Special Stories

ఆఫ్ఘన్‎ సహా ఆయా దేశాల్లో భారత్ రెస్క్యూ ఆపరేషన్స్..

తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ వణికిపోతోంది. అక్కడ పరిస్థితి చేజారిపోతోంది. కాబూల్ సహా అన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమ దేశస్తులను రక్షించుకునేందుకు.. అమెరికా, భారత్ సహా పలు దేశాలు రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. ‘ఆపరేషన్ ఎయిర్ లిఫ్ట్’ పేరుతో ఆఫ్ఘన్‎లోని భారతీయులను ఆగమేఘాల మీద స్వదేశానికి తరలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వేలాదిమందిని భారత్‎కు తీసుకొచ్చింది. అటు, తాలిబన్ మూకల నుంచి కనీస రక్షణ కూడా కరవైన నేపథ్యంలో.. కొందరు ఆఫ్ఘన్ జాతీయులను కూడా కాపాడే మిషన్‎ను ప్రారంభించింది భారత్. ఈ ఆపరేషన్లలో భారత వైమానిక దళం కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ల విజయవంతంగా అమలు చేసిన చరిత్ర భారత్ సొంతం. ఎన్నో యుద్ధాలు, అంతర్యుద్ధాల్లో అనేకమంది పౌరులను కాపాడిన అనుభవం భారత్‎కు వుంది. శత్రువు కళ్లుగప్పి చాకచక్యంగా తరలించిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో భారత్ చేపట్టిన పలు రెస్క్యూ ఆపరేషన్ల గురించి తెలుసకుందాం..

ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య సైనిక సంఘర్షణ తలెత్తినప్పుడు.. 2006 జూలైలో ‘ఆపరేషన్ సుకూన్’ పేరుతో భారత్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. భారత ఆర్మీ సహకారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా అనేక మంది స్వదేశీయులను కాపాడింది. లెబనాన్‎లోని 2 వేలమంది భారతీయులతో పాటు.. నేపాల్, శ్రీలంక జాతీయులను కూడా రక్షించి స్వస్థాలకు చేర్చింది.

భారత నావికాదళం.. నాడు ‘ఆపరేషన్ సుకూన్’ను ప్రారంభించింది. ఇందుకోసం INS-Mumbai, INS-Betwa, INS-Brahmaputra, INS-Shakti నౌకలను రంగంలోకి దింపింది. 115 టన్నుల సామర్థ్యం గల ఈ నౌకల ద్వారా సైప్రస్ ప్రభుత్వంతో కలిసి సహాయ కార్యక్రమాలను కొనసాగించింది. వైద్య సామాగ్రి, దుస్తులు, దుప్పట్లు, క్రిమినాశకాలు, ఆహారం, పాలపొడితో పాటు పలు అత్యవసరం వస్తువులను పంపించింది. తిరిగి ఇవే నౌకల ద్వారా 2,280 మందిని విజయవంతంగా తరలించారు. వీరిలో 1,800 మంది భారతీయ పౌరులు కాగా, 379 శ్రీలంక జాతీయులు, 69 మంది నేపాలీలు, 5 లెబనాన్ పౌరులున్నారు. తిరోగమనం తరువాత, టాస్క్ ఫోర్స్ లెబనాన్ నుండి అంతర్జాతీయ జలాల్లో స్టేషన్‌లో ఉండి, సంఘర్షణను పర్యవేక్షిస్తుంది మరియు లెబనాన్‌లో మిగిలిన భారతీయ పౌరుల భద్రతను నిర్ధారిస్తుంది. ఆ నౌకలు 10 ఆగస్టు 2006 న తమ హోమ్ పోర్టులకు బయలుదేరాయి. అంతర్జాతీయ జలాల్లో ఓవైపు సంఘర్షణలను గమనిస్తూ.. మరోవైపు లెబనాన్ లో చిక్కుకున్న మరికొంతమంది భారతీయులను దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించింది భారత నౌకదళం. ఇండియన్ నేవీ చాకచక్యంతో మొత్తానికి 2006 ఆగస్ట్ 10న నాలుగు నౌకలు భారతీయ నౌకాశ్రయాలకు సురక్షితంగా చేరుకున్నాయి.

ఆపరేషన్ సేఫ్‎ హోమ్‎కమింగ్. లిబియా అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు 2011లో ఈ ప్రతిష్టాత్మక ఆపరేషన్‎ను చేపట్టింది ఇండియన్ నేవీ. 2011 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 11 వరకు సాగిన ఈ ఆపరేషన్ ద్వారా 15 వేల మంది భారతీయలను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. ట్రిపోలీ, సెభా ప్రాంతాలతో పాటు.. లిబియా వ్యాప్తంగా 18 వేల మంది భారతీయ నిపుణులు, కార్మికులు నివసిస్తున్నారు. వీరిలో రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. దాదాపు 15,400 మందిని స్వదేశానికి తరలించినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆపరేషన్‎లో పాల్గొన్న INS-Jalashwa నౌకతో పాటు.. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసింది.

ఇక, 2014లో ISIS, ఇరాక్ ఆర్మీ మధ్య జరిగిన అంతర్యుద్ధం సమయంలోనూ భారత్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టింది. తిక్రిత్ నగరంలోని ఓ ఆసుపత్రిని ISIS ఉగ్రవాదులు నిర్బంధించారు. దీంతో ఆసుపత్రిలో పనిచేస్తున్న 46 మంది భారతీయ నర్సులు ఇసిస్ మూకల చేతుల్లో బంధీలయ్యారు. వీరిని రక్షించేందుకు.. 2014 జూన్‎లో ఢిల్లీ నుంచి ఇరాక్‎లోని ఎర్బిల్‎కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాన్ని పంపించింది భారత్. ఈ విమానం ద్వారా 46 మంది భారతీయ నర్సులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.

2015లోనూ భారత్ ఇలాంటి ఆపరేషనే చేపట్టింది. దీని పేరు ‘ఆపరేషన్ రాహత్’. యెమెన్‎లోని షియా హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా జరిపిన దాడుల సమయంలో.. భారత నావికానికదళం ఈ రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించింది. ఆ సందర్భంగా యెమెన్‎లో చిక్కుకుపోయిన 4,640 మంది భారతీయులతో పాటు.. 41 దేశాలకు చెందిన 960 మందిని తరలించింది. 2015 ఏప్రిల్ 1న పోర్ట్ ఆఫ్ ఏడెన్ నుంచి భారత నావికాదళం ఈ ఆపరేషన్‎ను ప్రారంభిస్తే.. ఏప్రిల్ 3న ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా తరలింపు ప్రక్రియను చేపట్టాయి.

ఇక, భారత్ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక రెస్క్యూ ఆపరేషన్ 2016లో జరిగింది. 2016 మార్చి 22న బెల్జియంలో బాంబు పేలుళ్లు జరిగాయి. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు దగ్గర రెండు, మాల్బీక్ మెట్రో స్టేషన్ వద్ద మరో బాంబు పేలింది. ఈ బాంబు పేలుళ్లలో 32 సాధారణ పౌరులు మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. జెట్ ఎయిర్ విమానం ద్వారా 242 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. ఇవి మచ్చుకుమాత్రమే. అంతర్యుద్ధాలు, దాడులు, యుద్ధాల సందర్భంగా.. భారత్ ఎన్నో ప్రతిష్టాత్మక రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టింది. ఈ ఆపరేషన్లలో భారతీయులనే కాక, ఇతర దేశస్థులను సైతం రక్షించి.. మానవత్వాన్ని చాటుకుంది భారత సైన్యం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − eleven =

Back to top button