‘‘What does a heavily armed, volatile neighbourhood mean for India? 5 army veterans take stock’’ శీర్షికన ‘మనీ కంట్రోల్’ పత్రికలో సెప్టెంబర్ 11న రాసిన వ్యాసంలో రంజిత్ భూషణ్ భారత్ ముందున్న ప్రమాదఘంటికల గురించి చర్చించే ప్రయత్నం చేశారు. సైనిక నిపుణుల అంచనాలను బేరీజు వేశారు. భారత్ చుట్టూతా ఉన్న దేశాల్లో పొంచి ఉన్న ముప్పును విశదీకరించారు.
రంజిత్ భూషణ్ ఆర్టికల్ చదివిన తర్వాత భారత్ సరిహద్దుల్లో ఉన్న ఆరు దేశాల్లో పరిస్థితిని అంచనా వేస్తే భవిష్యత్తు గగుర్పాటుకు గురిచేయడం ఖాయం. ప్రధానంగా చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో క్రమంగా విస్తరిస్తున్న విషపుటేర్లను తవ్వితీస్తే భారత్ రాబోయే రోజుల్లో ‘ఇజ్రాయిల్’ తరహా ఎన్ సర్కిల్ మెంట్-చుట్టివేతకు గురవుతుందా అనే ప్రశ్న వస్తుంది.
ఈ అంచనా ఊహాజనితం కాదు. వండివార్చిన వార్తాకథనమూ కాదు. ఏడాదిన్నర కాలం నుంచీ ఇటీవలీ వరకూ జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, స్ట్రాటజీ మేగజైన్లలో వచ్చిన వార్తలు, నిపుణుల వ్యాసాలు ఇదే అంశాన్ని రుజువు చేస్తున్నాయి. వీటి ఆధారంగా ఒక ‘భవిష్యదృశ్యాన్ని’ అందించే ప్రయత్నం చేస్తాను.
భారత్ ‘ఇజ్రాయిల్’ తరహా యుద్ధ బీభత్సాన్ని ఎదుర్కోనుందా? నిజంగానే ఎదుర్కొంటే ఇజ్రాయిల్ పటిమను ప్రదర్శించగల స్వతంత్రదేశంగా నిలుస్తుందా? భారత్ చుట్టూతా ఉన్న 6 సరిహద్దు దేశాల్లో ఏం జరుగుతోంది? ఆయుధ సంపత్తి ఉత్పాదనకు ప్రధాన కేంద్రమైన అమెరికా, తాజా పరిస్థితుల నేపథ్యంలో అమ్మకాల కోసం ఏ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది?
ఈ నాలుగు ప్రశ్నలకు పరిమితమై…భారత్ మరో ఇజ్రాయిల్ కానుందా? అనే విశ్లేషణను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ప్రతికూల దృష్టితో కాదు, ఆశావహ దృక్కోణంలోనే చెపుతాను. యుద్ధవిద్యలు నేర్చుకుని ఇజ్రాయిల్ లా రణరంగ కౌశలాన్ని ప్రదర్శించాలన్న ఆకాంక్షతోనే వివరాల్లోకి వెళతాను….
గడచిన ఏడాదిన్నర కాలంలో భౌగోళిక రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు కేవలం ఆ దేశానికి మాత్రమే పరిమితం కావు. వ్యూహాత్మక స్థానంలో దేశంలో చెలరేగిన కల్లోలం చుట్టూతా ఉన్న దేశాలను తాకడం సహజం. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల తర్వాత భారత్ చుట్టూతా ఉన్న దేశాల్లో మరింత అస్థిరత పెరిగే అవకాశాలను కాదనలేం!
భారత్ పొరుగు దేశం, వెయ్యి 643 కి.మీ సరిహద్దు ఉన్న మయన్మార్ ఇప్పటికే నిప్పుల కుంపటిలా రగులుతోంది. భారత్ 4వేల 96.7 కి.మీ సుదీర్థ సరిహద్దు పంచుకుంటున్న దేశం బంగ్లాదేశ్ లో ఈ ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ‘మోదీ వ్యతిరేక’ ఆందోళనలు పెల్లుబికాయి.
