300 మంది మహిళలు చనిపోతే కానీ కళ్లు తెరువని ఇరాన్.. హిజాబ్ పై కీలక నిర్ణయం..!

0
795

ఇరాన్ దేశంలో ఇటీవలి కాలంలో మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే..! హిజాబ్ లేని మహిళలను గుర్తించే మొరాలిటీ పోలీస్ (నైతికత పోలీసు విభాగం) ఓవరాక్షన్ ను ఆ దేశంలోని మహిళలు సహించలేకపోతున్నారు. మహిళలు దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించినందుకు అరెస్టు చేస్తూ వచ్చారు. మహసా అమిని అనే యువతి మరణంతో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. రెండు నెలలకు పైగా నిరసనలు కొనసాగాయి. తాజాగా ఇరాన్ తన నైతికత పోలీసు విభాగాన్ని రద్దు చేసినట్లు ఒక అధికారి ఆదివారం తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటానికి తలొగ్గి మోరల్ పోలీసింగ్ ను ఎత్తివేసింది. హిజాబ్ ను తనిఖీ చేసే మొరాలిటీ పోలీస్ విధానాన్ని రద్దు చేసింది. ఈ నైతికత పోలీసులకు ఇరాన్ న్యాయవ్యవస్థతో సంబంధం లేదని, ఈ వ్యవస్థను తొలగిస్తున్నామని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరి వెల్లడించారు.

1979 నుండి ఇరాన్ లో కొందరు అధికారులు స్త్రీలు, పురుషుల దుస్తులకు సంబంధించి దుస్తులకు సంబంధించి కఠినమైన నియమావళిని తీసుకుని వచ్చారు. అప్పటి అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ ఆధ్వర్యంలో, నైతికత పోలీసులను.. అధికారికంగా గాష్ట్-ఇ ఎర్షాద్ అని పిలుస్తారు. దీన్ని హిజాబ్ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి స్థాపించారు. ఈ యూనిట్లను ఇరాన్ కు చెందిన సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రివల్యూషన్ ఏర్పాటు చేసింది, దీనికి ఈరోజు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నాయకత్వం వహిస్తున్నారు. 2006లో ఇరాన్ లో తమ గస్తీని ప్రారంభించి, దుస్తుల కోడ్‌ను అమలు చేస్తూ వచ్చారు. మహిళలు పొడవాటి దుస్తులు ధరించాలని, షార్ట్‌లు, రిప్డ్ జీన్స్, ఇతర బట్టలు వేసుకోడాన్ని నిషేధించారు. అయితే రాను రానూ మహిళలను వేధించడమే ఈ మొరాలిటీ పోలీసుల పని అయిపొయింది. హిజాబ్ లేకుండా కనిపించిన మహ్సా అమిని అనే మహిళను అరెస్ట్ చేయగా, కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. దాంతో ఇరాన్ లో ప్రజాగ్రహం భగ్గుమంది. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దేశవ్యాప్త నిరసనల సందర్భంగా జరిగిన హింసలో 300 మంది వరకు మరణించారు.