More

  రాజ్‎దీప్‎ను రఫ్ఫాడించిన ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్..! సోకాల్డ్ మేధావుల్లారా.. ఇకనైనా సిగ్గుపడండి..!!

  ‘భారత్‎లోని సోకాల్డ్ మేధావులందరూ దేశ వ్యతిరేకులే’ అని సోకాల్డ్ మేధావి రాజ్‎దీప్ సర్దేశాయ్ ముందే చెప్పేశారు డా. సాల్వేటర్ బేబోన్స్. ప్రముఖ ఆస్ట్రేలియన్ సామాజిక వేత్త అయిన ఇతడు.. తాజాగా ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోకాల్డ్ మేధావుల ద్వంద నీతిని ఎండగట్టారు. భారత్‎లో మేధావులమని చెప్పుకు తిరిగే సోకాల్డ్ మేధావులంతా దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తారని కుండబద్ధలు కొట్టారు. ఇది కేవలం ఏ ఒక్క వ్యక్తో లేక కొంతమంది వ్యక్తులో చేసే పని కాదని,.. పూర్తిగా ఓ వ్యవస్థే దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని తెలిపారు. అయితే ఈ మాటలు రుచించని రాజ్‎దీప్ సర్దేశాయ్ దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. భారత్‎లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావులు పోరాడుతున్నారని తెలిపారు. దేశద్రోహ చట్టం పేరుతో ఎంతో మందిని జైళ్ళలో వేసినా,.. ఆర్టికల్ 370 రద్దు పేరుతో కశ్మీరీలను జైళ్ళలో వేసినా,.. వారు ఏ మాత్రం భయపడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని కూడా సాల్వేటర్ బేబోన్స్ అంతే దీటుగా తిప్పికొట్టారు. భారత్‎లోని మేధావుల పోరాటం కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఇప్పుడు అడిగే ఈ ప్రశ్నలన్నీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అడిగేవారా..? అంటూ ముఖం మీదే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయమని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినా.. ఈ సోకాల్డ్ మేధావులు ఎమీ అనకుండా చూస్తూ ఉండిపోయారని దుయ్యబట్టారు. అంతేకాదు, తమకు తాముగా మేధావులమని చెప్పుకునే వ్యక్తులందరూ భారత్‎ను ప్రపంచం ముందు అవమాన పరుస్తున్నారని అన్నారు. మేధావుల ముసుగులో భారత్ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రపంచం ముందు భారత్‎ను ఫాసిస్టు దేశంగా చిత్రీకరించే దుర్మార్గానికి పాల్పడ్డారని విమర్శించారు. దీంతో రాజ్‎దీప్ సర్దేశాయ్ తెల్ల ముఖం వేశారు. తిరిగి మరో ప్రశ్న అడిగే ప్రయత్నం చేయలేనంతగా సాల్వేటర్ బేబోన్స్.. రాజ్‎దీప్‎ను కడిగిపాడేశారు.

  భారత్‎లోని సోకాల్డ్ మేధావి వర్గానిది ఒక ప్రత్యేక పరిస్థితి. దీన్ని అర్థం చేసుకోవాలంటే వీరి మూలాల గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‎ను అరవయ్యేళ్ళుగా పాలించిన కాంగ్రెస్, వెనకుండి నడిపించిన కమ్యూనిస్టుల ప్రోద్భలంతో.. ఈ సోకాల్డ్ మేధావులు పుట్టుకొచ్చారు. గతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలతో తమకు భజన చేసేవిధంగా వీరిని తయారు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా పార్టీ పుట్టుకొస్తే.. వారిని అటు, ప్రభుత్వ పరంగా.. ఇటు మేధావుల ముసుగులో కూడా ప్రశ్నించడం,.. అడుగడుగునా అడ్డుపడటం,.. కాంగ్రేసేతర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడం వీరు చేసే పని. ఏ పథకం తీసుకొచ్చినా, ఏ నిర్ణయంత తీసుకున్నా వాటిని వ్యతిరేకించడం వంటివి చేసి ఆయా ప్రభుత్వాలు చేసే అభివృద్దిని అడ్డుకునేవి. ఈ సోకాల్డ్ మేధావులు కేవలం ఒక గ్రూపుగానే ఎక్కడో ఉండి పోరాడుతారని అనుకుంటే పొరపాటే. ప్రతిఒక్క ప్రభుత్వ ఆఫీసులోనూ, విద్యాలయాల్లోనూ, ఐఏఎస్ అధికారుల్లోనూ, స్వచ్చంద సంస్థలుగానూ, జర్నలిస్టులు, మానవహక్కుల సంఘాలుగానూ ఇలా ఒక్కటేమిటి.. దాదాపు అన్ని రంగాల్లోనూ వీరు పాతుకుపోయారు. వీరికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన తరపున అన్నివిధాలుగా సహాయపడేది. ఆయా సంఘాలకు, సంస్థలకు పథకాల రూపంలోనైనా, నిధుల రూపంలోనైనా సహాయం అందిచేది. దీంతో పూర్తి తొత్తులుగా మారిన సోకాల్డ్ మేధావులు హస్తం పార్టీని పల్లెత్తు మాటకూడా అనేవారు కాదు. కానీ, కాంగ్రెస్ హయాంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలను మాత్రం ముప్పుతిప్పలు పెట్టేవారు. ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని, మానవ హక్కులు హరించివేస్తున్నారని ఫేక్ సర్వేలతో ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేలా ఈ మేధావులు ప్రయత్నించేవారు.