సారాంశంలో వీటిని భారత్ వ్యతిరేక ఆందోళనలుగా అర్థం చేసుకోవాలంటారు నిపుణులు. బంగ్లాదేశ్ తర్వాత భారత్ విస్తారమైన సరిహద్దు పంచుకుంటున్న దేశం చైనా అధీనంలోని టిబెట్. 3వేల 488 కి.మీ సరిహద్దు ఉంది ఇండో-చైనాల మధ్య. సమీప గతంలో చైనా సరిహద్దు అతిక్రమణ ఘర్షణ చూడనే చూశాం.
పాక్-భారత్ ల మధ్య 3వేల 323 కి.మీ సరిహద్దు ఉంది. పాకిస్థాన్ భారత్ ల మధ్య ఉద్రిక్తతల గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ఇక నేపాల్ తో 1, 751 కి.మీ, భుటాన్ తో 699 కి.మీ సరిహద్దు పంచుకుంటోంది మన దేశం. నేపాల్ ఐఎస్ఐ, తాలిబన్ సంస్థలకు ఒకానొక కీలక కేంద్రం. 1999, డిసెంబర్ 24 హైజాక్ కు గురైనా ఇండియన్ ఎయిర్ లైన్స్ IC 814 విమానాన్ని ఖాట్నండు నుంచే దారిమళ్లించింది. ఆ తర్వాత కాందహార్ విమానాశ్రయానికి చేరుకుంది.
పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఖాట్నండులోనే ఉంది. నేపాల్ మీదుగా నకిలీ కరెన్సీని పాక్ మన దేశానికి చేరవేస్తోందనేది బహిరంగ రహస్యం. భుటాన్ అసోం తీవ్రవాదులకు అడ్డాగా ఉంటూ వస్తోంది. దీన్ని గుర్తించిన R&W OPERATION ALL CLEAR ని 2003లో వాజ్ పాయ్ హయాంలో నిర్వహించింది. ఇది చైనా గూఢచారులకు అడ్డాగా మారిందనే వార్తలూ ఉన్నాయి.
ఇదీ… స్థూలంగా మన పొరుగుదేశాలకు సంబంధించిన ప్రాథమిక అంశాల తాలూకు సారాంశం.
విషయంలోకి వెళ్లేముందు…విలువైన పుస్తకాన్నీ, అందులోని నాలుగు మాటలను మీకు పరిచయం చేస్తాను. DANNY DANON రాసిన ‘‘ISRAEL: THE WILL TO PREVAIL’’ పుస్తకం ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో చాలా ముఖ్యమైంది. డానీ డెనన్ ఐక్యరాజ్య సమితిలో 17వ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరించారు. ప్రస్తుతం Likud-national liberal movement కి చైర్మన్ గా ఉన్నారు. Likud party ఇజ్రాయిల్ లోని ప్రధాన రైటిస్ట్ పార్టీ.
‘‘The endless cycle of begrudging agreements and broken promises has exhausted Israelis, and the day when all arguing and fighting ends seems further and further away’’-అంతులేని ఒప్పందాలు, వాటి ఉల్లంఘనలతో ఇజ్రాయిలీలు అలసిపోయారు. చివరి గమ్యం గురించి పరస్పరం అనేక తర్కవితర్కాలు జరిగాయి. అది అలా కొనసాగుతూ పోయింది. అంటారు. అమెరికా సహా యూరప్ దేశాలను నమ్ముకున్న ఇజ్రాయిల్ అగ్రరాజ్యాల ‘భౌగోళిక రాజకీయ ఉపగ్రహం’గా మారి.. భంగపడ్డతీరును వివరించారు.
