More

    చైనాలో పేలనున్న 300 బిలియన్ డాలర్ల టైం బాంబ్..!

    ఓ చైనా మహిళ.. ఇటీవల ఓ మల్టీస్టోరీడ్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆఫీస్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే, క్షణాల్లో ప్రాణాలు కోల్పోయేది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన బిల్డింగ్.. చైనాలోనే ఓ అతిపెద్ద మల్టీనేషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీ బిల్డిండ్. ఇంతకీ ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది..?

    ఇక, అదే మల్టీనేషనల్ కంపెనీ ముందు వందల మంది చైనీయులు ధర్నా చేస్తున్నారు. కొందరు ఆవేశంతో రగిలిపోతూ నినాదాలు చేస్తున్నారు. మరికొంతమంది గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొంతమందేమో అదే కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ముందు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక పోలీసులు వారిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించినా లెక్కచేయడం లేదు. అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మరికొందరు ఫ్రంట్ ఆఫీస్ రూముల్లో నీళ్లబాటిళ్లు, తినుబండారాలు సమకూర్చుకుని మరీ, రోజుల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని తరలించేందుకు చేస్తున్న పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా, తమకు న్యాయం జరిగేవరకు కదిలేది లేదంటూ భీష్మించారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో కూడా తోచడం లేదు.

    అటు కార్పొరేట్ ఆఫీస్‎ లోపల మరికొంతమంది సామూహిక ఆందోళనకు చేస్తున్నారు. కంపెనీ లాబీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మా డబ్బులు మాకిచ్చేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే, ఆందోళనకారులు ఆఫీసులోకి ప్రవేశించకుండా.. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఇవీ చైనాలో గత కొన్ని రోజులుగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు. అసలు చైనాలో ఏం జరుగుతోంది..? ఇంతకీ బిల్డింగ్‎పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్న ఆ అమ్మాయి ఎవరు..? ఓ బడా కార్పొరేట్ ఆఫీస్ ముందే వీళ్లంతా ఎందుకు ఆందోళన చేస్తున్నారు..? ఆఫీసు లాబీలోకి దూసుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు..?

    ఈ ఆందోళనకారులంతా చైనాలోని షెంజెన్‎లో వున్న ఎవర్ ‎గ్రాండ్ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థకు చెందిన ఇన్వెస్టర్లు, వెండర్లు. ఎవర్ గ్రాండ్.. చైనాలోనే రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. ఈ సంస్థకు ఒక్క షెంజెన్ లోనే కాదు.. చైనా వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలున్నాయి. ప్రతి బ్రాంచి ముందు ఇలాగే ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీరంతా ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసా..? త్వరలో దివాలా తీయబోతున్న ఎవర్ గ్రాండ్ సంస్థ నుంచి తమ డబ్బులు రాబట్టుకోవడానికి. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లంతా తమ కష్టార్జితం వెనక్కి ఇచ్చేయాంటూ మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్నారు. అయితే, ఆందోళనలు ప్రస్తుతం చైనాకే పరిమితం కావచ్చు. కానీ, కొన్ని రోజుల్లో ఇలాంటి ఆందోళనలే ప్రపంచ దేశాలను కుదిపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, చైనాలో ప్రారంభమైన ఈ ఆర్థిక విపత్తు.. కరోనా మహమ్మారిలా ప్రపంచంపై కోరలు చాచి కాచుక్కూచుంది కాబట్టి.

    అసలు ఎవర్ గ్రాండ్ ఇన్వెస్టర్ల ఆగ్రహానికి కారణమేంటి..? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఎందుకు దాడులు చేస్తున్నారు..? ఈ ఆందోళనకు మిగతా దేశాలకు సంబంధం ఏమిటి..? అంటే వుంది. 2019లో కరోనా వైరస్‎ను పకడ్బందీగా ఎగుమతి చేసి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనా.. ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎక్స్‎పోర్ట్ చేయబోతోంది. ఎవర్ గ్రాండ్ సంస్థ ఆశామాషీ కంపెనీ కాదు. చైనాలోనే రెండో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రస్తుతం ఆ కంపెనీ దివాళా దశకు చేరుకుంది. ఇన్వెస్టర్లకు ఏకంగా 300 బిలియన్ డాలర్లకు రుణపడివుంది. అంటే మన కరెన్సీలో సుమారు 22 లక్షల 10 పదివేల 850 కోట్లు. కానీ, రుణదాతలకు చెల్లించేందుకు కంపెనీ దగ్గర చిల్లి గవ్వ లేదు.

