దేశ విభజన అతిపెద్ద తప్పిదం.. అఖండ భారత్ పై అసదుద్దీన్ సంచలన కామెంట్స్..!

0
889

భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అయితే బ్రిటిష్ వారి ఏలుబడిలోకి దేశం వెళ్ళినపుడు అఖండ భారతంగా ఉండేది. అందులో పాకిస్థాన్ ఉండేది. ఇక దేశ విభజన జరిగి అన్న దమ్ముల మధ్య చిచ్చు రేపింది. అలా పాకిస్థాన్, భారత్ గా విడిపోయాయి. గత ఏడున్నర దశాబ్దాల మధ్య పాక్ భారత్ ల మధ్య మంచి సంబంధాల కంటే వైషమ్యాలే ప్రధాన పాత్ర పోషించాయి. భారత్ మీద యుద్ధం అంటూ పాక్ అప్పుల పాలు అయి ఈ రోజు దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటోంది. భారత్ కూడా మూడు ప్రత్యక్ష యుద్ధాలతో పాటు ప్రచ్చన్న యుద్ధాలు చేసినా ఆర్ధికంగా బలంగా ఉంది. ఇక పాక్ భారత్ వైరం మూలంగా అమెరికా, చైనా లాంటివి బాగుపడ్డాయనే చెప్పాలి.

అలాగే ఆయుధాలు అమ్ముకునే వ్యాపార దేశాలకు ఇది ఉపయోగపడింది. దేశ విభజన కాకుండా ఉంటే ఈ రోజుకు భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా అన్ని విధాలుగానూ ఉండేది అంటారు. అలాగే అగ్రశ్రేణి ఆర్ధిక వ్యవస్థతో తులతూగేది అని అంటారు. కానీ జరిగింది మాత్రం వేరుగా ఉంది. ఇక పాకిస్థాన్ భారత్ నుంచి విడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అది అనివార్యం అని కొందరు అంటే ఆపగలిగినా చేయాల్సింది చేశారు అని కొందరు అంటారు. ఆరెస్సెస్ మాత్రం అఖండ భారతం నినాదాన్ని ఈ రోజుకీ వినిపిస్తుంది. ఇపుడు ముస్లింలకి నాయకత్వం వహించే మజ్లీస్ పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ దేశ విభజన చారిత్రక తప్పిదం అని అంటున్నారు. అసలు దేశ విభజన జరగాల్సింది కానే కాదు అని ఆయన తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

ఆనాటి ఇస్లామిక్ పండితులు కూడా ఇరు దేశాల సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అని ఒవైసీ చరిత్ర సత్యాలను చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా రాసిన ఇండినా విన్స్ ఫ్రీడం పుస్తకంలో అనేక నిజాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇక దేశ విభజన తప్పిందం అనే కాకుండా ముస్లిం మేధావులు వ్యతిరేకించారు అన్న దాని మీద తాను ఎవరితోనైనా డిబేట్ చేయడానికి సిద్ధం అని ఒవైసీ అంటున్నారు. ఇక్కడ ఒవైసీ చెప్పిన దాంట్లో నిజం ఏంటి అంటే దేశ విభజన చారిత్రాత్మక తప్పిదం అన్నదే నిజం. ఈ దేశం నిండుగా ఒకటిగా ఉంటే ఆ ఖ్యాతి కీర్తి బలం బలగం వేరుగా ఉండేవి. దాయాది దేశాలు కొట్టుకుని దశాబ్దాల పాటు అలా వైరాన్ని పెంచుకోవడం వల్ల ఎంతో విలువైనవి వృధా అయిపోయాయి. అయితే ఒవైసీ వంటి వారు గతంలో ఇలాంటి మాటలు అన్నట్లుగా లేదని కూడా ప్రచారంలో ఉంది.

