కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతీయ రైల్వే కూడా తన వంతుగా కృషి చేస్తూ ఉంది. భారతదేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి రాత్రి-పగలు అనే తేడా లేకుండా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లు పరుగులు తీస్తూ ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో భారతీయ రైల్వే సేవలను తక్కువ చేసి చూడలేము. మరో వైపు ప్రయాణీకులను కూడా గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉన్నాయి.
భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల్లో 86 వరకు ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కృషి చేయనున్నారు. ఇప్పటికే నాలుగు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయి. మిగిలిన 30 ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్న అన్ని రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ బారినపడే రైల్వే సిబ్బందికి అవసరమైన వైద్య సౌకర్యాలను అందించే దిశగా భారతీయ రైల్వే కీలక అడుగులు వేస్తోంది. ఒక్కో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకు సంబంధించిన నిధులను విడుదల చేసే అధికారం జనరల్ మేనేజర్లకు రైల్వే శాఖ కల్పించింది.
రైల్వే ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యలను కూడా భారతీయ రైల్వే పెంచుతూ వెళుతోంది. కోవిడ్ చికిత్స అందించడానికి బెడ్ల సంఖ్యను 2,539 నుంచి 6,972కి పెంచారు. ఐసీయూ పడకల సంఖ్యను 273 నుంచి 573కి పెంచారు. వెంటిలేటర్ల సంఖ్య 62 నుంచి 296కు రైల్వే శాఖ పెంచింది. ఆసుపత్రులకు కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బిఐపిఏపి మెషీన్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటివన్నీ రైల్వే ఆసుపత్రుల్లో సమకూర్చుతూ ఉన్నారు. రైల్వే ఉద్యోగుల ఆరోగ్యంపై రైల్వే శాఖ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంది. రైల్వే ఉద్యోగులందరికీ వ్యాక్సిన్లు వేయించే పనిలో భారతీయ రైల్వే ఉంది.