తాను ఆరంభ శూరుణ్ని కాననీ అంతుపట్టగల కార్యశూరుణ్నని ప్రకటించిన కేసీఆర్ అన్నట్టుగానే తన జాతీయ రాజకీయ ప్రస్థానానికి ముహుర్తం ఖరారు చేశారు. దసరా పర్వదినం రోజు- అక్టోబర్ 5న ప్రకటన వెలువడుతందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొత్త పార్టీ స్థాపన విరమించుకుని కేవలం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ – భారతీయ రాష్ట్ర సమితిగా మార్చాలని నిర్ణయించారు కేసీఆర్.
పేరు మార్పు వల్ల దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్ ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది. దేశమంతా తమ స్వాధీనమైపోయిందన్న రీతిలో స్పందిస్తున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.
పార్టీ పేరును ప్రకటించిన తర్వాత కేసీఆర్ అక్టోబర్ లో వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారనీ, ఆ తర్వాత డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తారని ఆ పార్టీ స్పష్టమైన ప్రకటన చేసింది. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయ హడావిడి సృష్టిస్తున్నారు గులాబీ బాస్. గతంలో ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీని, ప్రధాని మోదీని పరుష పదజాలంతో దూషించిన సందర్భంలో తన జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. అయితే ఇదంతా కేసీఆర్ స్వాభావిక డంబాచారమని అందరూ భావించారు.
ఒక పద్ధతి ప్రకారం వెళుతూ, ప్రణాళికను రచించిన సీఎం కేసీఆర్ పార్టీ ఏర్పాటుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టూ అర్థమవుతోంది. దేశ వ్యాప్త పర్యటన కోసం ఓ కొత్త హెలికాప్టర్ ను కొనుగోలు చేశారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ‘మునుగోడు’ నుంచే బీజేపీ ముక్త్ భారత్ అని ప్రకటించిన కొన్ని గంటలకే మునుగోడు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
అసలు కేసీఆర్ వ్యూహమేంటి? తాను స్థాపించిన జాతీయ పార్టీ పాత హైదరాబాద్ స్టేట్ లోని జిల్లాల్లో పోటీ చేస్తుంది అని వినిపిస్తున్న వాదన వెనుక ఉద్దేశమేంటి? అదే నిజమైతే 17 హైదరాబాద్ స్టేట్ జిల్లాల్లో పోటీ చేస్తే వచ్చే గెలిచే స్థానాలెన్ని? 30కి మించని స్థానాల్లో ఒక వేళ నిజంగానే గెలిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలరా? ఒక వేళ కాంగ్రెస్ అనుకోని స్థితిలో వంద స్థానాలు గెలిస్తే కేసీఆర్ ఏం చేస్తారు?
బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి? నిజంగానే కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశం ఉందా లేదా తెలంగాణలో తాను ఓడిపోతాననే భయంతో ఈ మొత్తం హడావిడి సృష్టించి దృష్టిమరల్చే వ్యూహంలో భాగమేనా? కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో, ఉత్కంఠ రేపుతున్న వాతావరణంలో ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం.
పాత హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని మరఠ్వాడ రీజియన్, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, గుల్బర్గా, బిదర్ ఉండేవి. ఇక మరఠ్వాడ రీజియన్ లో నాందేడ్, పర్బనీ, ఔరంగాబాద్ ఉండేవి. అంటే మొత్తం కలిపి ఆనాటికి 17 జిల్లాలు ఉండేవి. జిల్లాల స్వరూపం నేడు ఉన్నట్టూ ఆనాడు లేదు. రాష్ట్రాల విభజన క్రమంలో మరాఠీ మాట్లాడే జిల్లాలు మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతాలు కర్ణాటకలో కలిసాయి. హైదరాబాద్ స్టేట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి వీక్షకులకు తెలిసేందుకు నాటి చారిత్రక వాస్తవాలను మీ ముందుంచుతున్నాను.
కేసీఆర్ ఎందుకు హైదరాబాద్ రాజ్యంలో పోటీకి దిగుతామంటున్నారో చూద్దాం. నిజానికి ఈ వార్తను టీఆర్ఎస్ వర్గాలేమీ రూఢీగా చెప్పలేదు కానీ, వార్తా ఛానళ్లలో ప్రసారం అయింది కాబట్టి, ఇదో ఆసక్తికరమైన అంశం కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత తెలంగాణలో ఉమ్మడిపది జిల్లాలతో పాటు కళ్యాణ కర్ణాటకలోని మూడు, మరఠ్వాడాలోని మూడు జిల్లాల్లో కూడా పోటీ చేస్తే మొత్తం మూడు రాష్ట్రాలకు పార్టీ విస్తరించిన అర్థం వస్తుంది కాబట్టి కేసీఆర్ ఈ ఆలోచనకు వచ్చి ఉండవచ్చు.
పైగా అటు కళ్యాణ కర్ణాటకలోనూ, మరఠ్వాడాలోనూ ముస్లీం జనాభా ఎక్కువ. మరఠ్వాడాలో లంబాడాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దీనికి తోడు ఔరంగాబాద్ లో మజ్లీస్ పార్టీ బలంగా ఉంది. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో 25 స్థానాలు గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా కూడా ఉంది. ఔరంగాబాద్ ఎంపీ స్థానం కూడా మజ్లీస్ చేతిలోనే ఉంది. కాబట్టి, ఈ ప్రాంతాల్లో బీజేపీ వ్యతిరేక ప్రచారం ఫలిస్తుందన్న నమ్మకం, అసదుద్దీన్ ఒవైసీ సహకారం ఉంటుందన్న భరోసా తోనే బహుశా కేసీఆర్ హైదరాబాద్ స్టేట్ లో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుంది? దీనికి ఉన్న పరిమితులేంటో చూద్దాం.
