పాకిస్తానీ విద్యార్థినికి సహాయం చేసిన భారత విద్యార్థి.. సురక్షితంగా

0
969

రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థికి రొమేనియన్ సరిహద్దుకు చేరుకోవడంలో సహాయం చేశాడు. అక్కడ ఆమె తన మాతృభూమికి వెళ్ళింది. ఉక్రెయిన్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన అంకిత్ యాదవ్, పాకిస్తాన్ కాన్సులేట్‌కు చేరుకోవడంలో తనకు సహాయం చేశాడని ఆ యువతి తెలిపింది. అక్కడి నుండి ఆమెను స్వగ్రామానికి తరలించారు.

“ఫిబ్రవరి 24 సాయంత్రం నేను ఆమెను ఒక బంకర్‌లో కలిశాను. ఉక్రేనియన్లతో నిండిన ఆ బంకర్‌లో నేనొక్కడినే భారతీయుడిని. ఆమె మాత్రమే పాకిస్థానీ. భాషా అవరోధం కారణంగా, మేము ఎవరితోనూ మాట్లాడలేము. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో మేము నగరం నుండి పారిపోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని అనుకున్నాము. మేము ఫిబ్రవరి 26న బయలుదేరాలని అనుకున్నాము, కానీ కర్ఫ్యూ విధించబడింది. మా మొదటి ప్రయత్నంలో మేము విఫలమయ్యాము, ” అని యాదవ్ చెప్పారు. కీవ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న యాదవ్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన అనుభవాలను వివరించారు. నిరంతర బాంబు దాడులు, రష్యా సైనిక చర్యల కారణంగా బంకర్ నుండి బయటకు రావడానికి వారిని అనుమతించలేదని చెప్పాడు. ఆ సమయాల్లో ఆహారాన్ని సేకరించడం సమస్యగా అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

“నాసల్ స్ప్రే తీసుకోవడానికి ఫిబ్రవరి 27న బంకర్ నుండి బయటకు వెళ్ళడానికి నన్ను అనుమతించారు. అప్పుడే నేను నా హాస్టల్‌కు పారిపోయాను, మా ఇద్దరికీ ఆహారంతో తిరిగి వచ్చాను” అని యాదవ్ చెప్పారు. “తగినంత ఆహారం లేకపోవడంతో, ఫిబ్రవరి 27 రాత్రి మేము ఉక్రేనియన్లు మాకు అందించిన అన్నం మాత్రమే తిన్నాము. నిద్రపోయాము,” అన్నారాయన. “ఫిబ్రవరి 28న కర్ఫ్యూ ఎత్తివేయబడినప్పుడు, మేము బంకర్ నుండి పారిపోయాము.. తమ సామాగ్రిని తెచ్చుకోడానికి ఒక దుకాణానికి వెళ్ళాం, ఆపై నగరం విడిచి వెళ్లడానికి ప్లాన్ చేయడం ప్రారంభించాము” అని యాదవ్ చెప్పారు. “ఆ సమయంలో ఆమెకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి కాల్ వచ్చింది. ఆమె ఇప్పటికీ తాను కీవ్‌లో ఉన్నానని, పాకిస్తాన్ కు చెందిన వారెవరూ ఆమెతో లేరని వారికి చెప్పినప్పుడు, ఎంబసీ అధికారులు నన్ను సరిహద్దుకు ఆమెను తీసుకుని వెళ్లమని అభ్యర్థించారు. ” అని యాదవ్ తెలిపారు.

రైల్వే స్టేషన్‌కు సుమారు 5 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత, తాము మరికొంత మంది విద్యార్థులను కలిశామని అయితే రద్దీగా ఉండే రైలులో ఎక్కలేకపోయామని తెలిపారు. అలా మొదటి మూడు రైళ్లను కోల్పోయామని యాదవ్ చెప్పారు. “అదృష్టవశాత్తూ, మాకు ఇంకో రైలు వచ్చింది, కానీ ఖాళీ సీట్లు లేవు. మేము నేలపై కూర్చోవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత మా రైలులో పేలుడు వినిపించింది కూడా. చివరికి రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించి మమ్మల్ని మా గమ్యస్థానానికి తీసుకువెళ్లింది,” యాదవ్ అన్నారు. పాకిస్తానీ అమ్మాయి రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో వారు టాక్సీని ఏర్పాటు చేశారు. ఇతర పాకిస్తానీ జాతీయులను రొమేనియా సరిహద్దుకు తరలించడానికి బస్సును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సదరు యువతి తన సొంత గ్రామానికి చేరుకుంది.