్రివర్ణ పతకాన్ని నడిరోడ్డుపై దగ్ధం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మూడు వీడియోలను టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ నవోమీ క్యాంటన్ ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. ఇందులో మొదటి వీడియోలో, ముఖం కనబడకుండా నల్ల స్కార్ఫ్ కట్టుకున్న ఓ వ్యక్తి త్రివర్ణ పతాకాన్ని నేలపై వుంచి తగులబెట్టాడు. ఆ మంటలు చెలరేగిన తర్వాత ఇన్ ఫ్లేమేబుల్ స్ప్రేతో జెండా పూర్తిగా బూడిదయ్యేవరకు కాల్చేశాడు. దీంతో అక్కడున్న ఖలిస్తానీలు “ఖలిస్తాన్ జిందాబాద్”, “న హిందీ, న హిందూ, న హిందూస్తాన్, బాంకే రహేగా ఖలిస్తాన్” అంటూ నినాదాలు చేశారు.

    అది చాలదన్నట్టు మొదట జెండాను తగులబెట్టిన వ్యక్తి మరో జెండాను కూడా తెచ్చి కాల్చేశాడు.

    ఆ తర్వాత లండన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు జెండాను తగులబెట్టిన వ్యక్తి నీళ్లు పోసి మంటలను ఆర్పేశాడు. ఆ తర్వాత లండన్ పోలీసులు జెండా అవశేషాలను స్వాధీనం చేసుకుని.. ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే, ఈ క్రమంలో లండన్ పోలీసులు జెండా అవశేషాలను కాళ్లతో తన్నడం కనిపించింది.

    త్రివర్ణ పతాకాన్ని కాల్చివేసిన ఘటనపై బ్రిటన్‎లోని భారత హైకమిషన్ స్పందించింది. ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నట్టు ప్రకటన విడుదల చేసింది. భారత జాతీయ జెండాను అపవిత్రం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే, ఖలిస్తాన్ వేర్పాటువాదుల గ్యాంగ్ లో ఎల్టీటీఈ ఉగ్రవాదులు కూడా వుంటడం చూసి ఆశ్చర్యపోయామని తెలిపింది. నానాటికీ మద్దతు కోల్పోతుండటం వల్ల.. ఖలిస్తానీలు ఎల్టీటీఈ మద్దతు తీసుకుంటున్నట్టు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఇదిలావుంటే, ఆందోళనల్లో బాగంగా జాతీయ జెండాను తగులబెట్టడాన్ని బ్రిటన్‎లో నేరంగా పరిగణించరు. లేదంటే, ఖలిస్తానీ మూకలు ఈ పాటికి జైలు ఊచలు లెక్కపెడుతూ వుండేవాళ్లు.

    ఇక, ఈ ఘటనకు ముందు, ఖలిస్తానీ మూకలు.. స్థానిక వెల్లింగ్టన్ ఆర్చ్ నుంచి ట్రఫాల్గర్ స్క్వేర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారుల్లో కొందరు మహిళలు కూడా వున్నారు. ఈ సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాది భింద్రేన్ వాలే ఫొటోలతో కూడిన ఖలిస్తానీ జెండాలను చేతబూని నినాదాలు చేయగా.. మరికొందరు, పసుపు రంగు ఖలిస్తానీ జెండాలు చేతబట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో ‘పంజాబ్ రెఫరెండమ్ 2020’ నినాదాలతో కూడిన టీ షర్టులను ధరించారు. ఇది నిషేధిత ‘సిక్ ఫర్ జస్టిస్’ నినాదం. ఇదే గ్రూప్ ఎర్రజెండాపై ఖలిస్తానీ జెండా ఎగురవేస్తే నగదు బహుమానం ఇస్తామని ప్రకటించింది. ఇదిలావుంటే, ర్యాలీలో పలు అభ్యంతరకర నినాదాలు వినిపించాయి. పంజాబ్‎లో పలువురు హిందూ లీడర్లను హత్యచేసిన ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న జగ్తార్ సింగ్ జోహాల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

    భారతదేశంలో మూడున్నర దశాబ్ధాల క్రితం నెత్తుటేర్లు సారించిన పీడ కల ఖలిస్తాన్ ఉద్యమం. భారతీయుల సమైక్యతను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయోగించిన పదునైన ఆయుధం. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆరంభమైన ఈ ఉద్యమం అప్పట్లో సృష్టించిన మారణకాండ అంతా ఇంతా కాదు. పంజాబ్ యువతను విపరీతంగా ఆకర్షించిన పాకిస్తాన్.. ఉద్యమానికి కావాల్సిన నిధులను, ఆయుధాలను సమకూర్చింది. ఆనాడు ఆయుధాల‌పై మోజు ఉన్న ప్ర‌తి యువ‌కుడు ఉద్య‌మంలో చేరేవాడు. దేశ స‌మ‌గ్ర‌త‌కు వ్య‌తిరేకంగా లేవ‌దీసిన‌ పోరాటానికి భింద్రేన్‌వాలే నేతృత్వం వ‌హించాడు. దేశంలో వారి ఆగ‌డాలు మితిమీర‌డంతో అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ సైన్యాన్ని రంగంలోకి దించి స్వ‌ర్ణ‌దేవాల‌యంలో దాక్కున్న ఉగ్ర‌వాదుల‌ను ఆపరేషన్‌ బ్లూస్టార్‌ పేరుతో తుద ముట్టించారు. ఈ పరిణామ క్రమంలోనే అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ అసువులుబాశారు. సిక్కువర్గానికే చెందిన అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైపోయారు. దీంతో పోరాటం అంత‌మైందని అంతా బావించారు. కానీ, దాని ఛాయలు క్రమక్రమంగా వెలుగుచూశాయి. రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంతో ఖలిస్తానీల కండకావరం మళ్లీ ఉచ్ఛస్థాయికి చేరుకుంది.

