పక్కోడిని పడగొట్టైనా పైకి రావాలి.. ఇది పాపిష్టి చైనా దుష్టనీతి. బాధలో వుంటే శత్రువుకైనా చేయూతనిచ్చి పైకి లేపాలి.. ఇది భారతీయ సంస్కృతి. తన లాభం కోసం ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడుతుంది జిత్తులమారి చైనా. ఇది జగమెరిగిన సత్యం. కరోనా మహమ్మారి సమయంలోనూ తన కక్కుర్తిని ప్రదర్శించింది. అయితే, దాని కన్నింగ్ మెంటాలిటీ రివర్స్ అయ్యి.. బొక్కాబోర్లా పడింది. కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి వదిలింది కాక.. లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన దేశాలు.. ఓవైపు ఆకలికేకలు పెడుతుంటే.. సడెన్ గా ఆ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆపేసింది. ఆహార నిల్వలు తగ్గిపోతే తమకు నష్టమని ముందే ఊహించి.. బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేసింది. అంతకుముందు భారత్ ఎగుమతులను ప్రభావితం చేసేందుకు జిత్తులమారి కుట్రలు పన్నింది.
సరిగ్గా ఓ ఏడాది క్రితం ఆఫ్రికాకు భారత్ బియ్యం ఎగుమతులపై చైనా కన్నుపడింది. ఎలాగైనా భారత్ ఎగుమతులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకుంది. ఉన్నఫళంగా ఆఫ్రికాకు మనకన్నా తక్కువ రేటుకు బియ్యం ఎగుమతి చేయడం ప్రారంభించింది. తద్వారా భారత్ ఎగుమతులను దెబ్బకొట్టాలని చూసింది. అయితే, కరోనా మహమ్మారి వల్ల ఒక్కసారిగా ఎగుమతులను ఆపేసింది చైనా. ఆ ఒకే ఒక్క ఏడాదిలో పరిస్థితి మొత్తం మారిపోయింది. తాను తవ్విన గోతిలోనే పడింది జిత్తులమారి డ్రాగన్. చైనా కుయుక్తులకు భారత్ దిగిరాలేదు సరికదా.. ఇప్పుడు బియ్యం ఎగుమతుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అంతేకాదు, ఏకంగా చైనాయే భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి కల్పించింది. గతేడాది భారత ఆహార ధాన్యాల ఎగుమతులు రెట్టింపయ్యాయి. గతేడాది జనవరి ఏప్రిల్ మధ్యకాలంలో 1.63 బిలియన్ డాలర్లుగా వున్న ఎగుమతులు.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అయితే, బాస్మతి బియ్యం ఎగుమతులు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కరోనా మహమ్మారి కారణంగా బాస్మతి బియ్యం కొనుగోళ్లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. కానీ, సాధారణ బియ్యం ఎగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బియ్యం నిల్వలు పెంచుకోవడంపై అన్ని దేశాలు దృష్టిపెట్టాయి. నిజానికి, దశాబ్దాలుగా భారత్ ఇదే పనిచేస్తోంది. ఇప్పడు భారత్ మార్గంలోనే.. అన్ని దేశాలు కూడా ఆహార నిల్వల్ని పెంచుకునే చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా బియ్యం దిగుమతులను పెంచాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బియ్యానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇదే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చాలా దేశాల్లో బియ్యంతో పాటు ఇతర ఆహార ధాన్యాల ఉత్పిత్తి తగ్గింది. కానీ, ఇదే సమయంలో భారత్ లో భియ్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. గత క్రాప్ సీజన్ లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. దీంతో ఎగుమతులు కూడా పెరిగాయి. తొలిసారి వియత్నాం కూడా భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకుంది. భారత వ్యాపారులు ఏకంగా 70 టన్నుల బియ్యాన్ని వియత్నాంకు ఎగుమతి చేసే ఒప్పందం కుదుర్చుకున్నారు. టన్నుకు 500 డాలర్లు ధర పలుకుతున్న బియ్యాన్ని భారత్ 310 డాలర్లకే ఎగుమతి చేయడంతో వియత్నాం భారత్ వైపు మొగ్గుచూపింది.
ఇదిలావుంటే, కరోనా మహమ్మరిని తనకు అనుకూలంగా వాడుకున్న చైనా.. సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ఆఫ్రికాతో పాటు, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులను హఠాత్తుగా నిలిపివేసింది. తమ దేశంలో అత్యవసర నిల్వలపై దృష్టిపెట్టింది. దీంతో ఆయా దేశాల్లో బియ్యం లోటు ఏర్పడింది. అయితే, అప్పటికే విపరీమైన బియ్యం నిల్వలు కలిగిన భారత్.. ప్రపంచ దేశాలకు తమ ఎగుమతులను కొనసాగించింది. పైగా బియ్యం కొరత ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలకు ఆపన్న హస్తం అందించింది. తక్కువ ధరకే బియ్యం ఎగుమతి చేసి దాతృత్వాన్ని చాటుకుంది. ప్రస్తుతం బియ్యాన్ని ఆహారంగా వినియోగించే ప్రధాన దేశాలన్నీ.. భారత్ బియ్యాన్నే తింటున్నాయి.
భారత్ తర్వాత బియ్యం ఎగుమతుల్లో రెండస్థానంలో వున్న థాయ్ లాండ్ లోనూ.. బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. కానీ, భారత్ మాత్రం తక్కువ ధరకే బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీంతో వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలను ఆకర్షించింది. అంతేకాదు, చివరికి, కరోనా మహమ్మారి సమయంలోనూ కక్కుర్తి ప్రదర్శించిన చైనా సైతం భారత్ నుంచే బియ్యం కొనుగోలు చేయక తప్పలేదు. దీంతో బియ్యం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2019లో 7.1 బిలియన్ డాలర్ల విలువకలిగిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసింది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 32 శాతం భారత్ నుంచే జరిగాయి. భారత్ తర్వాత థాయ్ లాండ్, యూఎస్ఏ, వియత్నాం, పాకిస్తాన్, చైనా, ఇటలీ దేశాలున్నాయి. మొత్తానికి, పక్కదేశాల కడుపుకొట్టాలని భావించిన చైనా బొక్కబోర్లాపడితే.. బియ్యం ఎగుమతుల్లో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.