గల్ఫ్ పెత్తనానికి భారత్ చెక్..! మోదీ‘ఆయల్’ దౌత్యం అదుర్స్..!!

0
762

ప్రపంచంలో ఏ దేశమూ ఇతర దేశంపై పూర్తిగా ఆధారపడకూడదు. చిన్న సన్‎ఫ్లవర్ గింజ నుంచి ముడి చమురు వరకు.. ఏ చిన్న వస్తువు కోసమైనా ఇతర దేశాలపై ఆధారపడితే.. దీర్ఘకాళికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దౌత్యసంబంధాల్లో ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్మాయం ఉండాలంటారు విదేశాంగ నిపుణులు. ఒకవేళ ఇతర దేశాలపై మరో దేశం పూర్తిగా ఆధారపడితే ఏం జరుగుతుందో తాజా పరిణామాల ద్వారా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఉక్రెయిన్ సన్ ఫ్లవర్ ఎగుమతుల్లో అగ్రగామి. ప్రపంచదేశాలన్నీ కూడా సన్ ఫ్లవర్ ఉత్పత్తులకోసం ఉక్రెయిన్ పైనే ఆధారపడ్డాయి. రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ప్రపంచ దేశాలు వంటనూనెల ధరల్లో పెరుగుదలను చవిచూశాయి. ఓ సందర్భంలో భారత్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది. పామాయిల్ కోసం భారత్ ఎక్కువగా ఇండోనేషియాపై ఆధారపడేంది. అయితే, ఆ దేశం తీసుకున్న పలు సంస్కరణల వల్ల.. పామాయిల్ దిగుమతి తగ్గింది. దీంతో భారత్ లో పామాయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అందుకే ఏ దేశం కూడా మరో దేశంపై పూర్తిగా ఆధారపడకూడదు. ఒకవేళ ఆధారపడ్డా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు, వాటికి తక్షణ ప్రత్యామ్నాయ మార్గాలను ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి.

అయినప్పటికీ, ఏ దేశమైనా కొన్నిసార్లు దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పారిశ్రామిక ఉత్పత్తులయితే కాస్తంత ఆలస్యమైనా ప్రయత్నం చేస్తే స్వయంసమృద్ది సాధించవచ్చు. కానీ,. సహజవనరులైతే దిగుమతులు తప్ప వేరే మార్గం ఉండదు. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన వేళ దాదాపు అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే, దిగుమతుల విషయంలో ఆయా దేశాలు ఎప్పటికీ ఒక ప్రత్యామ్నాయం సృష్టించుకోవాల్సిన అవసరముంది. భారత్ కూడా గతంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతూ వచ్చేది. ప్రతి ఉత్పత్తిపైనా ఇతర దేశాలపై పూర్తిగా ఆధారపడుతూ వచ్చింది. అందుకే తాజాగా మేకిన్ ఇండియా అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్ళి సాధ్యమైన రంగాల్లో స్వయం సమృద్ది సాధించేలా పనిచేస్తోంది. అయితే సహజవనరుల విషయంలో మాత్రం ఇతర దేశాలపై ఆధారపడుతోంది భారత్. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులపై భారత్ కొన్ని దశాబ్దాలుగా అరబ్ దేశాలపై ఆధారపడుతూ వచ్చింది.

