More

  భారత్ అఖండ వ్యూహం..! జైశంకర్ డాక్ట్రైన్..!!

  ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు భవిష్యత్తులో దక్షిణాసియాపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. మధ్య ఆసియాలో తాలిబన్ ప్రాబల్యం తక్షణమే పెరగడం తిరస్కరించలేని వాస్తవం. కూడలిగా ఉన్న దేశంలో వచ్చిన మార్పులు చుట్టూ ఉన్న దేశాలను తాకడం సహజం. ఇండియన్ ప్లేట్ గా పిలిచే దక్షిణాసియాపై తాలిబన్ పునరుత్థానం తీవ్రమైన, ప్రమాదకరమైన ప్రభావం వేస్తుందనడంలో సందేహం లేదు.

        

  ఆఫ్ఘనిస్థాన్ అన్ రెస్ట్ వల్ల భారత్ మాత్రమే కాదు, చైనా, ఇరాన్, రష్యా, అమెరికా, జపాన్ లు సైతం  తమ విదేశాంగ విధానాలను పునస్సమీక్షించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇండో-పసిఫిక్ వ్యూహానికీ, బెల్ట్ అండ్  రోడ్ ఇనీషియేటివ్ కు మధ్య వైరుధ్యాన్ని తాలిబన్ల అధికార సాధన మరింత జటిలం చేసింది. మొత్తంగా చైనా మధ్య, ఆగ్నేయ, దక్షిణ ఆసియా దేశాల్లో క్రమంగా తన వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుకుంటోంది.

  ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ సరికొత్త ‘దక్షిణాసియా వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరముందా? ఇరుగుపొరుగును మచ్చిక చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ‘జయశంకర్ డాక్ట్రైన్’ ఏమంటుంది? చైనా, జపాన్, అమెరికాల విషయంలో జయశంకర్ అంచనాలేంటి? నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ లో ఉగ్రవాదం పెచ్చరిల్లేందుకు తాలిబన్ ఆజ్యం పోస్తుందా? తాలిబన్ల పునరాగమనం వల్ల పాకిస్థాన్ కు వచ్చే ప్రయోజనాలేంటి? భారత్ కు పొంచి ఉన్న ముప్పు ఏంటి?

  భారత ఉపఖండం ఇప్పుడు అశాంతి మైదానం. భారత్ పొరుగు ప్రాంతమంతా ప్రమాదకరమైన అస్థిరతలో ఉంది. ఉగ్ర పాకిస్తాన్, ఆక్రమణ స్వభావమున్న చైనా ప్రస్తుత స్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇది సహజం. పాకిస్తాన్, చైనా ప్రాయోజిత కుటిల కార్యకలాపాలకు ఆఫ్ఘన్ కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పుడు తన సరిహద్దులు, అంతర్గత భద్రతను మరింత జాగ్రత్తతో సంరక్షించుకోవడం భారత్​కు అత్యంత అవసరం.

  దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా చైనా ఈ ఏడాది పూర్వార్ధంలోనే వ్యూహాత్మక ముందడుగు వేసింది. చైనా-దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల కొత్త కూటమిని ఏర్పాటుచేసింది. డ్రాగన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక ఇందులో సభ్య దేశాలుగా  చేర్చుకుంది.

  పేదరిక నిర్మూలన, అత్యవసర సరఫరాల నిల్వ వంటివి కొత్త కూటమి ప్రధాన లక్ష్యాలని బయటకు చెబుతున్నా దాని వ్యూహాత్మక లక్ష్యాలు వేరు. సార్క్‌ స్ఫూర్తికి తూట్లు పొడవడంతో పాటు ప్రాంతీయంగా భారత్‌కు చెక్‌ పెట్టేందుకే డ్రాగన్‌ దీన్ని తెరమీదకు తెచ్చింది.

  ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫ్ఘన్, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక విదేశాంగ మంత్రులతో వర్చువల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ‘China-South Asia Cooperation Forum-CSACF’ భావనను ప్రతిపాదించింది. కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. సార్క్ లోని ఇతర సభ్యదేశాలైన భారత్‌, భూటాన్‌, మాల్దీవ్స్ ను దూరంగా ఉంచింది. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా సార్క్‌ అచేతనస్థితిలో ఉంది. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి కారణంగా దక్షిణాసియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

  హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హంబన్‌టొటా ఓడరేవును శ్రీలంక 99 ఏళ్లపాటు డ్రాగన్‌కు లీజుకు ఇచ్చింది. ఆఫ్ఘన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవ్స్, పాకిస్థాన్‌, నేపాల్‌, శ్రీలంకల్లో కొత్తగా 10 వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధమవుతోంది. పట్టును మరింత పెంచుకొనేందుకు కొత్త కూటమిని ముందుకుతెచ్చింది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

  దక్షిణాసియాలో భారత్ సహా భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో మార్పులు వేగం పుంజుకున్నాయి. ఉగ్రవాదం క్రమంగా బలపడే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ అధికార పగ్గాలు చేపడితే మరింత జడలువిప్పే అవకాశాలు బలంగా ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘దక్షిణాసియా వ్యూహాన్ని’ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.

