More

    ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలి.. ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల

    ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో పాఠశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. అదే రోజున నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలని.. నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని.. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజునే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 16న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, ఆ రోజున అనేక కార్యక్రమాలను పండుగలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

    రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలు జరగని నేపథ్యంలో కమిటీ సిఫారసుల మేరకు పదో తరగతి మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజితో సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని వివరించారు. ఇంటర్ సెకండియర్ లో 5,08,672 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులైనట్టు మంత్రి వెల్లడించారు. ఎవరైనా ఈ ఫలితాల పట్ల సంతృప్తి చెందకపోతే, వారికి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

    Related Stories