    నాడు ఖలిస్తానీ ఉద్యమానికి పాకిస్తాన్ ఒక్కటే అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు వ్యతిరేక శక్తులు పెరిగిపోయాయి. దేశంలోని కుహనా లౌకిక శక్తులకు తోడు.. చైనా, కెనడా వంటి దేశాలు సైతం వేర్పాటువాదులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఈ భారత వ్యతిరేక శక్తులు దేశంలోని వేర్పాటువాదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖలిస్తానీ అనుకూలవాదులను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత నిఘా వర్గాలు గుర్తించాయి. శత్రువుకు శత్రువుకు మిత్రుడన్నట్టు.. పాకిస్తాన్ తో కలిసి.. పరోక్షంగా చైనా ఈ కుట్రలో భాగం పంచుకుంటుంటోంది. మరోవైపు.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కెనడా ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు అండగా నిలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో సిక్కుల జనాభా గణనీయంగా వుంది. వీరు అక్కడ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో వున్నారు. ఈ క్రమంలో వేర్పాటువాద ఉద్యమానికి కెనడా నుంచి నిధులు సమకూరుతున్నట్టు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

    కెనడియన్ రాష్ట్రం బ్రిటిష్ కొలంబియా నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ధలీవాల్, గ్రెవాల్ వంటి ఓక్రైమ్ సిండికేట్లకు ‘సిక్ ఫర్ జస్టిస్’ నేత గురుపట్వంత్ సింగ్ పన్నూ,.. అతని అనుచరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా.. భారత నిఘా వర్గాలు పలు నివేదికల్లో తేల్చిచెప్పాయి. ధలీవాల్, గ్రెవాల్ ముఠాలు వాంకోవర్ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కాంట్రాక్ట్ హత్యలు, ఆయుధాల అమ్మకాలు వంటి మార్గాల ద్వారా ఈ రెండు ముఠాలు డబ్బు సంపాదిస్తున్నాయి. ఈ నిధులను ఎస్ఎఫ్‌జే నేతలకు, ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధం వున్న వారికి అందజేస్తున్నాయి.

    ఈ నిధుల సాయంతో ఉగ్రవాద సిక్కు నాయకుడు ఎస్.ఎఫ్.జె. లీడర్ గురుపట్వంత్ సింగ్ పన్నూ అనేక ఖలిస్తానీ వర్గాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి కుట్ర పన్నినట్లుగా నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. సిక్ ఫర్ జస్టిస్ సంస్థ పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న తన కార్యకర్తలకు హవాలా మార్గంలో డబ్బును బదిలీ చేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో కూడా తేలింది. దీంతో, అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తాన్ అనుకూల ఎస్ఎఫ్‌జేపై భారత ప్రభుత్వం 2019లో నిషేధం విధించింది. దీంతో కడుపుమంటలో రగిలిపోయిన ఎస్.ఎఫ్.జె. నాయకులు వేర్పాటువాద ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.

    రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంతో ఖలిస్తానీల ఆగడాలు ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. పైగా ఇప్పుడు పాకిస్తాన్‎కు తోడు, చైనా, కెనడా నుండి కూడా ఆర్థిక, ఆయుధ అండదండలు లభిస్తుడటంతో వేర్పాటువాద మూకలు మరింత రెచ్చిపోతున్నాయి. రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో చేరి.. ఖలిస్తానీలు సృష్టించిన విధ్వంసాన్ని దేశం కళ్లారా చూసింది. త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడాల్సిన పవిత్ర ఎర్రకోట బురుజుపై ఖలిస్తానీ జెండాలు ఎగురవేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ అండతోనే ఈ మూకలు అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్నాయడం అతిశయోక్తి కాదు. భారతదేశంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ గొంతెత్తడమే ఇందుకు నిదర్శనం. కొన్ని నెలల కింద పాక్ లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు అద్దం పడుతోంది. భారత్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న ఖలిస్తానీ వేర్పాటు వాద గ్రూపులకు.. 22 కోట్ల పాక్ ప్రజల మద్దతు ఉంటుందని పాకిస్తాన్ విద్యార్థి నాయకుడు షాహీర్ సియాల్వి ప్రకటించాడు. గత ఫిబ్రవరిలో పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో జరిగిన ర్యాలీలో సియాల్వి ఈ ప్రకటన చేశాడు.

    భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే తమ సందేశమని.. ఖలిస్తానీల కలను నిజయం చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ లో యువ పార్లమెంటు సభ్యుడుగా ఉన్న షాహీర్.. భారత్ ను ముక్కలు చేస్తామని.. ఖలిస్తాన్ ఏర్పాటు ఖాయమని అన్నాడు. అంతేకాదు, హైదరాబాద్, అస్సాం, జునాఘడ్, జమ్మూ కాశ్మీర్లను వేరు చేస్తామని.. అని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. షాహీర్ వివాదాస్పద ప్రసంగం అప్పట్లో పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖలిస్తానీల వెంట ఎవరున్నారో చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చాలవా..? ఇలా అంతర్జాతీయ స్థాయిలో భారత వ్యతిరేక శక్తులకు లభిస్తున్న మద్దతు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ.. దేశంలోని చట్టాలను సైతం ప్రశ్నిస్తున్న.. ఈ ఖలిస్తానీ మూకల అంతు చూడకపోతే.. భారతదేశం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నది మాత్రం అక్షర సత్యం.

    Trending Stories

    Related Stories