More

    స్పెయిన్ పై విజయం సాధించిన భారత్.. క్వార్టర్స్ చేరిన లోవ్లినా

    పురుషుల హాకీ జట్టు మరో అద్భుత విజయాన్ని అందుకుంది. స్పెయిన్‌తో జరిగిన పూల్-ఎ మూడో మ్యాచ్‌‌లో 3-0తో భారత్ విజయాన్ని అందుకుంది. ఆట ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత జట్టు అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసింది. గోల్ కీపర్ శ్రీజేష్ స్పెయిన్ పెనాల్టీ కార్నర్ లను అడ్డుకోవడం మ్యాచ్ కే హైలైట్. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్‌పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ మరో గోల్ చేశాడు. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. మూడో మ్యాచ్ లో పుంజుకోగలిగింది.

    భారత మహిళా బాక్సర్ లోవ్లినా క్వార్టర్-ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. జర్మనీకి చెందిన నాడిన్ ఆప్టెజ్‌పై లోవ్లినా విజయం అందుకుంది. మొదటి రెండు బౌట్లలోనూ లోవ్లినా మంచి ప్రదర్శన కనబరిచింది. అస్సాంకు చెందిన 23 ఏళ్ల లోవ్లినా జర్మనీకి చెందిన 35 ఏళ్ల ఆప్టెజ్‌ను ఓడించి క్వారర్ ఫైనల్స్‌కు చేరుకుంది. లోవ్లినా నుండి అద్భుతమైన కౌంటర్-పంచ్ ప్రదర్శన ఈ మ్యాచ్ లో కనిపించింది. ఆమె స్కోరింగ్ పంచ్ లు విజయాన్ని అందించాయి.

    10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీంలో సౌరభ్ చౌదరి, మనుబాకర్ నిరాశ పరిచారు. క్వాలిఫికేషన్ స్టేజ్-1లో అగ్రస్థానంలో నిలిచి పతకం ఆశలు రేపిన వీరిద్దరూ స్టేజ్-2లో రాణించలేకపోయారు. స్టేజ్-2 లో మొత్తం 8 జట్లు పాల్గొనగా, భారత జోడీ కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా తదుపరి మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయింది.

    Related Stories