    ఇప్పటికే కంపెనీ యాజమాన్యం రుణ సంక్షోభాన్ని అంగీకరించింది కూడా. దీంతో ఏ క్షణమైనా కంపెనీ చేతులెత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే, ఆ కంపెనీ ఇన్వెస్టర్లు, వెండర్లు, స్టాక్ హోల్డర్స్ ఇంతగా ఆందోళన చెందుతున్నారు. తమ కష్టార్జితం కళ్లముందే ఆవిరైపోతుందేమోనన్న భయం వారిని వణికిస్తోంది. తాను కష్టపడి సంపాదించిందంతా ఎవర్ గ్రాండ్ చేతుల్లో పెట్టాననని.. ఆ కంపెనీ తనను ఘోరంగా చీట్ చేసిందన్నది ఈ ఇన్వెస్టర్ కన్నీటిగాథ. డబ్బులు తిరిగి చెల్లించకపోతే.. కంపెనీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని.. తనకు ఇంకా ఏం మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోందావిడ. ఈ ఇన్వెస్టర్ ది మరో గాథ. తనకు ఉన్న రెండు అపార్టెమెంట్లు అమ్మేసి మరీ.. ఎవర్ గ్రాండ్‎లో ప్రాపర్టీ కోసం ఇన్వెస్ట్ చేశానని.. కంపెనీ తనను ఘోరంగా మోసం చేసిందన్నది ఈవిడ ఆవేదన. ఇలాంటి వాళ్లు చైనాలో ప్రస్తుతం లక్షల్లో వున్నారు. ఆ కంపెనీ నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు దాదాపు పది లక్షల మంది పెట్టుబడులు పెట్టారు. తీరా, కంపెనీ దివాలా బాట పట్టేసరికి ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

    సరే, ఆ కంపెనీ దివాలా తీస్తే మిగతా దేశాలకు ఏంటనే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా..? ఎవర్ గ్రాండ్ సంస్థ ప్రపంచంలోని టాప్-500 కంపెనీల్లో ఒకటి. చైనాలో ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టిన 800 ప్రాజెక్టులు అసంపూర్తిగా వున్నాయి. దీంతో సొంతింటి కోసం కలలు గన్న పది లక్షల మంది కస్టమర్ల ఆశలు ఆవిరైపోయాయి. ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ చైనాలో ఏటా 6 లక్షల ఫ్లాట్లు నిర్మిస్తుంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు సేకరిస్తుంది. కస్టమర్ల నుంచి లక్షల కోట్లయితే సేకరించింది గానీ.. ఫ్లాట్ల నిర్మాణం పూర్తిచేయలేక దివాలా తీసింది. ఇప్పుడు ఎవర్ గ్రాండ్ రుణభారం ఏ రేంజ్‎లో వుందంటే.. పదేళ్ల క్రితం ఆ కంపెనీ రుణభారం కంటే.. ప్రస్తుత రుణభారం 56 రెట్లు ఎక్కువ.

    ప్రస్తుతం ఎవర్ గ్రాండ్ సంస్థ ఒకటి రెండు కాదు.. ఏంకగా 300 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. ఈ రుణభారాన్ని పూడ్చేదెవరు..? షీ జింపింగ్ పూడుస్తారా..? కస్టమర్ల అప్పులు చైనా అధికార కమ్యూనిస్టులు తీరుస్తారా..? ప్రస్తుతం వీటిలో ఏ ప్రశ్నకు కూడా సమాధానం లేదు. పైగా, ఎవర్ గ్రాండ్ సంక్షోభాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా కమ్యూనిస్టు సర్కార్. 2019 డిసెంబర్‎లో కరోనా వైరస్ దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేసినట్టే.. ఇప్పుడు ఎవర్ గ్రాండ్ విపత్తునూ దాచేస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి.. ఎవర్ గ్రాండ్ సంక్షోభాన్ని.. ‘సిచ్యువేషన్ ఈజ్ స్టేబుల్’ అంటూ ఓ చిన్న స్టేట్‎మెంట్‎తో కొట్టిపారేశారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇలాంటి కుదుపులు సాధారణమేనని.. అంతా సర్దుకుంటుందని సెలవిచ్చారు. వేలమంది ఆందోళన చేస్తున్నా.. కంపెనీ కస్టమర్లు ఆత్మహత్యలకు తెగిస్తున్నా.. ముంచుకొస్తున్న సంక్షోభం చైనా పాలకులకు ‘స్టేబుల్’గా కనిపిస్తోంది. ‘స్టేబుల్’ అని సర్దిచెప్పినంతమాత్రానా.. సంక్షోభం ఆగదు కదా..!

