కరోనాను ఖతం చేసి.. ఇంగ్లాండు దాటేసి.. దూకుడుమీదున్న భారత ఆర్థికవృద్ధి..!

0
823

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వృద్ది మందగిస్తుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోంది. ఇటీవలే ఐఎంఎఫ్ 2023 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రపంచదేశాల ఆర్థిక వృద్దిని అంచనా వేసింది. ఈ అంచనాల్లో అగ్రదేశాలు భారత్ దరిదాపుల్లో కూడా కనబడట్లేదు. 2023 సంవత్సరంలో ప్రపంచదేశాల ఆర్థిక పట్టీని పరిశీలిస్తే భారత్ జీడీపీ 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇందులో చైనాకు 4.4 శాతం, అమెరికాకు 1 శాతం, యూకేకు 0.3 శాతంగా ఉంటుందని అంచనావేసింది. ఈ పట్టికను గమనిస్తే భారత వృద్దిరేటు ఎంత ఎక్కువగా ఉందో అంచనా వేయవచ్చు. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గిపోయి ఏడాది కావస్తున్నా,.. అగ్రరాజ్యాలని విర్రవీగే దేశాలు ఆర్థిక మందగమనం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోయాయి. చైనా అయితే జీరో టోలరెన్స్ లంటూ ఇంకా లాక్‎డౌన్ దశలోనే ఆగిపోయింది. దీంతో అగ్రదేశమంటే పేరుకు మాత్రమే కాకుండా చేతల్లో చేసి చూపించాలని భారత్ ప్రపంచదేశాలకు సవాల్ విసిరినట్లయింది.

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ వార్షిక సమావేశం వాషింగ్టన్‎లో జరుగుతోంది. ఇందులో ప్రపంచదేశాల జీడీపీని లెక్కించిన ఐఎంఎఫ్, భారత్‎పై ప్రశంశల వర్షం కురిపించింది. ఐఎంఎఫ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా భారత ఆర్థిక వ్యవస్థను చిమ్మ చీకట్లో దీపపు వెలుగుగా అభివర్ణించింది. ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ది చెందుతోన్న దేశమని ప్రశంసించారు. కోవిడ్ నుండి ప్రతికూలతలను ఎదుర్కొన్నా,.. వాటిని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని క్రిస్టాలినా జార్జివా అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా పుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలే కారణమని కొనియాడారు. దీంతో పాటు భారత డిజిటల్ పేమెంట్స్ ను కూడా ఐఎంఎఫ్ ప్రశంసించింది. టెక్నాలజీలో కూడా భారత్ దూసుకుపోతోందని ఆర్థిక వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ పాలో ప్రశంసించారు. అతిసామాన్యులకు సైతం అందుబాటులో వచ్చేలా భారత్ టెక్నాలజీని తీసుకువచ్చిందనీ,.. ఇందువల్లే భారత్ లో యూపీఐ పేమెంట్స్ భారీ వృద్ది కనబరిచాయని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్స్ ను లాజిస్టికల్ అధ్భుతం అని పాలో అన్నారు. మహిళలు, వృద్దులు, రైతులకు సహాయం చేయడానికి భారత్ విజయవంతమైన సాంకేతిక ఆవిష్కరణలను చేపట్టిందనీ ప్రపంచదేశాలు వీటిని చూసి నేర్చుకోవాలని పాలో హితవు పలికారు.