  ఇందుకు అనేక ఉదాహరణులన్నాయి. నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఎదుగుతుండటంతో.. ఆ పార్టీ ఎదగకుండా ఎన్నో కుట్రలు పన్నింది. అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని రాజకీయంగా సమాధి చేయాలని కాంగ్రెస్ భావించింది. ఇందులో భాగంగా తీస్తా సెతల్వాద్ అనే సోకాల్డ్ సామాజిక కార్యకర్త.. కాంగ్రెస్ సహాయంతో ఈ కుట్రను ముందుండి నడిపింది. అప్పటి ఐఏఎస్ అధికారులను ఉపయోగించుకుని కోర్టుల్లో తరచూ ఫేక్ కేసులు వేసింది. దీనికి బదులుగా హస్తం పార్టీ నుంచి భారీగా ముడుపులు అందాయి. దీంతో ఒక సాధారణ సామాజిక కార్యకర్త అని చెప్పుకునే తీస్తా సెతల్వాద్.. ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు రోడ్డులో అమితాబ్ బచ్చన్ కంటే పెద్ద విల్లాను సంపాదించింది. అయితే కొంతమంది నిజాయితీ కలిగిన అధికారులు, కోర్టుల వల్ల మోదీ, అమిత్ షా బయటపడ్డారు. దీంతో పాటు గుజరాత్ లోని తీవ్రమైన కరువు ప్రాంతంగా పిలువబడే ‘కచ్’ కు నీరందించేలా రూపొందించిన నర్మదా నదిపై నిర్మించే సర్దార్ సరోవర్ ప్రాజెక్టును కూడా సోకాల్డ్ మేధావులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి మేధా పాట్కర్ ముందుండి నడిపింది. ఈ ప్రాజెక్టు నాటి కాంగ్రెస్ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1961లోనే శంకుస్థాపన చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ ప్రాజెక్టు గుజరాత్ ప్రజలకు ఉపయోగపడుతుందన్న కారణంతో నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకోగానే మరో ఉద్యమం మొదలైంది. నర్మదా బచావో అంటూ చేపట్టిన ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనివల్ల కలిగే లాభాలను ప్రభుత్వం ఎంత వివరించినా కూడా లాభం లేకపోయింది. మేధాపాట్కర్ పూర్తి అబద్దాలతో స్వతంత్ర సంస్థలకు డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించడం వంటివి చేయడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేకపోయింది. దీంతో అప్పటి ప్రభుత్వానికే కాకుండా ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ నుంచి బాగుపడే రైతులు కూడా దశాబ్దాలుగా నష్టపోయారు.

  ఇక మోదీ ప్రధానమంత్రి అయ్యాక వీరు చేసే పనులు మరింత ఎక్కువయ్యాయి. ఒకప్పుడు భారత్ లో అసహనం పెరిగిపోయిందనే ప్రచారాన్ని కల్పించారు. ఇది అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దిగరజార్చే ప్రయత్నం చేశారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ మేధావులు మాత్రం తమకు అనుకూలమైన వాటిని ఎంచుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పడానికి ఉపయోగిస్తుంటారు. దీనికి తోడు అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రతిష్టను దిగరజార్చేలా ప్రసంగాలు చేస్తుంటారు. భారత్ లో అసహనం పెరిగిపోతుందంటూ, భారత్ రేపిస్టులకు అడ్డాగా మారిందంటూ, భారత్ లో మతోన్మాదం పెరిగిపోతుందంటూ అంతర్జాతీయ సంస్థల్లో విష ప్రచారం చేస్తుంటారు. అయితే ఇటువంటి ప్రచారం వల్ల విదేశాల్లో భారత్ పై చిన్న చూపు కలిగినా వీరికి ఇవేమీ పట్టవు. కేవలం ఒక పార్టీకోసం దేశ వ్యతిరేక కార్యకలాపాలకైనా పాల్పడతారు.

  ఆస్ట్రేలియన్ సామాజికవేత్త సాల్వేటర్ బేబోన్స్.. తాజా ఇండియా టుడే కాంక్లేవ్‎లో చెప్పింది ఇలాంటి సోకాల్డ్ మేధావుల గురించే. అయితే ఈ మాటలు భారత్ లోని సోకాల్డ్ మేధావులకు తలకెక్కుతాయా అన్నది సందేహమే. ఎందుకంటే వీరికి దేశం అనే భావన కంటే డబ్బు, పేరాశే ఎక్కువ. వీరికి అరవయ్యేళ్ళు పాలించే కాంగ్రెస్ పార్టీ ఎన్నో మార్గాల ద్వారా డబ్బు ధారబోసేది. సోకాల్డ్ మేధావి జర్నలిస్టులకైతే దేశంలో ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్లో బస చేస్తే వారికి అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరించేది. దీంతో పాటు ప్రధాని విదేశీ యాత్రలను మేధావుల విహార యాత్రలుగా మార్చుకునేవారు. ఒక్క ప్రధాని విదేశీ యాత్ర కోసం వందల మంది జర్నలిస్టులు అదే విమానంలో ప్రయాణించేవారు. అక్కడ ఫైవ్ స్టార్ భోజనం నుంచి మధ్యపానం వరకు అన్నీ ఉచితంగా దొరికేవి. దీంతో పాటు ప్రభుత్వం నుంచి తాము అనుకున్నవారికి కాంట్రాక్టులు ఇప్పించడం లాంటివి చేసి హవా చూపించేవారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరి ఆటలు సాగటంలేదు. ఎక్కడికక్కడ వీరికి అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు వీరి ఆగడాలకు తెరపడింది. అయితే వీరు ఇప్పటికీ మారటానికి ప్రయత్నం కూడా చేయడంలేదు. దేశ ప్రయోజనాల కంటే హస్తం పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని భావించేవారు.. జస్ట్ సాల్వేటర్ బేబోన్స్ మాటలకు మారతారంటే అది హాస్యాస్పదమే అవుతుంది.

  Trending Stories

  Related Stories