ఉదయ్ పూర్ లో ఇంటర్నెట్ సేవలు బంద్

0
748

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మను సపోర్టు చేసినందుకు ఓ టైలర్ ను దారుణంగా హత్య చేశారు. మాల్దాస్ వీధి ప్రాంతంలో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు పొట్టనబెట్టుకున్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య చేసినట్లు నిందితులు వీడియో విడుదల చేశారు. తలనరకడం గురించి మాట్లాడుతూ నుపుర్ శర్మను సపోర్టు చేసినందుకే ఆ వ్యక్తిని హత్య చేసినట్లు వెల్లడించారు. అలాగే ప్రధానమంత్రి మోదీని కూడా ఆ వీడియోలో బెదిరించారు.

అయితే సమాచారం మేరకు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల్డాస్ స్ట్రీట్ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూసేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 600 మంది పోలీసులను ఆ ప్రాంతానికి తరలించారు. ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తతలు తలెత్తడంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఉదయ్‌కుమార్‌లో ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని, వీడియోను ఎవరికీ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.