అక్కడితో ఆగలేదు…‘‘ However, a new geration coming to power in Israel sees that the present moment is crucial time for Israel to assert its sovereignty to the external forces who have mistreated the country. If there is ever to be peace in the middle east, Israel must emerge as a powerful, independent nation not only in the region but globally’’ ముగించారు డానీ డెనన్ తన పుస్తకంలోని రెండో భాగం….‘‘ The danger and opportunity: The current landscape’’లో.
అధికార పగ్గాలు చేపట్టిన కొత్త శక్తులు, కీలక సమయాన్ని గుర్తించాయి. పొరుగుదేశాల నుంచి సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంతో పాటు మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే అరబ్బుతీరంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ శక్తివంతమైన, స్వతంత్ర దేశంగా ఎదగాలని గుర్తించిన’ తీరును వివరిస్తారు. డానీ డెనన్ మాటలు భారత్ కు ప్రస్తుతం శిరోధార్యం కాగలవు. భారత్ ముందు ప్రమాదం మాత్రమే కాదు, సాహసం చేస్తే అవకాశం కూడా దరిచేరే సందర్భం లేకపోలేదు.
రంజిత్ భూషన్ అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం….
‘వార్ ఆన్ టెర్రర్’ పేరుతో 2001లో ఆఫ్ఘనిస్థాన్ లో అడుగుపెట్టిన అమెరికా సుమారు 83 బిలియన్ డాలర్లను కేవలం ఆయుధ సామాగ్రికోసమే వెచ్చించింది. రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ వదిలివెళ్లగిన అగ్రరాజ్యం ఆయుధ సామాగ్రిని తాలిబన్లకే అప్పగించింది. ఇదే అదనుగా భావించిన తాలిబన్, ఐఎస్ఐ, చైనాలు reverse engineering ని అనుసరించే అవకాశాలూ ఉన్నాయి. ఇందులో ఓ పరిమితి కూడా ఉంది.
లైట్ ఎటాక్ ఎయిక్రాఫ్ట్, బ్లాక్ హాక్ హెలీకాప్టర్స్, గన్ షిప్స్, ట్రాన్స్ పోర్ట్ విమానాలు, స్కాన్ ఈగిల్ డ్రోన్లు, ఎయిర్ టు గ్రౌండ్ స్మార్ట్ మ్యూనిషన్లను వదిలివెళ్లాయి అమెరికా బలగాలు. వీటితో వేల సంఖ్యలో ట్రక్కులు, ఆర్మోర్డ్ వెహికిళ్లను బాగ్రమ్ ఎయిర్ బేస్ లోనే వదిలేశాయి. లక్షల సంఖ్యలో తూటాలూ ఉన్నాయి.
అయితే వీటిలో చాలా మటుకు ఆఫ్ఘన్ స్వాధీనం, పంజ్ షేర్ దాడిలో ఖర్చయిపోయినా…రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ కు అవసరమయ్యే ఆయుధాలను చైనా అందిస్తే వచ్చే ప్రమాదమే అధికం. తాలిబన్ సేనలు ఆహారం లేకుండా మనగలవు కానీ, ఆయుధాలు లేకుండా ఊపిరిపీల్చలేవు.
మరోవైపు పాకిస్థాన్ సెప్టెంబర్ 22న తాలిబన్ భద్రతా బలగాలకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా వదిలివెళ్లిన ఆయుధాలు చాలావరకూ ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు తక్కువ. వియత్నాం యుద్ధం తర్వాత అమెరికా వదిలేసిన ఆయుధ సామాగ్రిని సముద్రంలో విసేరిసింది వియత్నాం.