  భూటాన్ లాంటి చిన్న దేశాన్ని చైనా ప్రమాదం నుంచి కాపాడుకోవడానికీ, బంగ్లాదేశ్, నేపాల్ లో ఉగ్రవాదం పెచ్చరిల్లే ప్రమాదాన్ని నివారించడానికి, కశ్మీర్ వేర్పాటువాదాన్ని కట్టడి చేయడానికి, పాకిస్థాన్, చైనాలను అదుపులో పెట్టడానికి సరికొత్త వ్యూహాన్ని రూపొందించే పనిలో పడ్డారు భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్.జయశంకర్. విదేశాంగ విధాన రూపకల్పనలో భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంకేతిక అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి.

   తాలిబన్ పరిణామం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో సంకీర్ణతను పెంచింది. కొత్త పునరేకీకరణలను అనివార్యం చేసింది. వెల్లువలా తాకిన తాలిబన్ పరిణామం సౌత్ ఆసియాలో ఉగ్రభూతానికి కొత్త కోరలు పెరిగేందుకు కారణమవుతోంది. సత్వరమే కాకపోయినా సమీప భవిష్యత్తులో భారత్ ప్రమాదాలను ఎదుర్కోక తప్పదు.

  తాలిబాన్లు మెరుపు వేగంతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా భద్రత, దౌత్య రంగాల నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు దశాబ్దాల పాటు పెట్టిన శ్రమ, పెట్టుబడిని అలాగే వదిలి పెట్టేందుకు సిద్ధపడ్డాయి. అఫ్గానిస్తాన్‌లో సంభవిస్తున్న తాజా పరిణామాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

   ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి, మాజీ దౌత్యవేత్త ఎస్.జయశంకర్ తన పుస్తకం ‘‘The india way-strategies for an uncertain world’’ లో చేసిన ఆసక్తికరమైన పరిశీలనలు తాజా స్థితి నేపథ్యంలో మరింత ఉపకరిస్తాయి. “It is time for us to engage America, manage China, cultivate Europe, reassure Russia, bring Japan into play, draw neighbours in, extend the neighbourhood and expand traditional constituencies of support.”

  అమెరికాను మచ్చిక చేసుకోవడం, చైనాను సంభాళించడం, యూరప్ ను దువ్వడం, రష్యాతో బంధాన్ని పునరుద్ధరించడం, జపాన్ ను ముగ్గులోకి దింపడం, పొరుగుదేశాలను రెక్కల కిందకు తెచ్చుకోవడం,  ఇరుగు మైదానాన్ని విస్తరించడం, మద్దతు ఇచ్చే దేశాలను ఒక్కతాటిపైకి తేవడం…సందిగ్ధ అవస్థలో అవసరమంటూ అత్యంత విలువైన సూత్రీకరణ చేశారు. జయశంకర్ పుస్తకం వెలువడే నాటికి అమెరికా-తాలిబన్ ల మధ్య  ‘దోహా శాంతి ఒప్పందం’ కుదిరింది.

  తాలిబన్ వెల్లువ భారతదేశానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చారిత్రకంగా ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో, ఈ రెండు దేశాలూ తాలిబాన్లకు మిత్రదేశాలు కావడం భారతదేశానికి సమస్యలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక, రాజకీయ అంశాల్లో పాకిస్తాన్, చైనాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య సరిహద్దు చాలా సంక్లిష్టమైనది. ఆ సరిహద్దు వెంబడి చాలా చోట్ల రాకపోకలకు ఆస్కారమిచ్చే దారులున్నాయి. అంతే కాదు, చాలాకాలం నుంచి ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో పాకిస్తాన్ చురుకుగా జోక్యం చేసుకుంటోంది.

  మొన్నటిదాకా కొనసాగిన ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, పశ్చిమ దేశాలు, భారత్ సహా ఇతర దేశాలకు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా ఇంతవరకూ ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాలు నడిచాయి.ఇకపై, పాకిస్తాన్, రష్యా, ఇరాన్, చైనాలు కలిసికట్టుగా ఈ రాజకీయ చదరంగంలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  అయితే ఇక్కడే మరో అవరోధం కూడా ఉంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య 1893 నాటి ‘డురాండ్ రేఖ’ విషయంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. 2వేల 5వందల పైచిలుకు కిలోమీటర్ల డురాండ్ లైన్ ను ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటిదాకా అంగీకరించలేదు. అయితే ఈ వివాదం ఆఫ్ఘన్-పాక్ మైత్రికి ఇప్పటికిప్పుడు అడ్డంకిగా మారే అవకాశం లేదు.

