భారతీయ భాషల కోసం సరికొత్త యాప్ లను తీసుకుని రాబోతున్న ప్రభుత్వం

భారతదేశం.. ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో భిన్నమైనది..! ఎందుకంటే మన దేశంలో ఉన్న ఆచార వ్యవహారాలు.. భిన్నమైన భాషలు.. ఇలా చాలా విషయాల్లో ప్రత్యేకత ఉంది కాబట్టే భారతదేశం ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి.. రాష్ట్రానికి ఒక భాష.. ప్రాంతానికి ఒక యాస. ఇలా కొత్త భాష నేర్చుకోడానికి.. కొత్త ప్రాంతానికి వెళ్లిన వారు ఏదైనా అడగాలని అనుకున్నా వచ్చే సమస్యలను అధిగమించడానికి భారత ప్రభుత్వం సరికొత్తగా ప్రయత్నాలను మొదలుపెట్టింది.
భారత ప్రభుత్వానికి చెందిన MyGov.. డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో కలిసి కొత్తగా లాంగ్వేజ్ యాప్ ను తీసుకుని రావాలని అనుకుంటోంది. ‘ఇండియన్ లాంగ్వేజ్ లర్నింగ్ యాప్’ ను తీసుకుని రావాలని భావిస్తోంది. ఈ యాప్ ద్వారా భారతదేశంలోని భాషలను ఎవరైనా నేర్చుకొనే విధంగా ఉండాలి. చిన్న చిన్న పదాలను, వ్యాఖ్యాలను వీలైనంత త్వరగా నేర్చుకునే విధంగా యాప్ ఉండాలి. ఈ యాప్ ను ఎవరైనా రూపొందించవచ్చని.. మంచి యాప్ కు ఫండింగ్ కూడా ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
భారత్ లోని భాషలన్నీ యాప్ లోకి తీసుకుని వచ్చి సులువుగా ఇతర భాషలపై పట్టు సాధించేలా ఉండాలని MyGov ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్స్ లో సింప్లిసిటీ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, గేమిఫికేషన్ ఫీచర్స్, యుఐ, యుఎక్స్, సుపీరియర్ కంటెంట్.. అలాగే సులువుగా ఫన్ తో కూడుకున్న యాప్ తో భారతీయ భాషలను నేర్చుకొనేలా యాప్ ఉండాలని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలో భాగంగానే ఈ ఛాలెంజ్ ను తీసుకుని వచ్చామని మినిస్ట్రీ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఐటీ తెలిపింది. అన్ని భాషలను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి.. నేర్చుకునేందుకు సులువుగా ఉండాలన్నది మోదీ అభిమతమని తెలిపారు.
భారతీయులు ఎవరైనా సరే యాప్ ను తయారు చేయవచ్చని.. స్టార్టప్ కంపెనీలు కూడా దీన్ని ఛాలెంజ్ గా స్వీకరించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. యాప్ డెవెలపర్స్ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన విధానంలో అర్థమయ్యేలా యాప్ లను తయారు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఛాలెంజ్ మే 27, 2021న ముగుస్తుందని.. అంతలోపు ప్రోటోటైప్ లను సబ్మిట్ చేయాలని తెలిపారు. సెలెక్ట్ అయిన వాటిలో టాప్ 10 యాప్ లను ప్రెజెంటేషన్ ఇవ్వడానికి పిలుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. జ్యూరీ సెలెక్ట్ చేసిన మొదటి మూడు యాప్స్ కు 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షల చొప్పున ఫండింగ్ ఇస్తామని తెలిపింది.