ఆఫ్ఘన్ పరిణామాలు భారత్ కు asymmetric warfare-విషమప్రమాణ యుద్ధాన్ని తేవడంతో పాటు జమ్మూ-కశ్మీర్ లో ప్రచ్ఛన్న యుద్ధం తలెత్తవచ్చంటారు నిపుణులు. ఈశాన్యంలో రెడ్ కారిడార్ ఏరియాల్లో, దేశంలో అంతర్గతంగా ఉన్న జైషే మహమ్మద్, లష్కర్ ఏ తొయిబాలు దాడులకు తెగబడే ప్రమాదం కూడా పొంచి ఉంది. పాకిస్థాన్, తాలిబన్ ఉమ్మడిగా చైనా సాయంతో కశ్మీర్ లోయలోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయంటారు.
నేపాల్, బంగ్లాదేశ్ లలో ఉన్న ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఇప్పటికే యాక్టివ్ గా మారాయనే వాదనలూ ఉన్నాయి. వీటన్నింటనీ అధిగమించాలంటే కేవలం బలగాలే కాదు, జాతియావత్తూ ఐక్యం కావాలనీ, ప్రసార మాధ్యమాలు దన్నుగా ఉండాలంటారు నిపుణులు.
Indo-Gangetic plains లో ప్రమాదం ఉందంటారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డా.ప్రకాశ్ మినన్. shoulder-held మిసైళ్లు కశ్మీర్ లోయలోకి వస్తే ప్రమాదం ఉందంటారు రిటైర్డ్ లెఫ్టినెంట్ కరన్ సింగ్ యాదవ్.
భారత్ సరిహద్దు పంచుకుంటున్న మిగతా పొరుగుదేశాల్లో పరిస్థితి ఏంటో…వివిధ పత్రికా కథనాల ఆధారంగా వివరిస్తాను. ఈ ఏడాది మార్చి 27న ‘ది హిందు’ దిన పత్రికలో ‘4 dead as anti-modi protest turn violent in Bangladesh” అనే వార్తను ప్రచురించింది. మోదీ పర్యటన సందర్భంగా జరిగిన ఆందోళనలివి. వీటి వెనుక బంగ్లాదేశ్ లోని ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం గుర్తించింది. 2021, సెప్టెంబర్ 11న సండే గార్డియన్ పత్రిక ‘‘Agencies tracking turkey based groups anti-india activities in Nepal’’ శీర్షికన ఓ కథనం ప్రచురించింది.
టర్కీకి చెందిన Human Rights and Freedoms and Humanitarian Relief –IHH సంస్థ భారత్ సరిహద్దుల్లోని గ్రామాల్లో నివసించే ముస్లీంలకు సాయం చేసేందుకు స్థాపించింది. అయితే భారత నిఘా సంస్థలు ఈ సంస్థపై నిఘా ఉంచారు. టర్కీ-ఐఎస్ఐ మధ్య ఉన్న సంబంధాల రీత్యా ఈ సంస్థ కార్యకలాపాలను మనదేశం నిశితంగా పరిశీలిస్తోంది.
IHH – Islami Sangh Nepal –ISN మధ్య సంబంధాలున్నాయి. ఇస్లామీ సంఘ్ నేపాల్ ఇప్పటికే భారత్ స్కానర్ లో ఉంది. 2018లో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు జునాయిద్, అబ్దుల్ సుబాన్ ఖురేషీ, తౌఖీర్ లకు Islami Sangh Nepal కార్యకర్త ఆశ్రయం ఇచ్చినట్టూ భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను నేపాల్ నుంచి ఇతర దేశాలకు పంపడంలో ఇస్లామీ సంఘ్ నేపాల్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఖాట్మండులోని ‘త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్’ లో ఆధునాతన డిటెక్షన్ టెక్నాలజీ కూడా మొన్నటిదాకా అందుబాటులో లేదు. దీంతో ఉగ్రవాదులు సులభంగా దేశాలు దాటివెళ్లిపోయారని సెప్టెంబర్ 2న ‘ది పయనీర్’ పత్రిక ‘Taliban and the threat to Nepal’ పేరిట ఓ కథనంలో పేర్కొంది. 2019లో పాకిస్థాన్ పౌరుడు 76.80 మిలియన్ల నకిలీ భారత కరెన్సీతో దోరికిపోయిన ఉదంతాన్ని ఉదహరించింది. సండే గార్డియన్ పత్రిక 2020, జూన్ 27 ‘‘ISI-backed groups in Nepal intensify anti-India activities’’ అంటూ ఓ వార్తను ప్రచురించింది.
