టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇంటర్ పోల్ దాకా..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించింది. ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్ ప్రముఖులు సహా 12 మందికి బుధవారం నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. వీరిని ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు విచారించనున్నారు. 2017 జూలైలోనే టాలీవుడ్ ప్రముఖులతోసహా మొత్తం 62 మంది అనుమానితుల నుంచి జుట్టు, గోళ్ల నమునాలను సేకరించింది. మాదకద్రవ్యాలు తీసుకునే వారికి చాన్నాళ్ల పాటు వీటిలో ఆనవాళ్లు ఉంటాయని ఇలా చేసింది. అయితే ఆ పరీక్షల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశాన్ని ఇప్పటికీ బయటపెట్టలేదు.
ఆగస్టు 31: పూరీ జగన్నాథ్, సెప్టెంబర్ 2: చార్మీ కౌర్, సెప్టెంబర్ 6: రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8: రాణా దగ్గుబాటి, సెప్టెంబర్ 9: రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, సెప్టెంబర్ 13: నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, సెప్టెంబర్ 15: ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17: తనీష్, సెప్టెంబర్ 20: నందు, సెప్టెంబర్ 22: తరుణ్ ఇలా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై తెలంగాణ అబ్కారీ శాఖ దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేయగా ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డ్రగ్స్ కొనుగోలు కోసం విదేశాలకు నిధులు ఎలా మళ్లించారో తెలుసుకునేందుకు డ్రగ్స్ పెడ్లర్లైన కెల్విన్, కమింగా, విక్టర్ ల వాంగ్మూలాన్ని ఇప్పటికే ఈడీ సేకరించింది. విదేశీ అకౌంట్లలోకి తరలిపోయిన లెక్కలను తీయడంపై ఈడీ దృష్టి సారించింది. ఇందుకుగాను ఇంటర్ పోల్ సాయాన్ని తీసుకోబోతోంది. గత సిట్ విచారణలోనే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని.. విదేశాల నుంచి డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్నట్టు నివేదిక వచ్చింది. కొందరు హవాలా మార్గంలో డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు ఈడీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి.