More

    హెచ్చరించిన సాధువులు.. కాషాయ యూనిఫామ్ మార్చేశారు

    రామాయణ్ రైలులో వెయిటర్స్‌కు కాషాయ దుస్తులు ధరించేలా తీసుకువచ్చిన డ్రెస్ కోడ్‌ పై తీవ్ర దుమారం మొదలైన సంగతి తెలిసిందే..! రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటర్లకు కాషాయ యూనిఫారాలు వెంటనే మార్చకపోతే ఆ రైలును అడ్డుకుంటామని ఉజ్జయినికి చెందిన సాధువులు హెచ్చరికలు జారీ చేశారు. కాషాయ యూనిఫారం మార్చకపోతే డిసెంబర్‌ 12న ఢిల్లీలో పట్టాలపై బైఠాయింపు జరుపుతామని సాధువులు కేంద్ర రైల్వేమంత్రికి చెప్పారు. రామాయణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటర్లు సాధువులు తరహాలో కాషాయ దుస్తులు, తలపాగాలు ధరించి వడ్డనలు చేయడం, ఇతర సేవలందించడం హిందూ మతానికి అవమానకరమని ఉజ్జయిని అఖాడా పరిషద్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేశ్‌పురి వ్యాఖ్యలు చేశారు. సాధువులు ధరించే తలపాగాతో కాషాయరంగు డ్రెస్ ధరించి, పవిత్ర రుద్రాక్షలు ధరించడం హిందూ మతాన్ని అవమానించడమేనని.. ఇది హిందు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని, వెంటనే వారి డ్రెస్‌ కోడ్ మార్చాలని ఎన్నో హిందూ సంఘాలు కూడా యూనిఫామ్ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.

    దీంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రామాయణ్ ఎక్స్‌ప్రెస్ రాముడి జీవితానికి సంబంధించిన ప్రదేశాల గుండా వెళుతున్న రామాయణ్ ఎక్స్‌ప్రెస్‌లోని వెయిటర్ల కాషాయ వేషధారణను మారుస్తామని ఐఆర్సీటీసీ చెప్పింది. ‘‘వెయిటర్ల వృత్తిపరమైన వస్త్రధారణలో దుస్తులు పూర్తిగా మార్చాం. భక్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. దేశంలోని మొట్టమొదటి రామాయణ్ సర్క్యూట్ రైలు నవంబరు 7వతేదీన సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 17 రోజుల పాటు రాముడి జీవితానికి సంబంధించిన 15 యాత్రా స్థలాల మీదుగా వెళుతోంది. అయోధ్య, ప్రయాగ్, నందిగ్రామ్, జానక్‌పూర్, చిత్రకూట్, సీమర్హి, నాసిక్, హంపీ, రామేశ్వరం ప్రాంతాల్లో మొత్తం 7,500 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతోంది. ఎంతో మంచి ఉద్దేశ్యంతో భారతీయ రైల్వే ఈ రైలును తీసుకుని వచ్చినప్పటికీ.. అనుకోని విధంగా విమర్శలను ఎదుర్కొంది.

    Trending Stories

    Related Stories