ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న భారతీయులను తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలను చేస్తూ ఉంది. తాజాగా భారత రాయబారిని ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత వైమానిక దళం తీసుకొని వచ్చేసింది. భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో ఆఫ్ఘనిస్తాన్ లోని భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ భారత్ కు వచ్చేశారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ చేరుకుంది.
కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వీరిని సోమవారం సాయంత్రమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానం దిగిన అనంతరం వారందరినీ ఓ బస్సులో తరలించారు. భారత్ చేరుకున్న నేపథ్యంలో వారంతా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. స్వదేశానికి వచ్చినందుకు వారంతా హర్షం వ్యక్తం చేశారు.
సోమవారం (ఆగస్టు 16) నాడు ఆఫ్ఘనిస్తాన్ నుండి 45 మంది భారతీయులు ఉన్న మొదటి బ్యాచ్ విజయవంతంగా తరలించబడింది. స్థానిక ఆఫ్ఘన్లు తమ దేశం నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో విమాన ప్రయాణం సవాలుగా మారిన పరిస్థితులలో హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత్ కు చెందిన విమానం బయలుదేరింది. తాలిబాన్లు మొదట 45 మంది భారతీయ సిబ్బందిని ఖాళీ చేయించారు. వారు రాయబార కార్యాలయ సిబ్బందికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత వస్తువులను కూడా తీసుకున్నారు. భారతదేశానికి ఆఫ్ఘన్ వీసాలను ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించే షాహిర్ వీసా ఏజెన్సీని కూడా తాలిబాన్లు ముట్టడించారు.
కాబూల్ విమానాశ్రయంలో ఎదురవుతున్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ కు తిరిగి రావాలనుకునే వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, కానీ కాబూల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రధాన సవాలుగా మారాయని అన్నారు. ఈ అంశంలో ఆఫ్ఘన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కాబూల్ లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కాబూల్ లో ఉన్న సిక్కులు, హిందూ సంఘాల నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, భారత పౌరుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని జై శంకర్ తెలిపారు. కాబూల్ లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల గురించి కచ్చితమైన సమాచారం ఉంటే 919717785379 ఫోన్ నెంబరుకు గానీ, [email protected] ఈమెయిల్ ఐడీకి గానీ అందించాలని సూచించారు.