అయితే ఆయన ఎపుడు చెప్పారని కాదు చెప్పిన మాటలలో సత్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఇపుడు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక దేశంగా తన ఉనికిని నిలబెట్టుకుంటుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆ దేశాన్ని ఒకనాడు పాలించిన వారు కూడా భారత్ ని మెచ్చుకుంటున్నారు. కరడు కట్టిన ముస్లిం సమాజంలో మార్పు వస్తోంది అని అంటున్నారు. విభజన వల్ల నిజంగా చెప్పాలంటే పాకిస్థాన్ దారుణంగా నష్టపోయింది అనే చెప్పాలి. ఒక దేశం విడిపోవడానికి మతం ప్రాతిపదిక కారాదు, భావోద్వేగాలతో దేశాలు ప్రాంతాలు ఏర్పాటు కావు అన్న సత్యానికి నిలువెత్తు ఉదాహరణగా పాకిస్థాన్ ఈ రోజు నిలిచి ఉంది. ఒక దేశం అన్నది అందరితోనూ ఉంటుంది. కులాల వారీగా మతాల వారీగా రాజ్యాలు ఎపుడూ ఆవిర్భవించవు.

ఈ సత్యం తెలుసుకునేసరికి పాకిస్థాన్ పతనం అంచున నిలబడి ఉంది. అందుకే ఇపుడు చాలా మంది భారత్ గ్రేట్ అంటున్నారు. పాక్ ఆక్రమిత వాసులు భారత్ లో విలీనానికి రెడీ అంటున్నారు. బెలూచిస్థాన్ ప్రాంతీయులు కూడా భారత్ మాట మాట్లాడుతున్నారు. పాకిస్థాన్ లోని సగటు పౌరులు కూడా భారత్ వైపు చూస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే అసహజమైన ప్రక్రియగా దేశ విభజన జరిగి పాక్ అనే దేశం ఏర్పడింది. నాడు బ్రిటిష్ వారి ఎత్తులకు చిత్తు అయిన నేపధ్యంలో ఇలా జరిగింది అని చెప్పాలి. అలా కాకుండా ఉంటే భారత్ కి ఏనాడో ముస్లిమ్స్ నుంచి కూడా ప్రధానులు వచ్చి ఉండేవారు అన్న భావన చాలా మందిలో ఉంది. అలాగే మైనారిటీ మెజారిటీ అన్న లెక్కలు రాజకీయ కోణాలు లేకుండా దేశం ఉండేది అన్న వారూ ఉన్నారు.

ఒకసారి చరిత్ర చూసుకుంటే విభజన సమయంలో భారత సరిహద్దును దాటి కొన్ని లక్షల మంది పాకిస్తాన్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో దాదాపు లక్షమంది ప్రాణాలు పొగొట్టుకుని ఉంటారు. అంతేకాదు అప్పటి వరకు ప్రపంచంలోనే శాంతియుత దేశంగా ఉన్న భారతదేశంలో మళ్లీ మతఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలకు ఆజ్యం పోసిన బ్రిటీష్‌ రాజ్యం భారత్‌ లో జరుగుతున్న హింసను చూసి పాశవిక ఆనందం పొందింది. హిందువులు, ముస్లింలు ఎప్పుడూ లేనంతగా ఒకరిపైకొకరు దాడికి దిగారు. ఈ దాడుల్లో అమాయకమైన ప్రజలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

1946… అంటే దేశ విభజన జరగక ఒక్క సంవత్సరం ముందు… పరిస్థితి ఒకసారి గమనిస్తే భారతదేశంలో శాంతి సమాధానం, మత సామరస్యంతో అందరూ సోదరభావం కలిగి జీవించారు. ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ అత్యంత అన్యూన్యతతో కలిసి మెలిసి ఉన్నారు. అప్పట్లో అంటే దేశవిభజన కంటే ముందు దేశంలో 25కోట్ల50 లక్షల మంది హిందువులు ఉండగా… 9కోట్ల 20 లక్షల మంది ముస్లింలు ఈశాన్య వాయువ్య భారతదేశంలో ఉన్నారు. 60 లక్షల మంది పంజాబ్‌లో నివసిస్తూ ఉండేవారు. పంజాబ్‌ రాజ్యానికి ప్రాచీన లాహోర్‌ రాజధానిగా ఉండేది. అప్పట్లో లాహోర్‌ ఒక కాస్మోపాలిటిన్‌ నగరంగా విరాజిల్లింది. మంచి విశ్వవిద్యాలయాలకు,విద్యాబో ధనలకు లాహోర్‌ పేరుగాంచింది. అభివృద్ధి అంతా లాహోర్‌లోనే కనిపించడంతో చాలామంది చదువుకునేందుకు లాహోర్‌ వెళ్లేవారు. ఎంతో శాంతియుతంగా ఉన్న నగరం కొన్ని నెలల సమయంలోనే అశాంతికి నెలవుగా మారింది.

