హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోయే సిరివెన్నెల సీతారామశాస్త్రి బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను చూడడం కోసం పలువురు అధికారులతో కలిసి ఇంటెలిజెన్స్ డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్ కూడా వచ్చారు. ఆ సమయంలో ఆయన స్టేజ్ మీద ఫోటోలు తీస్తూ ముందుకు నడుస్తూ వచ్చారు. అలా నడుస్తూ ఒక్క సారిగా స్టేజ్ మీద నుండి కిందకు పడిపోయారు. ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన సిబ్బంది, ఇతర అధికారులు వెంటనే ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లారు. ఆయన్ను అక్కడి నుండి మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని పాట్నా. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో జూబ్లీహిల్స్ ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.