ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇప్పటి వరకు 6 పేలుళ్లు జరిగాయి. అమెరికా సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ల నుంచి 160 మంది భారతీయులు సురక్షితంగా తప్పించుకున్నారు. వీరిలో 145 మంది సిక్కులు కాగా, 15 మంది హిందువులు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద బాంబు పేలుళ్లు సంభవించడానికి కొన్ని గంటల ముందే వీరందరినీ అక్కడి నుంచి భారత్ కు తరలించారు. ఆప్ఘన్ లో ఇంకొంత మంది భారతీయులు ఉన్నారు. తాజా పేలుళ్ల నేపథ్యంలో అక్కడి నుంచి ప్రజలను తరలించడం మరింత క్లిష్టంగా మారింది. ఎయిర్ పోర్టు లోపల ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పటికీ.. ఎయిర్ పోర్టు బయటి పరిస్థితి దారుణంగా ఉంది. సామాన్యుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ఎయిర్ పోర్టులోకి ప్రవేశిస్తున్నారు.
ఈ జంట పేలుళ్ల ఘటనపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ దారుణాన్ని తాము ఖండిస్తున్నామని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఈ పేలుళ్ల ఘటన చాటుతోందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని ఉపేక్షించరాదన్న విషయం ఈ ఘటన ద్వారా అర్థమవుతుందని భారత్ తెలిపింది. కాబూల్ పేలుళ్ల ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రగాఢ సంతాపం తెలియజేసింది.
గురువారం సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌లోని ‘అబే’ గేట్, విమానాశ్రయం ఆవరణలోని బారోన్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో వందల మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, విదేశీయులతో పాటు అమెరికా సైనికులు, తాలిబన్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడుల అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. జంట పేలుళ్లను అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించింది. ‘అబే’ గేట్ వద్ద తొలి పేలుడు జరిగిన కొద్ది సేపట్లోనే హోటల్ సమీపంలో రెండో పేలుడు జరిగినట్టు తెలిపింది.