భారత్ లో చమురు నిక్షేపాలు చాలా తక్కువ. అందుకే చమురు అవసరాల్లో దాదాపు 84 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ విధంగా విదేశాలనుంచి చమురు దిగుమతుల్లో ఎక్కువగా అరబ్ దేశాలపైనే ఆధారపడుతోంది. గల్ఫ్ దేశాల్లో చమురు ఎక్కువగా లభిస్తుండటంతో దశాబ్దాల తరబడి ఆ దేశాలపైనే ఆధారపడింది. భారత్ కూడా ఇన్నాళ్ళూ అరబ్ దేశాలు లేకుండా చమురును దిగుమతి చేసుకోలేమనే ఒక అపోహలో ఉండేది. పైపెచ్చు గత ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా.. అరబ్ దేశాలతో తప్ప మరే ఇతర దేశాలతోనూ చమురు దిగుమతులు చేసుకునేది కాదు. ఈ పరిణామాలతో అరబ్ దేశాలు ఒక రకంగా భారత్ పై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేశాయి. తమకు వ్యతిరేకంగా భారత్ పావులు కదుపుతుందని కాస్తంత అనుమానం వచ్చినా కూడా భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టేవి. సెక్యులరిజం ముసుగులో ముస్లింలకు రక్షణ లేదంటూ ప్రచారం చేసేవి. దీంతో భారత్ తన స్వచ్చతను తరచూ నిరూపించుకోవాల్సి వచ్చేది. ఇక అరబ్ దేశాల్లో పాకిస్తాన్ ప్రభావం చాలా ఉండేది. దీంతో తరచూ కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చేది. ఐక్యరాజ్యసమితి లాంటి సదస్సుల్లో తరచూ కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చేది. పాకిస్తాన్ లాంటి చిన్న దేశం భారత్ పై ఎదురుదాడి చేస్తుంటే భారత్ మాత్రం తనను తాను కాపాడుకునే దశలో ఉండేది. దీంతో దాదాపు భారత్ తన సార్వభౌమాధికారాన్ని అరబ్ దేశాల చేతిలో పెట్టినంత పని అయింది.

తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్దం జరిగినప్పుడు కూడా అరబ్ దేశాలు ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచేశాయి. ఈ ధరలను కూడా కేవలం ఆసియా దేశాలకు మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే అరబ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూసిన భారత్ కు గతంలో సాధ్యపడలేదు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా అరబ్ దేశాలపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చేది. కానీ, భారత్ కు అనూహ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్దం కలిసివచ్చింది. భారత్ లోని బలమైన నాయకత్వంతో పాటు దౌత్యవిధానం సరిగ్గా పనిచేయడంతో రష్యాతో వాణిజ్యం పెరిగింది.

రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైనప్పుడు అమెరికా యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాయి. దీంతో ఇతర దేశాలు రష్యానుంచి చమురును దిగుమతి చేసుకోలేకపోయాయి. ఇటువంటి కఠినపరిస్థితుల్లో ప్రత్యామ్నాయ దేశాలైన అరబ్ దేశాలు తమ చమురు ఉత్పత్తిని పెంచి ఇతర దేశాలకు సరఫరా చేయవచ్చు. కానీ అలా చేయకుండా అప్పటికే ఉన్న ధరల కంటే ఎక్కువ ధరలకు చమురును ఎగుమతి చేయడం ప్రారంభించాయి. ఈ విధంగా ధరలను పెంచడం కేవలం ఆసియా దేశాలకు మాత్రమే చేశాయి. దీంతో ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. అయితే భారత్ కు మాత్రం రష్యా స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. యుద్దం తర్వాత అరబ్ దేశాలు ధరలు పెంచగా యుద్దం కంటే ముందు ధరలకే భారత్ కు ఎగుమతి చేయడానికి రష్యా ముందుకొచ్చింది. దీంతో మెల్లిమెల్లిగా అరబ్ దేశాలపై ఆధారపడటం తగ్గించుకుని రష్యా నుంచి దిగుమతులు పెంచింది. అమెరికా యూరప్ లు ఎంత వ్యతిరేకించినా భారత్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో రష్యానుంచి వ్యాపారం భారీగా పెరిగింది. చమురు దిగుమతులను భారత్ తన అవసరాలకంటే ఎక్కువగా చేసి దాన్ని భారత్ లో రిఫైనరీ చేయించి తిరిగి అమెరికాకే అమ్ముతోంది.

ఈ పరిణామాలతో గత ఐదు నెల్లోనే రష్యా భారత్ ల మధ్య వాణిజ్యం భారీగా పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టస్థాయికి చేరుకుని 18 వేల 229 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో అగ్రభాగం చమురు ఉత్పత్తులే ఉండటం కీలకం. ఈ విధంగా చమురు ఉత్పత్తులను అరబ్ దేశాలతో తగ్గించుకోవడంతో ఆయా దేశాల ఆధిపత్యాన్ని కూడా భారత్ తగ్గించుకోవడానికి వీలవుతుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − nine =