More

  పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు.. దీని రూటే సపరేటు..!

  ఇప్పటి వరకు రైలు నడవడం అంటే కేంద్రం పరిధిలో ఉంటుందని అందరికి తెలుసు. కానీ తొలిసారి దేశంలో ప్రైవేట్ రైలు పట్టాలెక్కింది. లాంఛనంగా తన ప్రయాణాన్ని ఆరంభించింది. సౌత్ స్టార్ రైల్ అనే ప్రైవేట్ సంస్థ ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది.

  తమిళనాడులోని కోయంబత్తూర్-మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ మధ్య దీన్ని నడిపిస్తోంది. కోయంబత్తూర్ నార్త్ రైల్వే స్టేషన్‌ నుంచి సాయినగర్ షిర్డీకి బయలుదేరి వెళ్లిందీ ఎక్స్‌ప్రెస్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న భారత్ గౌరవ్ పథకం కింద ఈ తొలి ప్రైవేట్ రైలు అందుబాటులోకి వచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన చారిత్రక- సాంస్కృతిక ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, దర్శనీయ స్థలాలకు రైలు కనెక్టివిటీని కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఇది. దేశంలో 16 రైల్వే జోన్ల పరిధిలో భారత్‌ గౌరవ్‌ రైళ్లు త్వరలోనే పట్టాలు ఎక్కనున్నాయి.

  ఇందులో భాగంగా కోయంబత్తూర్-సాయినరగ్ షిర్డీ రైలు అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన ఈ ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం 7:25 నిమిషాలకు సాయినగర్ షిర్డీ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఒకరోజు పాటు అక్కడే ఉంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణమౌతుంది. శుక్రవారం సాయినగర్ షిర్డీ నుంచి బయలుదేరి.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోయంబత్తూర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సీటింగ్ కెపాసిటీ 1,500. తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేట, యలహంక, హిందూపురం, ధర్మవరం, గుంతకల్ జంక్షన్, మంత్రాలయం రోడ్, రాయచూర్, యాద్గిర్, సేడం, వాడి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తోంది. మంత్రాలయం రోడ్‌ స్టేషన్‌లో అయిదు గంటల పాటు హాల్ట్ అవుతుంది. ప్రస్తుతానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌లల్లో ఉండే ఛార్జీలనే ఇందులోనూ వసూలు చేస్తోంది సౌత్ స్టార్ రైల్ సంస్థ.

  ప్రయాణికులకు షిర్డీలో వీఐపీ దర్శనాన్ని కల్పించే ఏర్పాటు చేసింది. దీనికి అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. బోగీలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి ఈ ఎక్స్‌ప్రెస్‌లో హౌస్ కీపింగ్ సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ ఉంది. ప్రయాణికులకు ఎలాంటి అనారోగ్యం సంభవించినా అప్పటికప్పుడు వైద్య చికిత్సను అందించే సౌకర్యం ఈ రైలులో ఉంది. 24 గంటల పాటు ఒక డాక్టర్ అందుబాటులో ఉంటారు. భద్రత కల్పించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ల పహారా ఉంటుంది. భారత్ గౌరవ్ పథకం కింద ప్రవేశపెట్టే రైళ్లన్నింటినీ ప్రైవేట్ ఆపరేటర్లే నిర్వహించాల్సి ఉంటుంది. జోన్ల వారీగా వారి ఎంపిక కొనసాగిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. నిబంధనలకు అనుగుణంగా ఎవ్వరైనా సరే.. ఈ రైళ్లను నడపవచ్చు. వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు.. ఈ ప్రత్యేక రైళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

  భారత్ గౌరవ్ ప్రైవేట్ రైలు సర్వీసుల్లో డిమాండ్‌కు అనుగుణంగా ఛార్జీలను నిర్ణయించుకునే వీలు ఆ సంస్థలకు ఉంటుంది. తాము ఏ రూట్‌లో రైలును నడిపించాలనే విషయాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా రైల్వే మంత్రిత్వ శాఖ వారికి కల్పించింది. రైల్వేకు రైట్‌ టూ యూజ్‌, ఫిక్స్‌డ్‌, వేరియబుల్‌ ఛార్జీలను రైల్ ఆపరేటర్లు చెల్లించాల్సి ఉంటుంది. కోచ్​ల లోపల, బయటా వాణిజ్య ప్రకటనలకు అవకాశం ఇచ్చింది. థర్డ్ పార్టీ వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం సంబంధిత ఆపరేటర్లకే వెళ్తుంది.

  spot_img

  Trending Stories

  Related Stories