More

    పిడిగుద్దులతో పసిడిని ముద్దాడిన నిఖత్

    పిడుగులాంటి పిడిగుద్దులు.. ఆది నుంచి ఎక్కడా ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వలేదు. మూడు రౌండ్లలోనూ తనదే ఆధిక్యం. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకొని నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. అందులోనూ తెలంగాణ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించడంతో తెలుగురాష్ట్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

    టర్కీలోని ఇస్తాంబుల్‌లో గురువారం జరిగిన ఫ్లై-వెయిట్ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌పై విజయం సాధించిన భారత బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52కేజీల విభాగంలో ఇండియాకు స్వర్ణ పతకాన్ని అందించింది. తద్వారా మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్, లేఖా కేసీ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్ నిలిచింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ 25ఏళ్ల జరీన్ మాజీ జూనియర్ యూత్ వరల్డ్ ఛాంపియన్ కూడా. ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తన థాయ్ ప్రత్యర్థిపై జరీన్ అద్భుతంగా పోరాడి స్వర్ణ పతకాన్ని అందుకుంది. న్యాయనిర్ణేతలు బౌట్‌ను 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో స్కోరింగ్ ఇవ్వడంతో భారత శిబిరంలో సంబరాలు మిన్నంటయి. ఇక ఫైనల్లో థాయ్ బాక్సర్ కంటే చాలా ఎక్కువ పంచ్‌లతో నిఖత్ మొదటి రౌండ్‌ నుంచే న్యాయనిర్ణేతలను ఆకట్టుకోగలిగింది.

    ఇకపోతే 2018లో బాక్సింగ్ గ్రేట్ మేరీకోమ్ గెలిచిన తర్వాత భారత్‌కు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టోర్నీలో ఇదే తొలి బంగారు పతకం. ఇక ఈ టోర్నీలో 57కేజీల విభాగంలో మనీషా, 63కేజీల విభాగంలో పర్వీన్ కాంస్య పతకాలు సాధించడంతో ఈ ఈవెంట్‌లో భారత బృందం మొత్తం మూడు పతకాలను సాధించింది. 73 దేశాల నుండి రికార్డు స్థాయిలో 310బాక్సర్లు ఈ టోర్నీలో తలపడ్డారు. ఈ ఏడాది టోర్నమెంట్‌లో పాల్గొన్న 12మంది భారతీయ బాక్సర్లలో ఎనిమిది మంది క్వార్టర్ ఫైనల్‌ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇస్తాంబుల్‌లో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌‌లో మూడు పతకాలతో కలిపి ఈ ఈవెంట్ 12ఎడిషన్లలో కలిపి భారత్ 10 స్వర్ణాలు, 8రజతాలు, 21కాంస్య పతకాలను సాధించింది. తద్వారా భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 39కి పెరిగింది. ఈ ఛాంపియన్ షిప్‌లో రష్యా, చైనా తర్వాత అత్యధిక పతకాలు గెలిచిన దేశంగా భారత్ నిలిచింది.

    Trending Stories

    Related Stories