    ఇదిలావుంటే, ఎవర్ గ్రాండ్ రియల్ ఎస్టేట్ కంపెనీ.. తన రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ప్రయత్నాుల చేసినా.. అవి కూడా బెడిసికొట్టాయి. ఆ కంపెనీ ఇటీవలే ఓ ఫుట్ బాల్ టీమ్‎ను కొనుగోలు చేసింది. ఓ ఫుట్ బాల్ అకాడమీని కూడా స్టార్ట్ చేసింది. ఫుట్ బాల్ శిక్షణ కోసం లక్షమంది కెపాసిటీతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్ బాల్ స్టేడియం కూడా నిర్మించింది. అంతేకాదు, మినరల్ వాటర బిజినెస్ కూడా మొదలుపెట్టింది. ఎలక్ట్రిక్ కార్ల బిజినెస్‎లోకి అడుగుపెట్టింది. గత ఏప్రిల్ నెల వరకు ఎవర్ గ్రాండ్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విలువ 87 బిలియన్ డాలర్లు. కానీ, ఇప్పటివరకు కంపెనీ ఒక్క కారు కూడా అమ్మలేదు. ప్రతి వ్యాపారం ప్రారంభానికే పరిమితమైంది. మరి, వ్యాపారంలో పైసా సంపాదన లేనప్పుడు.. ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి ఎలా చెల్లిస్తుంది..?

    ఇక, చివరి ప్రయత్నంగా.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కంపెనీ ఫైనాన్షియల్ అడ్వయిజర్ల సలహా మేరకు.. సంస్థ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. అదీ వర్కౌట్ కాలేదు. ఓవైపు కరోనా సంక్షోభం, మరోవైపు రాబడి లేక.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎవర్ గ్రాండ్ షేర్లు వరుసగా క్షిణించడం ప్రారంభించాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లు 81 శాతం క్షిణించాయి. ఇప్పుడు కంపెనీ ముందు ఒకే ఒక ప్రత్యామ్నాయం మిగిలివుంది. ప్రభుత్వం రంగంలోకి దిగి బేలౌట్ ప్యాకేజీ ప్రకటించి.. కస్టమర్లకు సెటిల్ మెంట్ చేయడం. మరి, ఇందుకు జింపింగ్ సర్కార్ ప్రయత్నిస్తుందా..? ప్రయత్నిస్తే, ఫలితమెంత..?

    ఏదేమైనా, ఎవర్ గ్రాండ్ సంక్షోభం.. లీమన్ బ్రదర్స్ సంక్షోభాన్ని తలపిస్తోంది. 13 ఏళ్ల క్రితం అమెరికాలోని లీమన్ బ్రదర్స్ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కుప్పకూలిపోయింది. 600 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి చేతులెత్తేసింది. అప్పట్లో లీమన్ బ్రదర్స్ సంక్షోభం.. కాన్సర్‎లా వ్యాపించి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. భారత్ సహా దాదాపు, ప్రపంచ దేశాలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాంకులన్నీ తీవ్రమైన ఆర్థిక నష్టాల్ని చవిచూడాల్సి వచ్చింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయాయి. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. అప్పుడు.. బ్యాంకులను కాపాడటానికి అమెరికా ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగాల్సివచ్చింది.