కేసీఆర్ స్థాపించబోయే పార్టీ తెలంగాణలో 16 లోక్ సభ స్థానాల్లో, అటు మరఠ్వాడా, కళ్యాణ కర్ణాటకలో మొత్తంగా 10 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిందని కాసేపు అనుకుందాం. ఎందుకంటే రాజకీయాల్లో Hypotheses కి చాలా ప్రాధాన్యత ఉంది. పోటీ చేసిన 26 స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలిచిందని భ్రమిద్దాం. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీ స్థానం కూడా ఒక వస్తుంది కాబట్టి మొత్తం 27 లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ కొత్త పార్టీ, మజ్లీస్ పార్టీలు విజయం సాధించాయని అనుకుందాం.
ఈ 27 స్థానాలతో కేంద్రంలో ఏం చక్రం తిప్పగలరు? పొరపాటున బీజేపీ తక్కువ స్థానాలు సాధించి ప్రాంతీయ పార్టీలు కాసిన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచాయని కాసేపనుకుందాం. కాంగ్రెస్ 100 లోక్ సభ స్థానాల్లో గెలిచిందే అనుకుందాం. మొత్తంగా చిన్నా చితక పార్టీలతో కలిసి యూపీఏ-3 ఏర్పడితే అప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కూటమిలో కలుస్తారా? పాత పగల కారణంగా సోనియా గాంధీ అంత సులభంగా అంగీకరిస్తారా? ఒక వేళ అంగీకరించిందే అనుకుందాం. ఆ కూటమిలో కేసీఆర్ కు ఏం స్థానం ఉంటుంది? మహా అయితే రెండు కేబినెట్ పదవులు ఇవ్వవచ్చు. అంతకు మించి కేంద్రంలో కేసీఆర్ చెలాయించేదీ, చెలాయించిందీ ఏమీ మిగలదు.
ఒక వేళ భారతీయ జనతా పార్టీ సీట్ల భారీ మెజారిటీ సాధించి మూడోసారి అధికారం లోకి వచ్చి అమిత్ షా ప్రధాని పదవిని చేపడితే కేసీఆర్ పరిస్థితి ఏమిటి? ఈ పర్యవసనాన్ని ఊహిస్తే…చాలా ఆసక్తికరమైన చిత్రాలు మదిలో మెదులుతాయి. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఈ మాత్రం ఆలోచించి ఉండరా? ఒక వేళ ఆలోచిస్తే ఇంత దుస్సాహసానికి ఎందుకు దిగుతారు? తెలంగాణ రాష్ట్రాన్ని తానే సాధించాననే అతి విశ్వాసమే ఇప్పుడు దేశాన్ని మలుపుతిప్పుతానన్న అతిశయానికి కారణమై ఉంటుందా? ఇవన్నీ జవాబు దొరకాల్సిన ప్రశ్నలు.
ఇవేవీ కాకుండా తెలంగాణ బీజేపీ చొచ్చుకు వస్తుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందని భావించి ఈ భారీ స్టంట్ కు తెరలేపారా? చూద్దాం.
భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పై రాజకీయ దాడిని రోజురోజుకూ తీవ్రం చేస్తోంది. విస్తరణ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సంస్థాగత బలాన్ని పెంచుకుంటోంది. జాతీయ స్థాయి నేతల వరుస పర్యటనలతో ఆ పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. జాతీయ స్థాయి వ్యూహకర్తలు సునిల్ బన్సల్, తరుణ్ చుగ్ లాంటి వారు ఇక్కడే తిష్టవేశారు. దశలవారీగా బండి సంజయ్ పాద యాత్ర కొనసాగుతోంది. బీజేపీ రెండు ఉప ఎన్నికలు గెలిచింది. మూడో ఎన్నికను వ్యూహాత్మక తీసుకొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పొరపాటున తగ్గితే?
మేజిక్ మార్క్ 60 అసెంబ్లీ స్థానాలకు గానూ ఓ ఇరవై స్థానాలు తగ్గి, బీజేపీ 30 నుంచి 35 స్థానాలు గెలిచి, కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేని స్థితి ఏర్పడితే ఏం చేయాలి? లేదా బీజేపీయే మెజారిటీ స్థానాలు స్థాధించి అధికారంలోకి వస్తే అంతా తారమారు అవుతుంది కాబట్టి….జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాల పేరిట ఓ భారీ ప్రచార పర్వానికి తెరతీస్తే, మోదీని టార్గెట్ చేస్తే….తెలంగాణ ఓటర్లు అన్ని మరిచిపోయి మళ్లీ తనవైపే మొగ్గు చూపుతారనే ఉద్దేశంతోనే ఈ దృష్టి మళ్లింపు వ్యూహాన్ని రచించారా? అంటే సుమారుగా ఇదే అసలు కారణమేమో! తెలంగాణలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి జాతీయ రాజకీయాల జోలి చెపుతూ ఉండి ఉండవచ్చు.
కేసీఆర్ స్వయంగా మునుగోడు నుంచే బీజేపీ ముక్త్ భారత్ అన్నారు కాబట్టి నవంబర్ 6 ఫలితం తేలిన తర్వాత రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారతాయి. అప్పుడు ఎలా స్పందిస్తారు? యుద్ధ ఆరంభ దశలోనే ఓటమి పాలైతే ఎలాంటి వైఖరి తీసుకుంటారో చూద్దాం.