More

  జీ-20 లోగోలో ‘వసుదైవ కుటుంబం’..! దటీజ్ మోదీ..!!

  నా వారు, పరాయి వారు అనే బేధం లేకుండా..అందరూ మనవారే అనుకునే ఉదార ప్రవర్తన కలవారికి ఈ ప్రపంచమే ఒక కుటుంబంలా కనిపిస్తుంది. ఇదే.. ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకమ్ అనే సూక్తి. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ భావనకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పెద్ద పీట వేశారు. వచ్చే ఏడాది భారత్ లో జరగబోయే జీ-20 సదస్సు కోసం.. వసుదైక కుటుంబం భావనను ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నారు.

  జీ-20 ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గ్రూపు. ఇది ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు సమానం. ప్రపంచ జీడీపీలో 85 శాతం.. అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం.. పరిశోధనల ఖర్చులో 85 శాతం.. ఇదీ జీ-20 దేశాల వాటా. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు ఈ జీ-20 వేదికపైనే కనిపిస్తాయి. ఇక్కడ తీసుకొనే నిర్ణయాలకు అంతర్జాతీయంగా చట్టబద్ధత లేకపోయినా.. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.

  75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నవేళ.. భారత్ G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ప్రస్తుతం ఇండోనేషియా చేతిలో వున్న G 20 గ్రూపింగ్ అధ్యక్ష పదవిని 2022 డిసెంబర్ 1 నుంచి భారత్ స్వీకరించనుంది. 2023 సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల స్థాయిలో G 20 లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ నేపథ్యంలో 2023 G 20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో-కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం లోగో ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. లోగోలో కమలం, ‘వసుధైవ కుటుంబం – ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే సందేశం ఉంది. ఈ లోగోను తనదైన శైలిలో వివరించారు మోదీ. కమలం ఆశకు ప్రతీక అని,.. కమలంలోని ఏడు రేకులు భూగోళంలోని ఏడు ఖండాలకు ప్రతీకలని తెలిపారు. ఇక, ఏడు సంగీత స్వరాలను సూచిస్తాయని అన్నారు. సామరస్య పూర్వక వాతావరణానికి G 20 ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు మోదీ.

  శతాబ్దానికి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా విపత్తులు, మహమ్మారులు తలెత్తి భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో, విశ్వమానవాళిలో నిరాశ, నిస్పృహ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. G20 లోగో లోని కమలం ఆశకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కమలం వికసిస్తూనే వుంటుంది అని ప్రధాని తెలిపారు. వసుదైవ కుటుంబ ప్రపంచంలో.. భారతదేశం కరుణకు సంతకమని, కమలం సాంస్కృతిక వారసత్వ విశ్వాసాన్ని చిత్రీకరిస్తుందని అన్నారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో భారతదేశం ముందువరసలో వుంటుందని అన్నారు. పున‌రుత్పాద‌క శ‌క్తిని పొదుపు చేయ‌డంలో భార‌త‌దేశం ఒక సూర్యుడు, ఒకే ప్ర‌పంచం, ఒకే గ్రిడ్ వంటి కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌పంచాన్ని ముందుండి నడిపిస్తోంద‌ని అన్నారు. “G20లో ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అనే మా మంత్రం ప్రపంచ సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుంది” అని ఆయన తెలిపారు. భారతదేశం జి20 అధ్యక్ష పదవిని చేపట్టనుండడం 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని ప్రధాని అన్నారు.

  స్వాతంత్య్రానంతరం భారతదేశం అభివృద్ధి పథంలో పయనించడం ప్రారంభించిందని, గత 75 ఏళ్లలో అన్ని ప్రభుత్వాల కృషి ఇందులో ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ప్రభుత్వం, పౌరులు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారని ఆయన అన్నారు. COVID-19 మహమ్మారి అంతరాయం కలిగించే అనంతర ప్రభావాలను పేర్కొంటూ, G20 లోగో చిహ్నం ఆశకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.

  గతేడాది సెప్టెంబర్‌లో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ G 20 భారతదేశ ప్రతినిధిగా నియమితులయ్యారు. 2022 డిసెంబరు 1 నుంచి భారతదేశం G 20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తుందని, 2023లో మొదటిసారిగా G20 నేతల శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

  1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి G 20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి G 20 ప్రధాన కార్యాలయం, ప్రాధాన్యప్రదేశం అనేవి ఏవీ లేవు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకొంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం G 20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు.

  జీ 20 దేశాలు ముఖ్యంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన అజెండాను చర్చిస్తాయి. వీటికి ప్రపంచ స్థాయి ప్రాధాన్యం ఉండాలి. సమకాలీన అంశాలను సైతం వీటిల్లో చేర్చడం జరగుతూ వుంటుంది. ప్రధానంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆర్థిక మార్కెట్లు, టేక్స్ విధానలు, ఆర్థిక విధానాలు వుంటాయి. అవినీతిపై పోరాటం వంటి అంశాలపై సైతం చర్చలు ఉంటాయి. కొన్ని అనుబంధ అంశాలపైనా చర్చలు సాగిస్తూంటారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటివి చర్చల్లో భాగం అవుతాయి. బెర్లిన్‌ సమావేశానికి ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు హాజరయ్యారు. అయితే 2008లో ఆర్థికమాంద్యం రావడంతో జీ-20 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు హాజరవుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలకు చేటు వాటిల్లడం, నిరుద్యోగం పెరగడం, ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అవ్వడం తదితర క్లిష్ట సమయాలు ఏర్పడినప్పుడు ఆయా దేశాల అధినేతలే ప్రత్యామ్నాయ మార్గాలపై నిర్ణయం తీసుకువాల్సి వుంటుంది. ఈ కారణంగా దేశాధినేతలు సదస్సులో పాల్గొంటున్నారు.

  Trending Stories

  Related Stories