    ప్రస్తుతం ముంచుకురాబోతున్న ఎవర్ గ్రాండ్ విపత్తు కూడా లీమన్ బ్రదర్స్ సంక్షోభంలాగే కనిపిస్తోంది. ఒకవేళ చైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. ఇది చైన్ రియాక్షన్‎లా ప్రపంచమంతా పాకిపోవడం ఖాయం. ఎవర్ గ్రాండ్‎తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగిన ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్యాంకుల ఆర్థిక వనరులు ఆవిరైపోవచ్చు. ఆ భారం ప్రజలపై పడుతుంది. ముందుగా చైనాలో ఎవర్ గ్రాండ్ ఇన్వెస్టర్లతో పాటు.. మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. వారి సేవింగ్స్ అన్నీ ఆవిరైపోతాయి. కంపెనీలు మూతపడతాయి. ఉద్యోగాలు ఊడిపోతాయి. కానీ, ముంచుకొస్తున్న సంక్షోభం నుంచి గట్టెక్కడం చైనాకు అంత ఈజీ కాదు. ఎవర్ గ్రాండ్ విపత్తు చైనాలో ఇంకా ఎన్ని కంపెనీలను ముంచేస్తుందో ఎవరికీ తెలియదు. అదే జరిగితే, అన్ని కంపెనీలను చైనా ఎలా సేవ్ చేస్తుందన్నది ఇప్పుడు బిగ్ క్వచ్చన్.

    చెప్పాలంటే.. ఎవర్ గ్రాండ్ స్టోరీ.. సరిగ్గా చైనా ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. చైనా అభివృద్ధి అంతా నీటి బుడగ చందమే. అక్కడ అభివృద్ధి మొత్తం అప్పులమయమే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ మొత్తం ఇలా అప్పులతోనే నిలదొక్కుకున్నాయి. ఇలా అప్పులతో కట్టిన పేకమేడలు.. ఏ చిన్న అవాంతరం ఎదురైనా తట్టుకోలేవు. ఈ అప్పుల బుడగ ఏ క్షణమైనా బద్దలు కావచ్చు. చైనాలో ఎవర్ గ్రాండ్ సంక్షోభం ఇస్తున్న సంకేతం అదే. ఈ విపత్తు ఎవర్ గ్రాండ్ తో ఆగిపోతుదు. కొన్ని వేల కంపెనీలను ముంచేస్తుంది. అదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమవుతుంది. రాబోయే ఏడాది కాలంలో చైనా కార్పొరేట్ సంస్థల రుణభారం ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే మన కరెన్సీలో 95 లక్షల 80 వేల 350 కోట్లు. దీనిని బట్టి చైనా రూపంలో ప్రపంచం ముందు ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభం పొంచివుందో అర్థం చేసుకోవచ్చు.

    కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత.. అంటే 2020 ప్రారంభంలో చిన్నా, పెద్దా కలిసి చైనాకు చెందిన 2 లక్షల కంపెనీలు దివాలా తీశాయి. ఈ లిస్టులో మరిన్ని కంపెనీలు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2019, 2020 సంవత్సరాల్లో చైనా కార్పొరేట్ సంస్థలు 20 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయలేక చతికిలబడ్డాయి. ఈ అప్పుల కొండను కరిగించాలంటే.. చైనా ముందున్న ఏకైక మార్గం మళ్లీ అప్పు చేయడమే. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది ముమ్మాటికీ నిజం. 2020లో చైనా బ్యాంకులు రికార్డు స్థాయిలో 3 బిలియన్ డాలర్ల కొత్త రుణాలిచ్చాయి. కానీ, ఇంకెంత కాలం బ్యాంకులు ఇలా అప్పులు ఇస్తూపోతాయి..? ఈ అప్పుల బుడగ ఏ క్షణమైనా పేలిపోవచ్చు. ఈ ఎవర్ గ్రాండ్ సంక్షోభం.. ఏ క్షణంలోనైనా చైనా అప్పుల బుడగను పేల్చేయవచ్చు. అదే జరిగితే, కరోనా మహమ్మారి వ్యాపించినట్టే.. చైనా ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కూడా ఆవహిస్తుంది. ఎవర్ గ్రాండ్ సంక్షోభంతో ఇప్పటికే చాలా కంపెనీలు దివాలా బాటపట్టాయి. ఈ పరిస్థితి తమ దాకా వస్తుందేమోనని చైనాలోని కంపెనీలు వణికిపోతున్నాయి. అదే జరిగితే.. చైనా దిగుమతులపై ఆధారపడిన దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతినే ప్రభావం వుంది.

    Related Stories