  తాలిబన్ల పునరాగమనం పాకిస్థాన్ చిరకాల వాంఛ. తాను సులభంగా ప్రభావితం చేయగలిగే ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌లో రావాలన్నదే పాకిస్తాన్ కోరిక. ఇది భారతదేశానికి పెద్ద నష్టంగా పాకిస్తాన్ అధికారులు చూపించవచ్చు. కానీ, ఇంతకుమించిన పెద్ద వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్‌కు ఉన్నాయి. ప్రస్తుతానికి దక్షిణాసియాలో తానే విజేతనని పాకిస్తాన్ భావిస్తోంది. ఓ పక్క అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలు నెలకొనడం, మరో పక్క ఆఫ్ఘనిస్థాన్ గత అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, పాకిస్తాన్‌తో అంతంతమాత్రంగా సంబంధాలు కొనసాగించడం ఉగ్రదేశానికి రుచించలేదు.

  మరోవైపు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ లో భాగమైన పాకిస్థాన్ చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అమెరికాతో బంధం బెడిసికొట్టింది. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలకు ముందు పాకిస్థాన్ విషయంలో చైనా ప్రాధాన్యత తగ్గింది. సరిగ్గా ఇదే సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో చైనాకు పాక్ అవసరం పెరిగింది. ఇదే సమయంలో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 

  పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, చైనా మూడు దేశాల మైత్రి రాబోయే రోజుల్లో దక్షిణాసియాలో చిచ్చురేపే అవకాశాలూ ఉన్నాయి. మధ్యాసియాలోని ఉగ్రవాదానికీ, తాలిబన్ లకీ మధ్య మైత్రి లేకుండా చేయడం చైనాకు అత్యవసరం. మధ్యాసియాలో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా చైనా అనేక సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటు మరిన్ని లాభాల పంట పండించే వాణిజ్య విధానాన్ని విస్తరించాలని చూస్తోంది.

  రాబోయే రోజుల్లో చైనా ఆగ్నేయాసియాలో అనుసరించే ‘అఫెన్సివ్ స్ట్రాటజీ’కి ఆఫ్ఘనిస్థాన్ లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడుతుందంటారు జోషువా కుర్లాంజిక్.  ‘China’s Charm Offensive in Southeast Asia’’ శీర్షికన కార్నెగీ మేగజైన్ లో జోషువా చైనా స్ట్రాటజిక్ పర్ స్పెక్టివ్ గురించి దూరదృష్టి నిండిన వ్యాసం రాశారు.

  ఆగ్నేయాసియయా-భారత్ మైత్రికి గండి కొట్టాలని భావిస్తోంది. అయితే ఆగ్నేసియా దేశాల్లో ముస్లీం జనాభా అధికంగా ఉంది. తాలిబన్ ప్రభావం ఆగ్నేయాసియాపై ఎలా ఉండబోతోంది అనే విషయంలో చైనా ఇప్పటికే అంచనాలు వేయడం ప్రారంభించింది. ఆగ్నేసియాపై పట్టుసాధిస్తే దక్షిణ చైనా సముద్రంపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించవచ్చని చైనా భావిస్తోంది.

  దక్షిణాసియాలోని మరో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో సైతం ఉగ్రవాదం కోరలు సాచే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ పాత్రికేయుడు సుబీర్ భౌమిక్ ‘ది డిప్లామాట్’ పత్రికకు ఆగస్ట్ 26న రాసిన ‘‘Taliban Takeover in Afghanistan Stokes Bangladesh’s Terrorist Fears ’’ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

  Harkat ul-Jihad al-Islami-HUJI, Hifazat-e-Islam, jmaat ul Mujahideen Bangladesh, Bangladesh National Party, Jamaat-e-Islami లాంటి సంస్థలు మళ్లీ బలపడే అవకాశాలున్నాయంటారు సుబీర్ భౌమిక్.

  ముఖ్యంగా హిఫాజత్ ఏ ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నడిచే మదర్సాలు బాహటంగానే మహిళలపై విషాన్ని వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో ముస్లీం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ కు తాలిబన్ ఉత్థానం వల్ల ముప్పు పొంచి ఉంది. ఇది క్రమంగా భారత్ కు విస్తరించే ప్రమాదమూ ఉంది.

  ఈ ఏడాది మే మొదటి వారంలో మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ నషీద్ ఉగ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డాయి. భారత విదేశాంగ శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఐసిస్, ఆల్ ఖైదా లాంటి సంస్థలు మాల్దీవ్స్ లో పట్టుసాధించడానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. భూటాన్ విషయంలోనూ చైనా తన వ్యూహాన్ని చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో భారత్ దౌత్య సంబంధాలు అత్యంత కీలకం కానున్నాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలా, వద్దా అన్నది భారత్ ముందున్న కీలక సవాలు. చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాలతో దౌత్యం నెరపుతూ దక్షిణాసియాలో స్థిరత్వాన్ని సాధించడానికి అవసరమైన వ్యూహాన్ని భారత్ రూపొందిస్తుందని ఆశిద్దాం.

  Trending Stories

  Related Stories