More

    వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

    టీమిండియా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో పెద్దగా మెరుపులు మెరిపించకపోయినా.. బౌలింగ్ లో మాత్రం మంచి ప్రదర్శన కనబరచడంతో రెండో వన్డేలో 44 పరుగులతో విజయం అందుకుంది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో షామ్రా బ్రూక్స్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు. లోయరార్డర్ లో అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) పర్వాలేదనిపించారు.

    టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ టాపార్డర్ పెద్దగా రాణించలేదు. జట్టులో హేమాహేమీలు ఉన్నప్పటికీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 5 పరుగులకే అవుటయ్యాడు. కీమార్ రోచ్ బౌలింగ్ లో హోప్ కి క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఓపెనర్ గా వచ్చాడు రిషబ్ పంత్. మొదటి సారి వన్డే మ్యాచ్ లో ఓపెనింగ్ దిగాడు పంత్. అయితే తన శైలికి విరుద్ధంగా ఆడుతూ వెళ్ళాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 34 బంతులు ఆడిన పంత్ మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. 30 బంతుల్లో 18 పరుగులు చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఒకే ఓవర్ లో ఓడియన్ స్మిత్ పంత్, కోహ్లీని అవుట్ చేశాడు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించడంతో భారత్ పుంజుకుంది. సూర్యకుమార్ యాదవ్ 83 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేయగా, కరోనా నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. సుందర్ 24, దీపక్ హుడా 29 పరుగులతో ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 2, అల్జారీ జోసెఫ్ 2, కీమార్ రోచ్ 1, జాసన్ హోల్డర్ 1, అకీల్ హోసీన్ 1, ఫాబియెన్ అలెన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 11న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.

    Trending Stories

    Related Stories