నాలుగు మార్గాల్లో భారత్ లోకి ఐఎస్ఐ నకిలీ కరెన్సీని పంపిస్తోందని ఈ కథనం పేర్కొంది. Karachi-Doha-Kathmandu, Pakistan-Oman-Kathmandu, Bangkok-Kathmandu and Singapore-Kathmandu మార్గాల ద్వారా కౌంటర్ ఫీట్ కరెన్సీని మనదేశంలోకి పంపుతోంది పాకిస్థాన్.
‘‘ISI using Nepal-based modules to send money to Kashmir’’ శీర్షకతో సండే గార్డియన్ పత్రిక ఈ ఏడాది మార్చి 13న ఓ వార్తను ప్రచురించింది. నేపాల్-యూపీ, నేపాల్-బీహార్ సరిహద్దుల గుండా నకిలీ కరెన్సీ తరలిస్తున్నట్టు ఈ వార్త చెపుతోంది. అసోంలో తుడిచిపెట్టుపోయిందనుకున్న బోడో ఉద్యమంలో విదేశీ శక్తుల సహకారంతో మరో కొత్త సంస్థ పుట్టుకువచ్చింది. United Liberation of Bodoland –ULB స్థాపించిన విషయాన్ని భారత్ గుర్తించింది.
మొత్తంగా చుట్టూతా ముప్పు పొంచి ఉన్న తరుణంలో ‘ఇజ్రాయిల్ యుద్ధనీతి’ మాత్రమే మార్గం అంటారు నిపుణులు. చిన్నదేశం, తక్కువ జనాభా, పరిమాణంలోనూ చిన్న సైన్యం ఉన్న దేశం చమురు నిల్వలపై ఆధారపడిన సంపన్న దేశాల దాడులను తట్టుకుని నిలబడింది. పాలిస్తీనా ఉగ్రమూకలు విసిరే Molotov Cocktails గా పిలిచే పెట్రోల్ బాంబులకు అదిరిపడిన ఇజ్రాయిల్ ఆ తర్వాత అన్నిటినీ సవాలు చేసి యుద్ధకళను ఒడిసిపట్టింది.
1947 నవంబర్ -1949 జూలై మధ్య జరిగిన అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం మొదలు ఈ ఏడాది మే మాసంలో భీతిగొలిపే సాయుధ ఘర్షణల వరకూ సుమారు 68 ఏళ్లపాటు యుద్ధాన్ని తన ఉచ్వాసనిశ్వాసలుగా మార్చుకుంది. రెండు ఇంతిఫదాలను తిప్పికొట్టింది. 1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఇరాక్ లు ఏక కాలంలో దాడికి దిగితే…కేవలం 6 రోజుల్లో మట్టుబెట్టి తిప్పి పంపింది. 1973లో ఈజిప్ట్, సిరియా, ఇరాక్, జోర్డాన్, అల్జీరియా, మొరాకో, సౌదీ అరేబియా, క్యూబా, నార్త్ కొరియా దేశాల సైన్యాలతో తలపడి ఈజిప్ట్ మెడలువంచి శాంతి ఒప్పందం చేసుకుంది. జనాభాలో రెండో పెద్ద దేశమైన భారత్, సైనిక శక్తిలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. పటిష్ఠమైన వ్యూహం, అందుకు తగిన ఎత్తుగడలు ఉంటే విజయమే వరిస్తుంది. చీటికీ మాటికీ వినిపించే బెదిరింపుల బెడద తప్పుతుంది.