భారత పురుషుల జట్టు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించగా.. భారత మహిళలు కూడా కాంస్యం సాధిస్తారని ఆశించగా.. ఆ ఆశ నిరాశ అయింది. భారత మహిళలు బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓటమి పాలయ్యారు.హోరాహోరీగా సాగిన పోరులో గ్రేట్ బ్రిటన్‌పై మూడు క్వార్టర్ల వరకూ భారత్‌దే పైచేయి అయింది. కానీ ఆఖర్లో గ్రేట్ బ్రిటన్ అటాకింగ్ గేమ్ భారత డిఫెన్స్ ను కలవరపెట్టింది. 3-2 తో ఒకానొక దశలో భారత్ ఆధిక్యం లో నిలవగా.. ఆ తర్వాత వచ్చిన పెనాల్టీ కార్నర్లను గ్రేట్ బ్రిటన్ జట్టు వినియోగించుకుంది. దీంతో గ్రేట్ బ్రిటన్ 4-3 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. భారత్ కు కూడా పెనాల్టీ కార్నర్ అవకాశం లభించినా.. గోల్ సాధించడంలో మాత్రం విఫలమైంది. మూడో క్వార్టర్‌లో బ్రిటన్ గోల్ చేసి గోల్స్‌ను సమానం చేసింది. భారత మహిళలు హోరాహోరీగా పోరాడి బ్రిటన్ ఆధిక్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. మూడో క్వార్టర్ 1.6 సెకన్లుండగా భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ సఫలం కాలేకపోయారు. ఈ కారణంగా నాలుగో క్వార్టర్‌లో రెండు జట్లపైనా ఒత్తిడి పెరిగింది. నాలుగో క్వార్టర్ 1.3 నిముషాల దగ్గర లభించిన పెనాల్టీ కార్నర్‌ను భారత్ సమర్థంగా అడ్డుకుంది. ఈ ఆఖరి క్వార్టర్ మాత్రం నువ్వా నేనా అన్నట్లు సాగింది. కానీ భారత్ కు గోల్ దక్కకుండా బ్రిటన్ జట్టు మ్యాచ్ ను ముగించడంతో భారత శిబిరంలో నిర్వేదం కనిపించింది. 4-3 తో భారత మహిళల జట్టు మ్యాచ్ ని కోల్పోయినప్పటికీ.. మనసులను మాత్రం గెలుచుకుంది. ఎంతో గొప్పగా టోర్నమెంట్ ఆడి సెమీస్ లో అడుగుపెట్టడం చాలా గొప్ప విషయమని ప్రశంసిస్తూ ఉన్నారు. భారత జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధిస్తుందని అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.