మునుగోడులో టీఆర్ఎస్ ‘ఉచిత’ విజయం..!

0
919

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచినా.. అది అంత సులభంగా దక్కిన గెలుపు కాదని అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఒక ఉపఎన్నికే అయినా,.. కేసీఆర్ పదుల సంఖ్యలో హామీలు గుప్పించి, పథకాల రూపంలో ప్రభుత్వ డబ్బులు పంచి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా నెరవేరని హామీలను నెరవేర్చడం నుంచి రిజర్వేషన్లు పెంపు, పథకాలకు నిధుల విడుదల లాంటివి ఎన్నో చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నమే చేశారు కేసీఆర్.

మునుగోడు ఉపఎన్నిక వస్తుందని తెలిసిన వెంటనే నియోజకవర్గంలో భారీగా నిధులు విడుదలయ్యాయి. గత ఎనిమిదేళ్ళుగా మంజూరు కాని రోడ్లకు, పలు అభివృద్ది పథకాలకు ఒక్కసారిగా నిధులు విడుదలయ్యాయి. కొన్ని లెక్కల ప్రకారం మునుగోడులో దాదాపు 300 కోట్ల వరకు నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదాల్లో ఒకటైన నియామకాలను కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ఫలితంగా విడుదల చేశారు. ఉప ఎన్నిక రాగానే దాదాపు 28 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వదిలి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పావులు కదిపారు. దీంతో పాటు వృద్దులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం, చేనేతలకు, గీత కార్మికులకు భీమాను ఇవ్వడం వంటివి చేశాడు కేసీఆర్. ఇన్నాళ్ళూ పెండింగ్ లో ఉన్న అర్జీలన్నీ చకచకా ఆమోదం పొందాయి.

వీటన్నిటితో పాటు అటు సామాజిక వర్గాల వారీగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు పలు పథకాలను ప్రారంభించారు. ఇందులో మొదటగా మునుగోడులో ఎస్టీలు పెద్దయెత్తున ప్రభావం చూపే స్థితిలో ఉండటంతో ఎస్టీలకు కూడా రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యాదవ ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి ఏడు వేల మందికి గొర్రెల పంపిణీ కూడా చేపట్టారు. దీంతో పాటు పలు కులసంఘాలకు ప్రభుత్వం తరపున హామీలు గుప్పించడం, కులభవనాలకు నిధులు ఇవ్వడం వంటివి చేశారు. కుల సంఘాలను ప్రసన్నం చేసుకోవడానికి కేటీఆర్ వీలైనచోట్లల్లా ఆయా సంఘాలతో మీటింగ్ లు పెట్టడం వంటివి చేశారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపులాంటి నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, వంద గజాల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేశారు.

అంతేకాదు, ఉన్నఫళంగా గట్టుప్పల్ మండాలాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ కూడా అధికారంలో వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తయినా.. గట్టుప్పల్ ప్రజలు తమకు మండలం కావాలని ఏళ్ల తరబడి మొరపెట్టుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో.. గట్టుప్పల్ ప్రజల కోరిక నెరవేర్చారు. ఇలా అధికార పార్టీ ఎన్నికల వేళ ప్రజా సొమ్మునే పథకాల రూపంలో పంచినట్లు ఇబ్బడిముబ్బడిగా పంచి విజయం సాధించారు కేసీఆర్.

అయితే ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రజల తీర్పును తాను శిరసా వహిస్తానని అన్నారు. అధికార పార్టీ తనను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని దుయ్యబట్టారు. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సర్వశక్తులు ఒడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం అసెంబ్లీ మొత్తాన్ని మునుగోడులో మోహరించి గెలిచారన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

ten − 9 =