ఆగస్టు 20న హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో టీసీ కోసం విద్యార్థి నిప్పంటించుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలలు అనుమతులు లేకుండా విద్యా సంస్థలను నిర్వహించడమే కాకుండా.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు ఇంటర్ కళాశాలల బంద్ కు పిలుపును ఇచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదని ఆరోపించారు. నేడు నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహిస్తున్న నారాయణ, శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలని అన్నారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు, ఆత్మహత్య లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న, అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.