More

    ఐపీఎల్ 2022 విన్నర్ గా.. గుజరాత్ టైటాన్స్

    ఐపీఎల్-2022 లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది. టాస్ గెలవడం ఒక్కటే రాజస్థాన్ కు కలిసి వచ్చింది. అయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకోవడం కూడా రాజస్థాన్ రాయల్స్ పొరపాటని చెబుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా అన్ని విషయాల్లోనూ ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ కంటే మెరుగ్గా నిలిచాడు.

    గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. 131 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (5) వెనుదిరిగినా, వేడ్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరినా.. కెప్టెన్ పాండ్యా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పాండ్యా 34 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో అవుటవ్వగా.. గిల్ (45 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) లాంఛనాన్ని పూర్తీ చేశారు. బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్.. తలా ఒక వికెట్ తీసుకున్నారు.

    టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. జోస్ బట్లర్ 39 పరుగులు చేయగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 14, దేవదత్ పడిక్కల్ 2, హెట్మెయర్ 11, అశ్విన్ 6, రియాన్ పరాగ్ 15, బౌల్ట్ 11, మెక్ కాయ్ 8 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో పాండ్యాకు 3 వికెట్లు, సాయి కిశోర్ కు 2, షమీకి 1, యశ్ దయాళ్ కు 1, రషీద్ ఖాన్ కు 1 వికెట్ దక్కాయి.

    ఐపీఎల్ తాజా సీజన్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా, క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో, ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.

    Trending Stories

    Related Stories