అమెరికాలో వెళ్లడం ఎంతో మంది భారతీయుల కల. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ శాశ్వతంగా స్థిరపడాలని ఎన్ఆర్ఐలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే అమెరికా వెళ్లే భారతీయులకు ఇండియాలోని అమెరికన్ ఎంబసీ శుభవార్త చెప్పింది. భారతదేశం నుండి వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు ఇతర దేశాలలో కూడా అపాయింట్‌మెంట్‌లు తీసుకోవచ్చని మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. బ్యాక్‌లాగ్‌ల సంఖ్యను తగ్గించడంతో పాటు భారతదేశంలోని కొన్ని కేంద్రాలలో 800 రోజుల వరకు యూఎస్ వీసాల కోసం వేచి ఉండే వ్యవధిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంది.
తాజా ప్రకటనపై భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. మీరు రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా పర్యటించబోతున్నారా? అని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అలా అయితే మీరు మీ గమ్యస్థానంలో ఉన్న యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో వీసా అపాయింట్‌మెంట్ పొందవచ్చు. ఉదాహరణకు బీ1, బీ2 వీసాల కోసం భారతీయులకు థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఈ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పింది. మరోవైపు భారతదేశంలోని యుఎస్ ఎంబసీ వారు 1 లక్షకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు మరో ట్వీట్‌లో తెలియజేశారు. ఈ మార్చిలో తన టీమ్‌ని విస్తరింపజేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 4న చేసిన ట్వీట్‌లో యూఎస్ ఎంబసీ తాజా శుభవార్త చెప్పింది. ఈ జనవరిలో భారతదేశంలోని యూఎస్ మిషన్ 1 లక్షకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసిందని.. ఇది జూలై 2019 నుండి ఏ నెలలోనూ లేనంత ఎక్కువని తెలిపింది. అలాగే.. నెలవారీగా చూస్తే అత్యధిక ఎక్కువ మొత్తంలో వీసా ప్రాసెస్ చేసినట్టు ప్రకటించింది. బృంద సామర్థ్యం రోజురోజుకు పెరుగుతుందని తెలిపింది.
అంతకుముందు జనవరి 21న, భారతదేశంలోని యూఎస్ మిషన్ మొదటిసారి వీసా దరఖాస్తుదారుల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా శనివారం ఇంటర్వ్యూ ప్రాసెస్ ను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీ, ముంబై, చెన్నై, కోల్‌కతా , హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లు వ్యక్తిగత వీసా ఇంటర్వ్యూలు అవసరమయ్యే దరఖాస్తుదారులకు వసతి కల్పించడానికి శనివారం కాన్సులర్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి.
భారతదేశంలోని యుఎస్ ఎంబసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యుఎస్ మిషన్ ఎంపిక చేసిన శనివారాల్లో అపాయింట్‌మెంట్‌ల కోసం అదనపు స్లాట్‌లను తెరవడం కొనసాగిస్తుంది. కోవిడ్ -19 కారణంగా వీసా ప్రాసెసింగ్‌లో బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడానికి తీసుకున్న చర్యలలో ఈ అదనపు రోజుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మునుపటి వీసాలతో ఉన్న దరఖాస్తుదారుల కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కేసుల రిమోట్ ప్రాసెసింగ్‌ను అమలు చేసింది. జనవరి నుంచి మార్చి మధ్య ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వాషింగ్టన్, ఇతర రాయబార కార్యాలయాల నుండి డజన్ల కొద్దీ తాత్కాలిక కాన్సులర్ అధికారులు భారతదేశానికి వస్తారు. భారతదేశంలోని యూఎస్ మిషన్ రెండు వారాల క్రితం 2 లక్షల 50 వేలు అదనపు B1, B2 అపాయింట్‌మెంట్‌లను విడుదల చేసింది. ఐతే తాజా చర్యలతో భారతీయులు అమెరికాలో పర్యటించడం మరింత సులువు కానుంది.