ఇటీవలికాలంలో భారత్ రక్షణరంగంలో గణనీయమైన ప్రగతి కనబరుస్తోంది. ముఖ్యంగా స్వదేశీ తయారీ విషయంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధిని సాధించింది. మేకిన్ ఇండియాలో భాగంగా గరిష్ట సంఖ్యలో రక్షణ ఉత్పత్తులు భారత్‌లోనే తయారవుతున్నాయి. కొన్నింటిని విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నా.. దేశీయ అవసరాలకు అనుగుణంగా.. మనదేశంలోనే మార్పులు చేర్పులు చేస్తున్నారు. భారత్‌లోనే తయారు చేయాలనే కచ్చితమైన నిబంధనల మేరకే రక్షణ ఒప్పందాలు చేసుకుంటోంది. అంతేకాదు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తూ.. శత్రుదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అదికూడా అగ్రరాజ్యాల దిష్టి సోకకుండా సీక్రెట్‌గా పని కానిచ్చేస్తోంది. ఇలాంటివి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసింది. రక్షణ రంగం తయారు చేసిన ఓ రహస్య ఆయుధం ఇటీవలే వెలుగుచూసింది. నిజానికి ఆర్నెళ్ల కిందటే అది విధుల్లోకి చేరినా.. ఇప్పటివరకు ఆ ఆయుధం గురించి చిన్న విషయం కూడా బయటికి రాలేదు. అదే వార్ షిప్ ఐఎన్ఎస్ ధృవ్. vc-11184 సీక్రెట్ కోడ్‌తో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసింది భారత్.
భారత సరిహద్దుల్లో ప్రమాదకరంగా తయారైన పాకిస్తాన్, చైనాలకు చుక్కలు చూపించే ఆయుధం ఐఎన్ఎస్ ధృవ్. ఈ రెండు శత్రుదేశాల అణ్వస్త్రాలను సైతం క్షణాల్లో పసిగట్టి, కుప్పకూల్చే శక్తి దీని సొంతం. బాలిస్టిక్ మిస్సైల్ ఎటాక్స్ ను ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పవర్ఫుల్ వార్‌షిప్‌ను ఇండియన్ నేవీ అత్యంత రహస్యంగా తయారు చేసింది. అగ్రదేశాల నుంచి ఎదురయ్యే అడ్డంకులకు చెక్ పెడుతూ ఈ నౌక్ ను సీక్రెట్ గా తయారు చేశారు. ఇటీవలికాలంలో రక్షణ విషయాల్లో ఎంత రహస్యంగా వ్యవహరించినప్పటీకి.. కొన్ని విషయాలు మీడియాకు తెలుస్తున్నాయి. వాటి శక్తి సామర్థ్యాలు, లక్షణాలపై ముందుగానే సమాచారం బయటికొస్తోంది. అంతేకాదు, కొన్నిసార్లు మీడియాలో ఫొటోలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. అందుకే, ఐఎన్ఎస్ ధృవ్ విషయంలో నేవీ అంత్యంత పకడ్బందీగా వ్యవహరించింది.
VC-11184 ప్రాజెక్టు పనులు జూన్ 2014లోనే ప్రారంభమయ్యాయి. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ కు చెందిన ఓ అండర్ కవర్డ్ డ్రైడాక్‌లో ఈ స్పై షిప్ ను తమారు చేశారు. 2018 నాటికి ఈ రహస్య నౌక సీ ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. రెండు ఫుడ్ బాల్ కోర్టుల వైశాల్యంతో అత్యంత భారీగా వుండే ఈ నౌకలో 300 మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ నౌక నిర్మాణానికి భారత్ ప్రభుత్వం 15 లక్షల కోట్లు ఖర్చుచేసింది. ఐఎన్ఎస్ ధృవ్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని పొందుపరిచారు. ఎక్స్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ వంటి పవర్ ఫుల్ రాడార్ వ్యవస్థను వాడారు. వీటిద్వారా సుదూరంలో వున్న బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టవచ్చు. ప్రస్తుతానికి రాడార్ల పూర్తి పెర్ఫార్మెన్స్ డేటా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ISRO ఉపగ్రహాల్లో వాడే ఎల్ బ్యాండ్ మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఇందులో వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ రాడార్లలో వాడిన సెన్సర్లు ఎంతో శక్తివంతమైనవి. ఈ షిప్లో మూడు యాగ్జిలరీ పవర్ జనరేటర్లు.. రెండు కంబైన్డ్ డీజిల్ ఇంజిన్లు కలిపి.. మొత్తం 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో సీ3 అంటే కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనిషన్ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు.
అంతేకాదు, ఈ షిప్ లో అమర్చిన ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్ యాంటెన్నా వల్ల.. శత్రుదేశాల నౌకలు, ఎయిర్ క్రాఫ్టులు ఉత్పత్తి చేసే విద్యదయస్కాంత ఉద్గారాలను సులభంగా పసిగడుతుంది. దీంతో వాటి ఉనికి క్షణాల్లో తెలిసిపోతోంది. దీనివల్ల శత్రువు దాడిచేసేలోగా మనమే ఎదురుదాడి చేయవచ్చు. అంతేకాదు, భారత నౌకాదళంలో అత్యంత శక్తివంతమైన చేతక్, ధృవ్ లాంటి హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం కూడా ఈ షిప్ లో ఏర్పాట్లున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సిబ్బంది.. షిప్ నుంచే డైరెక్ట్ గా భారత భద్రతా సలహదారుకు రిపోర్టు చేసే వెసులుబాటు వుంది. ఆకాశాన్ని స్కాన్ చేయడమే కాదు.. సముద్రాన్ని కూడా క్షుణ్ణంగా శోధిస్తుంది. ఒకే సమయంలో వివిధ ఆపరేషన్లు చేపట్టగల సత్తా ఐఎన్ఎస్ ధృవ్ సొంతం. మిస్సైల్ టెస్ట్ రేంజి ఇన్ స్ట్రుమెంటేషన్ షిప్ లా కూడా పనిచేస్తుంది. దీనిద్వారా చైనాకు చెక్ పెట్టేందుకు మరింత విస్తృత రేంజి బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకునే వెసులుబాటు కూడా వుంటుంది. ఒక్కటేమిటి.. నింగి, నేల, ఆకాశం.. ఇలా శత్రువు వైపు నుంచి దూసుకొచ్చినా.. ముందే పసిగట్టి ఎదురుదాడి చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది ఐఎన్ఎస్ ధృవ్. అందుకే దీనిని భారత త్రినేత్రంగా అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు.