More

    టెర్రర్ అలర్ట్.. ఆగష్టు 5న ఢిల్లీపై డ్రోన్ అటాక్..?

    ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లతో తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో డ్రోన్ల కలకలం మొదలైంది. పాకిస్థాన్ భూభాగం నుండి వచ్చిన డ్రోన్లను భారత సైన్యం కూల్చివేయడం కూడా జరిగింది. మరికొన్ని తప్పించుకుని వెళ్లిపోయాయి. త్వరలోనే యాంటీ డ్రోన్ సిస్టమ్ ను భారత సైన్యం చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది.

    ఆగష్టు 15 దగ్గర పడుతూ ఉండడంతో తీవ్రవాదులు ఉగ్రదాడికి ప్రణాళికలు రచిస్తున్నారనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర నిఘా వర్గాలు భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ పోలీసులకు ఆగష్టు 15 కు ముందే దాడి జరగొచ్చనే విషయమై భద్రతా సంస్థల నుండి సమాచారం అందింది. డ్రోన్ దాడి జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఆగస్టు 5 న ఉగ్రదాడికి అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున ఈ ఆపరేషన్ చేపట్టడానికి ఉగ్రవాదులు డ్రోన్ దాడిని ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. సమాచారం వచ్చిన తరువాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్రవాద దాడులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి.

    నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో డ్రోన్ ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సన్నద్దమయ్యారు. ఈ మేరకు పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై శిక్షణ ఇవ్వాలని ఆయా జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 15 లోపుగా శిక్షణ ఇవ్వనున్నారు. నగరంలోని డ్రోన్ లకు సంబంధించిన సమాచారం గురించి జిల్లాలోని ఎస్‌హెచ్‌ఓలు తెలుసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. 30వేల మంది పోలీసులు నగరంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సింగు, తిక్రి, ఘాజిపూర్ సరిహద్దుల సమీపంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది ఢిల్లీ పోలీస్ శాఖ. జమ్మూలోని ఐఎఎఫ్ స్టేషన్‌పై ఇటీవల జరిగిన డ్రోన్ దాడి దృష్ట్యా ఢిల్లీ పోలీసు కమిషనర్ బాలాజీ శ్రీవాస్తవ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ (డిసిపి), జాయింట్ సిపి ఇతర ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

    Trending Stories

    Related Stories