వాళ్లే లక్ష్యంగా.. మసీదులో పేలుళ్లు.. 33 మంది దుర్మరణం

0
866

ఆఫ్ఘనిస్థాన్ లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 33 మంది మరణించారు. 43 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘనిస్థాన్ లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది ఐసిస్. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది. మసీదులో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 2:30 గంటలకు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే.. ప్రత్యేక మతపరమైన ఆచారం అయిన జికర్‌ను ఆచరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భవనం కూడా పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతింది. పేలుడు ధాటికి మసీదుకు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. “ప్రస్తుతం మా వద్ద పేలుడు గురించి లేదా ప్రాణనష్టం గురించి ఎటువంటి వివరాలు లేవు” అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఒబైదుల్లా అబేది చెప్పారు.

ఆఫ్ఘన్ నగరాల్లో పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహిస్తుందని శుక్రవారం మీడియా నివేదికలు తెలిపాయి. మజార్-ఎ-షరీఫ్, షీ డోకాన్ మసీదులో జరిగిన పేలుళ్లకు ఐఎస్ బాధ్యత వహించింది. ఈ దాడులలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. UN ప్రతినిధి, రమీజ్ అలక్‌బరోవ్ మాట్లాడుతూ.. కుందుజ్ ప్రావిన్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన భయంకరమైన దాడిపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.