More

    కివీస్ చేతిలో భారత్ ఓటమి.. ఇక సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే..!

    ఐసీసీ టీ20 ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్స్ గా దిగిన భారత జట్టు.. ఘోర ఓటములను చవిచూస్తూ ఉంది. మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోగా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కివీస్ చేతిలో కూడా భారత్ ఓటమి పాలైంది. ఇక భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే..! దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించారు.

    టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా చేసిన 26 పరుగులే అత్యధికం. హార్దిక్ పాండ్య 23 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన రోహిత్ శర్మ 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి నిరాశపర్చగా, ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ (4) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రిషబ్ పంత్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కివీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ 3, లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ 1, ఆడమ్ మిల్న్ 1 వికెట్ తీశారు.

    ఛేజింగ్ లో కివీస్ ఎటువంటి పొరపాట్లు కూడా చేయలేదు. ఓపెనర్ డారిల్ మిచెల్ 49 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్)మ్యాచ్ ను ముగించే వరకూ క్రీజ్ లో ఉన్నాడు. మిచెల్ 4 ఫోర్లు, 3 సిక్సులు బాది.. మ్యాచ్ ను భారత్ చేతుల్లో నుండి లాక్కున్నాడు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 20 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్, విలియమ్సన్ జోడీ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. మిచెల్ అవుటైనా కాన్వేతో కలిసి విలియమ్సన్ జట్టును గెలిపించాడు. ఇక భారత్ సెమీస్ చేరడం చాలా కష్టంగా మారింది.

    Trending Stories

    Related Stories