అక్టోబర్ లో భారత్ లో జరగనున్న వన్డే ప్రపంచకప్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఆసియా కప్ బృందంలో చోటు దక్కించుకున్న హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మకు ప్రపంచ కప్ జట్టులో అవకాశం దక్కలేదు. గాయాల నుండి శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కోలుకోవడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఆసియా కప్ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఎంపికైన తిలక్ వర్మకు 15 మంది ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు. నిలకడ లేకుండా ఆడుతున్న సంజూ శాంసన్‌కు కూడా చోటు దక్కలేదు.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ KL రాహుల్ కు ఆసియా కప్ జట్టులోనే కాకుండా ప్రపంచ కప్ జట్టులో కూడా అవకాశం ఇచ్చారు. సుదీర్ఘ గాయం తర్వాత ODI జట్టులోకి తిరిగి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. ఆసియా కప్ జట్టు సెలెక్షన్ కు సంబంధించి విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాట్లాడుతూ, KL రాహుల్ మంచి ఫిట్ నెస్ తో ఉన్నాడని తెలిపాడు. అయితే ఆసియా కప్ లో గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో అటు పాకిస్థాన్ తో కానీ.. ఇటు నేపాల్ తో కానీ రాహుల్ ను దింపలేదు. సెప్టెంబర్ 10న భారత్ పాకిస్థాన్ తో సూపర్ 4 స్టేజ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో అయినా రాహుల్ కు అవకాశం ఇస్తారేమో చూడాలి.
అక్టోబర్ 5న ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఇండియా తన తొలి మ్యాచ్ ను 8వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచ కప్ లో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ 14వ తేదీన జరగనుంది. ప్రపంచ కప్ కు ప్రకటించిన జట్టులో శ్రేయాస్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించగా, కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ మీద ఇంకా అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి.
జట్టులో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లు ఉన్నారు.