అప్పుడే ముస్లిం లీగ్‌కు పట్టు ఉన్న కలకత్తా నగరంలో ఓ భారీ సభను జిన్నా ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశనలుమూలల నుంచి ముస్లింలు హాజరయ్యారు. ఆగష్టు 16 1946న జరిగిన ఈ సమావేశంలోనే ప్రత్యేక పాకిస్తాన్‌ డిమాండ్ తెరపైకొచ్చింది. సభ ముగిసిన అనంతరం కొందరు అతివాదులైన ముస్లింలు కలకత్తా నగరంలో గ్రూపులుగా విడిపోయి అల్లాహో అక్బర్‌ నినాదాలతో హిందువులపై భౌతికంగా దాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. ఎటు చూసినా హింసే కనిపించింది. వీధుల్లో కనిపించిన ప్రతి హిందువుపై దాడి జరిగింది. వీధుల్లో ఏమి జరుగుతుందో చూద్దామని బయటికొచ్చిన వారి తలలను పగలగొట్టారు. చాలామంది రాడికల్‌ ముస్లింలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వీధుల వెంటా అలజడి సృష్టించారు. భయానక వాతావరణం అక్కడి ప్రజలు అనుభవించారు. హిందువులను బతకనిచ్చేది లేదు… అంటూ పెద్ద నినాదాలు చేసుకుంటూ కొందరు దుండగులు ఐరన్‌ రాడ్లతో వీధుల్లో తిరిగారు.

మూడురోజులపాటు జరిగిన ఈ మతఘర్షణల్లో 5వేల మంది అమాయక ప్రజలు అసువులు బాశారు. వీధులంతా మృతదేహాలే దర్శనమిచ్చాయి. అప్పటి వరకు బ్రిటీష్‌ పాలనపై భారతీయులకు ఎంతోకొంత నమ్మకం ఉండేది. కానీ ఇంత జరుగుతున్న ఒక్క మాట కూడా బ్రిటీష్‌ ప్రభుత్వం నోట నుంచి పెగలలేదు. కనీసం ఆ అల్లర్లను నియంత్రణలోకి తీసుకొద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ఎవరు ఎవరినైనా చంపేసుకోండి మాకెందుకులే అన్నట్లుగా బ్రిటీష్‌ వారు ఆ మూడు రోజులు వ్యవహరించారు. ఆ నాడు బ్రిటిష్ పాలకుల తీరే ఈ రెండు దేశాల విభజనకు కారణం అయ్యింది.

మొత్తానికి దేశ విభజన తప్పు అని తేలుతోంది. దీనికి పరిష్కారం ఏమిటి అన్నది కూడా మేధావుల నుంచే రావాల్సి ఉంది. ఆరెస్సెస్ అయితే ఏదో నాటికి పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ సహా చాలా దేశాలు భారత్ లో కలుస్తాయని నమ్మకంగా చెబుతూ వస్తోంది. అలా కనుక జరిగితే భూ భాగంలో చైనాతో సరిసమానంగా భారత్ ఉంటూ పటిష్టంగా బలమైన శక్తిగా ప్రపంచంలో ఉండే వీలుంది. మరి పాక్ భారత్ లో కలుస్తుందా. ఏమో ఎవరు చెప్పగలరు. ఏదైనా సాధ్యమే. కాకపోతే కాలం కలసి రావాలి. అపుడు అది ఇచ్చే తీర్పు కొత్తగా ఉన్నా స్వీకరించక తప్పదు మరి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

15 + eleven =