ఇక భారత్ ఈ విధంగా ఆర్థిక వృద్దిలో దూసుకుపోవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ నుంచి పోరాడి భారత్‎ను మహమ్మారి ఊబిలోంచి బయటకు తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి మరువలేదని అంటున్నారు. లాక్ డౌన్ నుంచి వ్యాక్సిన్ల వరకు చాలా ముందు చూపుతో వ్యవహరించారని కొనియాడుతున్నారు. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణంగా నడుస్తున్న సమయంలో కోవిడ్ ఒక గుదిబండగా వచ్చి పడింది. ఈ మహమ్మారి విజృంభించిన మొదట్లో దీని గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. సరైన మందులూ లేవు. డాక్టర్లకు సైతం ఏ మందును ఉపయోగించాలో తెలియని పరిస్థితి. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమని తెలిసినా,.. లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో అప్పటివరకు పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మందగించింది. దాదాపు అన్ని రంగాలూ మూతబడిపోయాయి. ఉత్పత్తి నుండి రవాణా వరకు ఏ ఒక్కరంగమూ సరిగ్గా పనిచేయలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ సున్నాకు పడిపోయింది.
అయితే కరోనా సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం పెద్ద సవాలుగా స్వీకరించింది. ఎలాగైనా, పడిపోయిన ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టాలని నిర్ణయించుకుని తీవ్రంగా కృషి చేసింది. ముందుగా కరోనా మరింతగా విజృంభించకుండా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కంపెనీలను వర్క్ ఫ్రం హోం లకు ప్రోత్సహించడం వంటివి చేసింది. తాత్కాలికంగా ఇటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టినా,.. దీర్ఘకాళికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారత్ లో వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసే కంపెనీలకు ప్రభుత్వం తరపున ఇన్సెంటివ్ లను ప్రకటించింది. దీంతో దేశీయ కంపెనీలన్నీ వ్యాక్సిన్ పరిశోధనలపై దృష్టి సారించి అందులో విజయం సాధించాయి. అయితే వీటి ధర వెయ్యి రూపాయల వరకు ఉండటంతో సాధారణ ప్రజలు వీటిని కొనలేరని ప్రభుత్వం గ్రహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సిన్ లు అందించింది. అయితే ఇక్కడే భారత్ కూ ఊహించని లాభం చేకూరింది. అగ్రదేశాలని చెప్పుకునే అమెరికా నుంచి చైనా వరకు వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వకపోవడంతో ఆయా దేశాల ప్రజలందరూ వ్యాక్సిన్లను తీసుకోలేదు. దీంతో ఆయా దేశాల్లో కోవిడ్ త్వరగా తగ్గుముఖం పట్టలేదు. కానీ భారత్ లో దాదాపు ప్రజలందరూ వ్యాక్సిన్ ఉపయోగించడంతో తర్వాత వచ్చే కోవిడ్ వేవ్‎లు అంతగా ప్రభావం చూపలేదు.

ఇక కరోనా నుంచి అప్పుడప్పుడే తేరుకుంటున్న సమయంలో పడిపోయిన ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయాలి. ఇక్కడే భారత్ అగ్రదేశం అమెరికాకంటే భిన్నంగా ఆలోచించి విజయం సాధించింది. అమెరికాలో తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు హెలికాఫ్టర్ మనీ పేరుతో ప్రజలకు భారీగా డబ్బులను పంచింది. ప్రతి ఒక్క అమెరికన్ కు దాదాపు 80 వేల వరకు డబ్బును పంచిపెట్టారు. ఈ పథకాలతో ప్రజల దగ్గర డబ్బు పెరిగి కొనుగోళ్ళు ఊపందుకుంటాయనీ దీంతో తయారీ రంగానికి డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టారు. కానీ భారత్ మాత్రం ప్రజలకు పంచకుండా దీన్ని దీర్ఘకాళిక ప్రయోజనాలకు వెచ్చిచింది. ఆర్థికంగా కుంగిపోయిన పరిశ్రమలకు పునరుజ్జీవన ప్యాకేజీ కింద లక్షా పదివేల కోట్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీతో కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగంగా కోలుకుంది. ఈ ప్యాకేజీలకు తోడుగా ఆయా కంపెనీలు విదేశీ పెట్టుబడులు పొందేందుకు అప్పటికే ఉన్న చట్టాలను సవరించి మరింత సులభతరం చేసింది. ఈ విధంగా చేయడం వల్ల స్థానిక కంపెనీలకు భారీగా పెట్టుబడుల వరద మొదలైంది. ప్రపంచదేశాల కంటే భారత్ లో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉండటంతో పెట్టుబడిదారులు కూడా భారత్ కు క్యూ కట్టారు. ఈ విధంగా విదేశీ పెట్టుబడులు పొందిన వాటిలో ఎక్కువగా డిఫెన్స్, ఇంధన కంపెనీలే లాభపడ్డాయి. వీటికి తోడుగా పీఎల్ఐ స్కీంలలో భాగంగా మరో నలభైవేల కోట్ల సహాయం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా దీర్ఘకాళికంగా ప్రయోజనాలు చేకూర్చే పథకాలను భారత్ ప్రవేశపెట్టడంతో క్రమంగా కుదేలైన పరిశ్రమలు పునరుజ్జీవనం సంపాదించాయి. మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో 2022లో ఆర్థిక వృద్ది 6.8గా నమోదైంది. ప్రజలకు డబ్బులు పంచితే బలోపేతమవుతుందన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ 2023లో 1శాతం వృద్ది కనబరుస్తుందని ఐఎంఎఫ్ చెబితే పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించిన భారత్ మాత్రం 6.8 శాతం వృద్ది కనబరిచింది. ఈ విధమైన ప్రణాళికలతోనే ఐఎంఎఫ్ కూడా భారత్ ను ప్రశంసించింది. చిమ్మ చీకటిలో దీపపు వెలుగులా భారత ఆర్థిక విధానాలు ప్రపంచదేశాలకు దారిచూపుతున్నాయని ఐఎంఎఫ్ డైరెక్టర్ కొనియాడారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =