More

    మొదటి రోజు ఆట జరిగేనా..?

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు వరుణుడు షాక్ ఇచ్చాడు. మొదటి రోజు సమయం గడిచే కొద్దీ వరుణుడు అభిమానుల ఆశలతో దోబూచులాడుతూ ఉన్నాడు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట దాటినా కూడా వర్షం వాయిదాల పద్ధతిలో వస్తూ.. వెళుతోంది. కొద్ది సేపు వర్షం రావడం.. గ్రౌండ్స్ మెన్ నీరు లేకుండా చేయడం.. ఆ తర్వాత వర్షం పడడం.. ఇలా సాగుతూనే ఉంది. ఇంకా టాస్ కూడా పడలేదు..! దీంతో మొదటి రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు అభిమానులను వెంటాడుతూ ఉన్నాయి.

    భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజే సౌతాంప్టన్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉందని భావించినా ఇప్పటి వరకూ టాస్ కూడా వేయలేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలుకానుంది. మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటల ముందే మొదలైన వర్షం టాస్‌ సమయానికి మరింత తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు తొలి సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

    ఇప్పటికే మొదటి రోజు మొదటి సెషన్ సమయం దాటి పోయింది. సౌతాంప్టన్ లోని రోజ్ బౌల్ మైదానం ప్రస్తుతం చిత్తడిగా మారింది. తొలి రోజు మ్యాచ్ జరుగుతుందా.. టాస్ ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ మాత్రం అభిమానాలను వెంటాడుతూ ఉంది. అయితే ఈ ఫైనల్ కోసం ఒక అదనపు రోజు కేటాయించారు. రాబోయే రోజుల్లో కూడా వర్షం పడే అవకాశాలు ఉండడంతో మ్యాచ్ ఫలితం వస్తుందో లేదో తెలియని పరిస్థితి.

    Related Stories